ఆంధ్ర ప్రదేశ్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు ప్రధాన అనుచరుడు, టెక్కలి ఐటిడిపి కోఆర్డినేటర్ వెంకటేశ్ ను సీఐడి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.   

గుంటూరు: ఆధ్ర ప్రదేశ్ లో ప్రతిపక్ష టిడిపి నాయకులు ఎక్కడ దొరుకుతారా అని వేచిచూస్తున్న వైసిపి ప్రభుత్వం ఏ చిన్న తప్పుచేసినా వదిలిపెట్టడం లేదు. ఇప్పటికే పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు (chandrababu naidu), ఆయన తనయుడు నారా లోకేష్ (nara lokesh) పై అనేక కేసులు నమోదుచేయడమే కాదు చాలామంది సీనియర్లను వివిధ కేసుల్లో అరెస్ట్ చేసారు. ఇలా ఏపీ టిడిపి చీఫ్ కింజరాపు అచ్చెన్నాయుడి (kinjarapu atchannaidu)ని కూడా అరెస్ట్ చేసారు. తాజాగా అచ్చెన్న ముఖ్య అనుచరుడిని సీఐడి (AP CID) అధికారులు అదుపులోకి తీసుకున్నారు. 

అచ్చెన్నాయుడు ప్రాతినిధ్యం వహిస్తున్న టెక్కలి (tekkali) నియోజకవర్గ ఐటిడిపి కోఆర్డినేటర్ గా అప్పిని వెంకటేశ్ పరిచేస్తున్నాడు. ఇతడు అచ్చెన్న ముఖ్య అనుచరుల్లో ఒకడు. తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా వ్యవహారాలను చూసుకునే ఇతడిని తాజాగా ఏపీ సీఐడి అధికారులు అదుపులోకి తీసుకున్నారు.

వైసిపి (ysrcp) ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలుచేస్తున్న అమ్మ ఒడి (amma odi), వాహనమిత్ర (vahanamithra) పథకాలను ఈ ఏడాది రద్దు చేసినట్లు సోషల్ మీడియాలో ఓ పోస్ట్ చక్కర్లు కొడుతోంది. ఆర్థిక ఇబ్బందులతో సతమతం అవుతున్న జగన్ సర్కార్ ఈ రెండు సంక్షేమ పథకాలను నిలిపివేస్తున్నట్లు ఈ పోస్ట్ సారాంశం. ఇలా ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేస్తున్న ఈ సోషల్ మీడియా పోస్ట్ పై గత నెల (మే 30న) చివర్లో సీఐడి కేసు నమోదు చేసి విచారణ చేపట్టింది. 

ఈ క్రమంలోనే టెక్కలి టిడిపి నాయకుడు వెంకటేశ్ ఈ పోస్ట్ ను షేర్ చేసినట్లు అధికారులు గుర్తించారు. దీంతో గురువారం ఉదయం వెంకటేశ్ ను అదుపులోకి తీసుకున్న అధికారులు సాయంత్రం వరకు విచారించారు. అనంతరం అతడిని వదిలిపెట్టి తిరిగి శుక్రవారం ఉదయం మళ్లీ విచారణకు రావాలంటూ సూచించారు. 

సోషల్ మీడియా పోస్ట్ ను కేవలం షేర్ చేసిన పాపానికి వెంకటేశ్ ను అదుపులోకి తీసుకుని విచారించడమేంటని టిడిపి నాయకులు సీఐడిని ప్రశ్నిస్తున్నారు. కేవలం అచ్చెన్నాయుడుపై కక్ష్యతోనే ప్రభుత్వం అతడి అనుచరులను ఇలా ఇబ్బది పెడుతున్నారని టిడిపి నాయకులు అంటున్నారు.