Asianet News TeluguAsianet News Telugu

డబ్బు కోసం ఇంత నీచమా.. ఛాసిస్ నెంబర్లను తుక్కుగా కొన్నారు: జేసీ ట్రావెల్స్‌పై పేర్ని నాని ఫైర్

అనంతపురం జిల్లా టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి అరెస్ట్ నేపథ్యంలో ఏపీ రవాణా శాఖ మంత్రి పేర్ని నాని స్పందించారు. అశోక్ లే ల్యాండ్ కంపెనీ వద్ద మిగిలిపోయిన 154 బీఎస్-3 లారీ ఛాసిస్‌లను ఇంజన్లతో సహా తుక్కు కింద జేసీ ట్రావెల్స్ కొనుగోలు చేసిందని మంత్రి పేర్కొన్నారు. 

ap transport minister perni nani comments on jc prabhakar reddy arrest
Author
Amaravathi, First Published Jun 13, 2020, 2:43 PM IST

అనంతపురం జిల్లా టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి అరెస్ట్ నేపథ్యంలో ఏపీ రవాణా శాఖ మంత్రి పేర్ని నాని స్పందించారు. అశోక్ లే ల్యాండ్ కంపెనీ వద్ద మిగిలిపోయిన 154 బీఎస్-3 లారీ ఛాసిస్‌లను ఇంజన్లతో సహా తుక్కు కింద జేసీ ట్రావెల్స్ కొనుగోలు చేసిందని మంత్రి పేర్కొన్నారు.

జేసీ ప్రభాకర్ రెడ్డి భార్య ఉమా రెడ్డి, కుమారుడు జేసీ అస్మిత్ రెడ్డి డైరెక్టర్లుగా వ్యవహరిస్తున్న జటాధర ఇండస్ట్రీస్, అలాగే అనుచరుడు గోపాల్ రెడ్డి అండ్ కంపెనీల పేరిట 66 బీఎస్ 3 లారీలను నకిలీ డాక్యుమెంట్లు ఉపయోగించి రిజిస్టర్ చేశారని పేర్ని నాని తెలిపారు. ఈ వాహనాలను కొనుగోలు చేయరాదని సుప్రీంకోర్టు నిషేధం విధించిందని మంత్రి చెప్పారు.

Also read:సూత్రధారులను వదిలేసి చిన్నాన్నను అరెస్టు చేశారు: జేసీ పవన్ రెడ్డి

ఈ నేపథ్యంలో 10.01.2020న ఏపీ రవాణా శాఖ అశోక్ లే ల్యాండ్‌ను వివరణ కోరినట్లు నాని వెల్లడించారు. దీనిపై స్పందించిన సదరు కంపెనీ 23.01.20న 66 ఛాసిస్‌లలో 40 గోపాల్ రెడ్డి అండ్ కోకు, 26 ఛాసిస్‌లను జటాధర ఇండస్ట్రీస్‌కు స్క్రాప్ కింద విక్రయించినట్లుగా వివరణ ఇచ్చిందని వెల్లడించారు.

దీనిపై రవాణా శాఖ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు నాని వెల్లడించారు. అనంతపురం వన్ టౌన్ పోలీసులు, ట్రాన్స్‌పోర్ట్ అధికారులు దర్యాప్తు చేశారని.. ఈ ఛాసిస్ నెంబర్లన్నీ నాగాలాండ్‌లోని కోహిమాలో రిజిస్టర్ చేశారని మంత్రి వెల్లడించారు.

దీని ఆధారంగా అనంతపురం ట్రాన్స్‌పోర్ట్ అధికారులు కోహిమా వెళ్లారని చెప్పారు. అలాగే అశోక్ లే ల్యాండ్ ఆఫీసులో చేసిన విచారణలో ఇవి మొత్తం 66 ఛాసిస్ నెంబర్లు కాదని.. 154 అని తేలిందని మంత్రి వెల్లడించారు.

29 అనంతపురంలో, 3 కర్నూలు, 24 వివిధ రాష్ట్రాల్లో రిజిస్టర్ అయినట్లు పేర్ని నాని తెలిపారు. మరో 97 ఛాసిస్ నెంబర్లను కోహిమాలో ఎన్‌వోసి తీసుకుని ఏపీకి ట్రాన్స్‌ఫర్ చేశారని.. వీటిలో 54 అనంతపురంలో, 15 వివిధ జిల్లాల్లో ఉన్నాయని, కొన్ని ఇతర రాష్ట్రాల్లో ఉన్నాయని నాని చెప్పారు.

లారీలను రిజిస్టర్ చేయడమే తప్పయితే వాటిని బస్సులుగా మార్చి తిప్పడం మరో నేరమని మంత్రి అన్నారు. జేసీ ట్రావెల్స్‌కు కాసుల కక్కుర్తి తప్పించి, ప్రజల ప్రాణాలు లెక్కలేదని నాని వ్యాఖ్యానించారు.

Also Read:తమ్ముడి అరెస్టుపై జేసీ దివాకర్ రెడ్డి రియాక్షన్: జగన్ మీద సెటైర్లు

మొత్తం 154 ఛాసిస్ నెంబర్లలో 101 ఆంధ్రప్రదేశ్‌లో, కర్ణాటకలో 33, తెలంగాణలో 15, తమిళనాడు, ఛత్తీస్‌గఢ్‌లలో ఒక్కొక్కటి ఉన్నాయని.. మరో మూడు లెక్క తేలాల్సి వుందన్నారు. ఏపీ పరిధిలో ఉన్న 95 లారీల రిజిస్ట్రేషన్‌ను రవాణా శాఖ రద్దు చేసిందని, మిగిలినవి కోర్టు కేసుల్లో ఉన్నందున త్వరలోనే వాటిని కూడా క్యాన్సిల్ చేస్తామన్నారు.

వీటిలో 66 వాహనాలను సీజ్ చేశామని పేర్ని నాని వెల్లడించారు. 101 వాహనాల్లో 90 వాటికి ఫేక్ ఇన్సూరెన్స్ పత్రాలు  ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. జగన్మోహన్ రెడ్డిని అసభ్యపదజాలంతో దూషించినందుకు లభించిన ప్రతిఫలమే జేసీ ట్రావెల్స్‌లో అక్రమాలని పేర్ని నాని ఆరోపించారు. జేసీ బ్రదర్స్ అక్రమాలపై ఎక్కడైనా చర్చకు సిద్ధమని మంత్రి... చంద్రబాబుకు సవాల్ విసిరారు.

Follow Us:
Download App:
  • android
  • ios