అమరావతి: పదో తరగతి పరీక్షల దిశగా ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. ఇప్పటివరకు పదో తరగతి విద్యార్ధులు మొత్తం 11 పేపర్లు రాయాల్సి వుండగా వాటిని కేవలం ఆరు పేపర్లకు కుదించింది. ఈ మేరకు అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. 

కరోనా నేపధ్యంలో ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు... ఈ ఏడాది రెగ్యులర్, సప్లిమెంటరీ పరీక్షలకు ఇది వర్తిస్తుందని పేర్కోన్నారు. కేవలం ఈ ఏడాదికి మాత్రమే ఈ పేపర్ల కుదింపు వర్తిస్తుందని ప్రభుత్వం ఉత్తుర్వుల్లో పేర్కొంది. వచ్చే ఏడాది నుండి యదావిదిగా 11 పేపర్లు ఉంటాయి అని స్పష్టం చేసింది. ఎక్కువ రోజులు పరీక్షలు నిర్వహించడం ద్వారా కరోనా వ్యాపించే అవకాశం వుంటుంది కాబట్టి తక్కువ రోజుల్లో పరీక్షలు పూర్తి చేయాలని ఈ నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం. 

షెడ్యూల్ ప్రకారంగానే టెన్త్ పరీక్షలు నిర్వహిస్తామని ఇప్పటికే ఏపీ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు ప్రకటించిన విషయం తెలిసిందే. జూలై 10వ తేదీ నుండి రాష్ట్రంలో టెన్త్ పరీక్షలు నిర్వహిస్తామని ఆయన స్పష్టం చేశారు. 

read more   తెలంగాణలో పదో తరగతి పరీక్షలు రద్దు.. ఎగ్జామ్స్ లేకుండానే పాస్

తెలంగాణలో పరీక్షలు రద్దు చేసినప్పటికి ఏపీలో మాత్రం పరీక్షలు నిర్వహిస్తామని ఆయన తేల్చి చెప్పారు. 11 పేపర్లకు బదులుగా ఆరు పేపర్లకే పరీక్షలు నిర్వహిస్తామని ఆయన ఇప్పటికే ప్రకటించగా తాజాగా ఉత్తర్వులు వెలువడ్డాయి. 

 స్థానిక సంస్థల ఎన్నికల కారణంగా ఏపీలో రెండు సార్లు టెన్త్ పరీక్షలు వాయిదా పడ్డాయి. ఈ లోపుగా కరోనా కేసులు పెరిగిపోవడంతో పరీక్షలను నిర్వహణ సాధ్యపడలేదు. దీంతో ఈ ఏడాది జూలై 10 వ తేదీ నుండి పరీక్షలునిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకొంది.

మరోవైపు తెలంగాణ రాష్ట్రంలో టెన్త్ పరీక్షలను ప్రభుత్వం రద్దు చేసింది. విద్యార్థులందరిని పాస్ చేసింది. మరోవైపు విద్యార్థులకు గ్రేడింగ్ ఇచ్చేందుకు కసరత్తు చేస్తోంది. తమిళనాడు ప్రభుత్వం కూడ తెలంగాణ బాటలోనే పరీక్షలను రద్దు చేసింది. కానీ ఏపీ ప్రభుత్వం మాత్రం పరీక్షలను యధాతథంగా కొనసాగిస్తామని ప్రకటించింది.