దివాకర్ ట్రావెల్స్ పై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రవాణా శాఖ కొరడా ఝులిపించింది. దివాకర్ ట్రావెల్స్ పై కేసు నమోదు చేసింది. నిబంధనలకు విరుద్ధంగా ట్రావెల్స్ నడపడంతో పాటు.. అనేక ఉల్లంఘనలకు పాల్పడిన నేపథ్యంలో దివాకర్ ట్రావెల్స్‌పై కేసులు నమోదు చేసినట్లు రవాణా శాఖ ప్రకటించింది. 

31 స్టేజ్ క్యారేజ్, 18 కాంట్రాక్టు క్యారేజ్ బస్సులపై కేసులు నమోదు చేయడంతో పాటు.. వాటి పర్మిట్‌ను రద్దు చేసినట్లు అధికారులు వెల్లడించారు. మరో 10 స్టేజ్ క్యారేజ్ బస్సులను సీజ్ చేసినట్లు తెలిపారు. దివాకర్ ట్రావెల్స్ యజమానులు మోటార్ వెహికల్ చట్టాలు, అన్ని రకాల నిబంధనలను ఉల్లంఘించారని అన్నారు. 

బస్సులను తిప్పుతూ రహదారి భద్రత నిబంధనలను అతిక్రమించి ప్రభుత్వాన్ని, ప్రయాణికులను మోసం చేశారని అన్నారు. దివాకర్ ట్రావెల్స్ బస్సుల ఇన్సూరెన్సులు కూడా నకిలీవని ఫిర్యాదు అందాయన్నారు. వీటిపై కూడా లోతుగా దర్యాప్తు జరుపుతున్నామని రవాణా శాఖ కమిషనర్ చెప్పారు. బస్సుల ఇన్సురెన్సులు కూడా నకిలీవని ఫిర్యాదులు అందాయని, వాటిపైన కూడా లోతుగా దర్యాప్తు జరుగుతోందని పేర్కొన్నారు.

ప్రభుత్వ ఖజానాకు గండికొడుతూ జిల్లాలో దివాకర్‌ ట్రావెల్స్‌ బస్సులు రాకపోకలు సాగిస్తున్నాయి. అనుమతులు లేకుండా తిరుగుతుండడంతో పాటు అనుమతి లేని రహదారులపై కూడా దర్జాగా రాకపోకలు  సాగిస్తున్నాయి. తాజాగా రవాణాశాఖ అధికారుల దాడులతో బట్టబయలు అయిన వ్యవహారం జిల్లాలో కొన్నేళ్ల నుంచి జరుగుతున్నా అధికారాన్ని అడ్డుపెట్టుకొని ట్రావెల్స్‌ దందా కొనసాగించారనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. గతంలో పనిచేసిన రవాణాశాఖ అధికారులు చూసీ చూడనట్లు వ్యవహరించారు.. కాగా.. తాజాగా దివాకర్ ట్రావెల్స్ పై చర్యలు తీసుకున్నారు.