Asianet News TeluguAsianet News Telugu

బ్రహ్మంగారు కాలజ్ఞానంలో చెప్పింది ఈ వైసిపి నేతల గురించే: కళా ఎద్దేవా

కరోనా వంటి విపత్కర పరిస్థితుల్లో జగన్ వంటి ముద్దాయి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా వుండటం దురదృష్టకరమని ఏపి టిడిపి అధ్యక్షులు కళాా వెంకట్రావు మండిపడ్డారు. 

AP TDP President kala venkat rao satires on YSRCP Leaders
Author
Guntur, First Published May 6, 2020, 12:34 PM IST

ఒక ముద్దాయి ముఖ్యమంత్రి అయితే రాష్ట్రం ఏ విధంగా నష్టపోతుందో ఏపీని చూసి దేశ ప్రజలందరూ తెలుసుకున్నారని ఏపి తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కళా వెంకట్రావు విమర్శించారు. 11 కేసుల్లో ఏ1 ముద్దాయిగా ఉన్న వ్యక్తి మన రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావడం దురదృష్టకరమన్నారు. 12 నెలల పాలనలోనే ప్రపంచ వ్యాప్తంగా ఆంద్రప్రదేశ్ ప్రతిష్ట మంటగలిపారని... రాష్ట్రాన్ని 10 ఏళ్ళు వెనక్కి నెట్టారని అన్నారు. మూడు విధ్వంసాలు ఆరు అరాచకాలు గా ఏడాది పాలన సాగిందని మండిపడ్డారు. 

''జగన్ లో నేరస్తునికి ఉండాల్సిన లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి కానీ నాయకునికి ఉండాల్సిన ఒక్క లక్షణం కూడా లేదు. జగన్ తీసుకుంటున్న నిర్ణయాలు రాష్ట్రానికి ముప్పుగా మారాయి. ఏడాదిలోనే  వ్యవస్తలన్నింటిని నాశనం చేశారు.  ఇచ్చిన ఒక్క హామీని అమలు చేయలేదు, నవరత్నాలు పేరుతో నవ మోసాలకు పాల్పడ్డారు'' అని ఆరోపించారు. 

''ఏడాదిలొనే జగన్ కోర్టులు చేత  64 సార్లు చివాట్లు తిన్నారు. కరోనాని చూసి ప్రజలు ఎలా భయపడుతున్నారో జగన్  జే టాక్స్ ని చూసి పారిశ్రామిక వేత్తలు భయపడు తున్నారు. వైసీపీ నేతలు అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ అందినకాడికి దోచుకుంటున్నారు. భవిష్యత్ లో దొంగలు పాలకులు అవుతారని బ్రహ్మం గారు చెప్తే ఎవరి గురించో అనుకున్నాం, కానీ ఆయన చెప్పింది వైసీపీ నేతల గురించేనని ఇప్పుడు ప్రజలకు అర్ధమైంది'' అని మండిపడ్డారు. 

''రాజధాని అమరావతిని 3 ముక్కలు చేసి రాష్ట్రాన్ని రాజధాని లేని అనాథను చేసారు. 3 రాజధానుల పేరుతో 3 ప్రాంతాల్లోను వైసీపీ నేతలు కబ్జాలు, దౌర్జన్యాలు, దందాలు చేస్తున్నారు. పేదల ఆకలి తీర్చే అన్న క్యాంటీన్లు రద్దు చేసి పేద మహిళల పుస్తెలు తెంపే మద్యం దుకాణాలు తెరిచారు. ఉచిత ఇసుకను రద్దు చేసి వైసీపీ నేతలకు కమీషన్లు పెంచి సామాన్యులకు ఇసుక అందకుండా చేసారు'' అని విమర్శించారు. 

''కమీషన్ల కక్కుర్తితో పోలవరం ఆపేశారు. రైతులకి ఇచ్చిన హామీలు గాలికొదిలేశారు. కరోనా ప్రభావం లో మద్యం దుకాణాలు తెరచి ప్రజల ప్రాణాలతో చెలగాటం అడుతున్నారు. మద్యం ధరలు పెంచి వారి రక్తం పిండుతున్నారు. బడుల్లో పిల్లలలుకు పాఠాలు చెప్పే టీచర్లకు వీధుల్లో మందు బాబులను కంట్రోల్ చేసే పరిస్థితి తెచ్చారు'' అని కళా వెంకట్రావు విరుచుకుపడ్డారు. 
 


 

Follow Us:
Download App:
  • android
  • ios