Asianet News Telugu

అప్పుడు జగన్ ఒక్క ఛాన్స్ అడిగారు... ఎందుకో ఇప్పుడు అర్థమయ్యింది..: టిడిపి అనిత సంచలనం

సీఎం జగన్మోహన్ రెడ్డి తన అధికారమనే రాక్షస పంజాని ప్రస్తుతం గిరిజనుల మన్యంపై విసిరి దోపిడీ చేస్తున్నాడని టిడిపి మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత ఆరోపించారు. 

ap tdp president vangalapudi anitha serious on cm ys jagan akp
Author
Amaravati, First Published Jul 15, 2021, 4:55 PM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

అమరావతి: గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో జగన్మోహన్ రెడ్డి ప్రజలను అడిగిన ఒక్కఛాన్స్ ఈ రాష్ట్రాన్ని దోచుకోవడానికని అర్థంకావడానికి రెండేళ్లు పట్టిందని రాష్ట్ర తెలుగు మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత అన్నారు. ఇప్పుడు ముఖ్యమంత్రి కన్ను పంచభూతాలను ఆరాధించే గిరిజనులు, వారి నివాసప్రాంతంపై పడిందని ఆందోళన వ్యక్తం చేశారు. 

''జగన్మోహన్ రెడ్డి తన అధికారమనే రాక్షస పంజాని ప్రస్తుతం గిరిజనుల మన్యంపై విసిరాడు. మన్యం నేలలోని విలువైన ఖనిజ సంపదను తనపరం చేసుకుంటున్నాడు. తూర్పుగోదావరి జిల్లాలోని రౌతులపూడి నుంచి విశాఖపట్నం జిల్లాలోని నర్సీపట్నం, సిరిపురం వరకు భారీరోడ్డు నిర్మాణం చేశారు. దాని ద్వారా భమిడిక అనే పంచాయతీ పరిధిలోని ఖనిజం తవ్వకాలకు అనుమతులు పొందారు. అక్కడ జరుగుతున్న ఖనిజం తవ్వకాల వ్యవహారంలో విజయసాయిరెడ్డి కుమారుడి ప్రమేయముంది. జగన్మోహన్ రెడ్డి, ఆయన బంధువర్గం జేబులు నింపుకోవడానికి ఆదీవాసుల జీవనవిధానాన్ని భ్రష్టుపట్టించి, వారితాలూకా సంపదను దోచేస్తున్నారు. ఒక్క మాటలేచెప్పాలంటే అటవీపరిరక్షణ చట్టాలనుకూడా తుంగ లో తొక్కిమరీ జగన్ అండ్ కో ఖనిజ తవ్వకాలు సాగిస్తోంది'' అని ఆరోపించారు. 

''అక్కడ ఇంత జరుగుతున్నా నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్, అటవీశాఖలు ఏం చేస్తున్నాయి. ఆయా విభాగాల్లోని అధికారులు వారు చేయాల్సిన పని మర్చిపోయి వైసీపీకి తొత్తులుగా మారారా? అని ప్రశ్నిస్తున్నాం. ఈ మధ్యనే తాము ఖనిజ తవ్వకాలు జరుగుతున్న ప్రాంత పరిశీలనకు వెళ్లాము. అక్కడవేసిన రోడ్డు, జరుగుతున్న మైనింగ్ వ్యవహారం చూశాక ఒక్కరోజులో ఇవన్నీఎలా సాధ్యమయ్యాయని వాపోయాము. ఆదీవాసులు నివాసప్రాంతాల మధ్యనుంచి కొండలు, గుట్టలు తవ్విమరీ ఖనిజాన్ని తరలించడానికి రోడ్డువేశారు'' అని తెలిపారు. 

read more  భయంభయంగానే రోడ్లపైకి... ప్రాణాలపై ఆశలు వదులుకునే బయటకు: అచ్చెన్న సంచలనం

''గ్రీన్ ట్రైబ్యునల్, అటవీశాఖ చట్టాల నిబంధనల ప్రకారం అటవీప్రాంతంలో ఏదైనా రోడ్డువేయాలంటే ఎన్నోఅనుమతులు, మరెన్నో వ్యయప్రయాసలుంటాయి. అటవీశాఖ నిబంధనల ప్రకారం కేవలం 8మీటర్ల వెడల్పుకి మించి రోడ్డువేయడానికి వీల్లేదు. కానీ తాము అక్కడ చూసినరోడ్డు సుమారుగా40మీటర్ల వెడల్పుతోఉంది. ఒక్కమాటలో చెప్పాలంటే మినీహైవేనే అడవిలో నిర్మించారు. రోడ్డునిర్మాణానికి స్థానిక డీఎఫ్ వో  అనుమతివ్వకపోవడంతో, కలెక్టర్ కేవలం ఒకేఒక గంటలో అనుమతిచ్చారు.  ఆ విధంగా పొందిన అనుమతితో ఎన్ఆర్ ఈజీఎస్ నిధులతో రోడ్డువేశారు. ఉపాధి కల్పించే పథకం కింద, కేవలం మనుషులతో మాత్రమే వేయాల్సిన రోడ్డుని భారీ  యంత్రాల సాయంతో వేసేశారు. ఎప్పుడో బ్రిటీష్ పాలన లో ఈస్టిండియా కంపెనీ దేశాన్ని దోచుకుందని చదువుకున్నాము. కానీ ఇప్పడు కళ్లముందే కడప కంపెనీల  దోపిడీ ఎలా ఉంటుందో చూస్తున్నాము. కడప కంపెనీలు వాటి తాలూకా దళారులు, జగన్మోహన్ రెడ్డి బంధువులకు చట్టాలు, నిబంధనలు ఏవీ వర్తించవు. వారంతా అనుసరించేది రాజారెడ్డి రాజ్యాంగాన్నే. దానిప్రకారంగానే పచ్చని మన్యంలో యథే చ్ఛగా ఖనిజ సంపదను దోపిడీచేస్తున్నారు'' అని విరుచుకుపడ్డారు.

''అటవీ ప్రాంతంలో రోడ్లు వేయడానికి ఎట్టిపరిస్థితుల్లోనూ అనుమతివ్వరు. అలాంటిది కేవలం గంటల వ్యవధిలో అటవీ భూమిలో ఎలా రోడ్డువేశారు. ఎవరి అనుమతితో వేశారు? నచ్చినట్లు అనుమతులు తీసుకొని, ఐఏఎస్ అధికారులతోనే అంతా చేయించేస్తారా? ఐఏఎస్, ఐపీఎస్ అధికారులంతా జగన్ కింద పనిచేస్తున్నామని భావిస్తున్నారు తప్ప రాజ్యాంగం ప్రకారం పనిచేయాలని భావించడం లేదు. అసలు ఏపీలోని ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు రాజ్యాంగాన్ని మర్చిపోయినట్లున్నారు. అటవీశాఖ అనుమతులతోపాటు, పర్యావరణ విభాగమైన సీఎఫ్ వో  అనుమతులుకూడా కావాలి. సీఎఫ్ వో అనుమతి పొందాకే, మైనింగ్ అనుమతులుపొందాలి. అదేమీ జరగలేదు'' అన్నారు. 

''ఎస్సీ,ఎస్టీల ఓట్లతో అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి, ఆయన ఎమ్మెల్యేలు ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఎస్సీలను దాడులతో భయపెట్టేసి ఇళ్లల్లోంచి బయటకురాకుండా చేశారు. అమాయకులైన గిరిజనులు, ఆదీవాసులే లక్ష్యంగా ఇప్పుడు వేధింపులు, దాడులు, దారుణాలు ప్రారంభమయ్యాయి. అడవి పుత్రుల పరిరక్షణ చట్టాలు ఏమయ్యాయి? పర్యావరణ పరిరక్షణ ఏమైంది. గిరిజన ప్రాంతంలో వేసిన భారీ రోడ్డుకోసం ఎన్నోఏళ్ల నుంచి ఉన్న భారీవృక్షాలను నేలకూల్చారు. అక్కడున్న వన్యప్రాణులను సైతం ఎటు తరిమేశారో, చంపేశారో తెలియడంలేదు. గతంలో ఇదే మైనింగ్ విషయంపై ప్రతిపక్షనేత హోదాలో జగన్మోహన్ రెడ్డి చింతపల్లిలో భారీసభ నిర్వహించాడు. ఆరోజు ఆదీవాసులంతా తనవారేనని, వారికి అన్యాయం చేస్తే చంద్రబాబు నాయడి తలనరుకుతానని ప్రగల్భాలు పలికాడు. ఇప్పుడేమో ఆదీవాసుల తలలు నరికేలా విలువైన ఖనిజసంపదను లూఠీచేస్తున్నాడు'' అని వంగలపూడి అనిత మండిపడ్డారు. 

 

Follow Us:
Download App:
  • android
  • ios