విశాఖపట్నం: తమిళనాడు తీరానికి దగ్గరలో నైరుతి బంగాళాఖాతంలో 0.9 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. 
 అలాగే దక్షిణ బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రస్తుతం ఆగ్నేయ, నైరుతి బంగాళాఖాతం ప్రాంతాల్లో 1.5 కిలోమీటర్ల ఎత్తులో కొనసాగుతోందని... వీటి ప్రభావంతో దక్షిణాది రాష్ట్రాలపైకి సముద్రం నుంచి తూర్పుగాలులు వీస్తున్నాయని తెలిపారు. 

ఈ ప్రభావంతో రాగల మూడు రోజులు రాష్ట్ర వ్యాప్తంగా ఉరుములు, మెరుపులతో అక్కడక్కడ తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని  వాతావరణ కేంద్రం తెలిపింది. మంగళవారం నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో ఓ మోస్తరు వర్షాలు, ఇతర జిల్లాల్లో అక్కడక్కడ చెదురుమదురుగా వాన జల్లులు పడ్డాయి. గరిష్ఠ, కనిష్ఠ ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2-3 డిగ్రీలు ఎక్కువగా నమోదయ్యాయి. కావలిలో 35 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది.

ఇటీవల కురిసిన భారీ వర్షాలతో రాష్ట్రంలోని నదులు, కాలువలు, వాగులు వరద నీటితో ప్రమాదకర రీతిలో వరద నీటితో ప్రవహించాయి. అంతేకాకుండా నీటి పారుదల ప్రాజెక్టులు, చెరువులు నిండుకుండల్లా మారాయి. ముఖ్యంగా కృష్ణానది ప్రమాదకర రీతిలో ప్రవహించి ఆందోళనను కలిగించింది. అయితే వర్షాలు తగ్గుముఖం పట్టడంతో ఎలాంటి ప్రమాదం చోటుచేసుకోలేదు. 

వర్షాల కారణంగా చేతికొచ్చిన పంట నీటమునిగి అన్నదాతలు తీవ్రంగా నష్టపోయారు. ఇలా ఇటీవల కురిసిన భారీ వర్షాలు తీవ్ర నష్టాన్ని కలిగించగా మళ్లీ వర్షాలు కురిసే అవకాశముందన్న హెచ్చరికలు రైతుల్లో ఆందోళనను రేకెత్తిస్తున్నాయి. అయితే భారీ వర్షాలు కురిసే అవకాశాలు లేవని కేవలం సాధారణ వర్షపాతమే నమోదయ్యే అవకాశాలున్నాయన్న మాట వారికి ధైర్యాన్నిస్తోంది.