ఏపీ లో బీఆర్ఎస్ ఎంట్రీపై మంత్రి రోజా కీలక వ్యాఖ్యలు
రాష్ట్రంలో బీఆర్ఎస్ ఎంట్రీకి ప్రయత్నాలు చేస్తున్న విషయమై ఏపీ మంత్రి రోజా స్పందించారు. రాష్ట్రానికి ఏం చేస్తుందో ఆ పార్టీ చెప్పాలన్నారు. తెలంగాణ సాధనకోసం పోరాటం చేసిన పార్టీ ఏపీకి ఏం చేస్తుందో చూడాలన్నారు.
గుంటూరు:ఏపీకి రావాల్సిన వాటిపై బీఆర్ఎస్ సమాధానం చెప్పాలని ఏపీ రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ఆర్ కే రోజా కోరారు.సోమవారం నాడు తాడేపల్లిలో మంత్రి రోజా మీడియాతో మాట్లాడారు. ఎవరైనా పార్టీలు పెట్టొచ్చు, పోటీ చేయవచ్చన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అన్యాయంగా విభజించారని మంత్రి రోజా అభిప్రాయపడ్డారు. రాష్ట్ర విభజనతో ఆంధ్రప్రదేశ్ తీవ్రంగా నష్టపోయిందన్నారు. ఏపీ పునర్విభజన చట్టం ఇచ్చిన హామీలు ఇంకా అమలు కాలేదని మంత్రి గుర్తు చేశారు. తెలంగాణ రాష్ట్రం కోసం పోరాటం చేసిన బీఆర్ఎస్ .... ఏపీకి ఏం చేస్తుందో చూడాలన్నారు. ఓటుకు నోటు కేసుతో రాష్ట్రానికి చంద్రబాబు తీరని ద్రోహం చేశారని ఆమె విమర్శించారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎంట్రీ కోసం బీఆర్ఎస్ రంగం సిద్దం చేసింది. ఏపీకి చెందిన మాజీ మంత్రి రావెల కిషోర్ బాబు, రిటైర్డ్ ఐఎఎస్ అధికారి తోట చంద్రశేఖర్, రిటైర్డ్ ఐఆర్ఎస్ అధికారి పార్థసారథిలు ఇవాళ బీఆర్ఎస్ లో చేరుతారని సమాచారం. ఈ విషయమై మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు ఏపీ మంత్రి రోజా ఈ వ్కాఖ్యలు చేశారు.
also read:కందుకూరు, గుంటూరు తొక్కిసలాట కారకులపై చర్యలు తప్పవు: ఏపీ మంత్రి రోజా వార్నింగ్
దేశ వ్యాప్తంగా పార్టీని విస్తరించాలని కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు.ఈ క్రమంలోనే ఏపీలో కూడా పార్టీ శాఖ ఏర్పాటుకు ప్రయత్నాలు ప్రారంభించారు. ఏపీ రాజకీయాల్లో బీఆర్ఎస్ కీలకంగా వ్యవహరించేలా వ్యూహరచన చేస్తున్నారు. గతంలో ఆయా పార్టీల్లో పనిచేసిన నేతలతో పాటు మేథావులను పార్టీలో చేర్చుకొనేందుకు కేసీఆర్ ప్రయత్నిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాపు సామాజిక వర్గంతో పాటు దళిత సామాజికవర్గానికి చెందిన ఇద్దరు నేతలు బీఆర్ఎస్ లో చేరేందుకు సానుకూలంగారంగం సిద్దం చేసుకున్నారు. రానున్న రోజుల్లో ఏపీకి చెందిన పలువురు నేతలు బీఆర్ఎస్ లో చేరే అవకాశం ఉందని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు.