పగలనక, రాత్రనక ప్రాణాలను తెగించి కష్టపడ్డ ప్రంట్ లైన్ వారియర్స్ కు ఉద్యోగ భద్రత కల్పించాల్సిన ప్రభుత్వం కర్కశంగా వ్యవహరించడం అన్యాయమని అచ్చెన్న పేర్కొన్నారు.
అమరావతి: ఫ్రంట్ లైన్ వారియర్స్ ను వైసీపీ ప్రభుత్వం వేధింపులకు గురిచేయడం బాధాకరమన్నారు టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు కింజరాపు అచ్చెన్నాయుడు. కరోనా విలయతాండవం చేస్తున్న సమయంలోనూ ఫ్రంట్ లైన్ వారియర్స్ ప్రాణాలను పణంగా పెట్టి పనిచేశారని... అలాంటివారిని నిర్ధాక్షిణ్యంగా రోడ్డున పడేయడం దుర్మార్గమన్నారు. పగలనక, రాత్రనక కష్టపడ్డారని... అలాంటి వారికి ఉద్యోగ భద్రత కల్పించాల్సిన ప్రభుత్వం కర్కశంగా వ్యవహరించడం అన్యాయమని అచ్చెన్న పేర్కొన్నారు.
''విపత్తు సమయంలో విధులు నిర్వర్తించే వారికి ఉద్యోగ భద్రత కల్పిస్తామని చెప్పిన ప్రభుత్వం ఉన్నపణంగా ఉద్యోగాల నుంచి తీసేస్తే వారెలా బ్రతకాలి? కాంట్రాక్ట్ పద్దతిలో తీసుకున్న సిబ్బందికి ఇతర ప్రభుత్వ విభాగాల్లో ఉద్యోగాలు ఇచ్చే అవకాశం ఉన్నప్పటికీ ప్రభుత్వం తాత్సారం చేయడం దేనికి సంకేతం? ఉద్యోగ భద్రత కల్పించాలని కోరుతూ గుంటూరులో కోవిడ్ ఉద్యోగులు చేస్తున్న దీక్షను భగ్నం చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము'' అన్నారు.
''విధుల్లో కొనసాగించాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని నెలల తరబడి ఉద్యోగులు ఆందోళన చేస్తున్న ప్రభుత్వం పట్టించుకోకపోవడం బాధాకరం. అన్ని రంగాల్లో ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నామని ఆర్భాటపు ప్రచారాలు చేసిన ప్రభుత్వం ఆచరణలో ఉద్యోగులను రోడ్డున పడేస్తోంది. కరోనా విధుల కోసం 2020, సెప్టెంబర్ విధుల్లోకి తీసుకున్న 10,000 మంది పారామెడికల్ సిబ్బందిని కూడా ప్రభుత్వం ఇబ్బందులపాలు చేసింది. వారికి ఆరు నెలలుగా జీతాలు ఇవ్వకపోగా ఈ ఏడాది ఫిబ్రవరిలో విధుల్లోంచి తొలగిస్తూ జీవో జారీ చేశారు. ప్రభుత్వం ఆదుకోవాలంటూ ఫ్రంట్ లైన్ వారియర్స్ .... ప్రజాప్రతినిధుల కాళ్లు పట్టుకునే దుస్థితికి తీసుకొచ్చారు'' అని ఆందోళన వ్యక్తం చేశారు.
''ఇప్పటికే అన్న విభాగాల్లో హెల్త్ అలవెన్స్ లు పెండింగ్ లో పెట్టారు. కరోనా విధుల్లో మృతి చెందిన వారియర్స్ కుటుంబాలకు రూ. 50 లక్షల బీమా ఇవ్వలేదు. కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని కాంట్రాక్టర్లకు, వాలంటీర్లకు ధారపోస్తున్న ప్రభుత్వం ప్రాణాలను సైతం లెక్కచేయకుండా కుటుంబాలను వదిలి విధుల నిర్వర్తించిన ఫ్రంట్ లైన్ వారియర్స్ విషయంలో కర్కశంగా ప్రవర్తించడం దారుణం. వెంటనే వారియర్స్ ను ప్రభుత్వం విధుల్లోకి తీసుకోవాలి. ఉద్యోగ భద్రత కల్పించాలి. ప్రభుత్వం దిగిరాకపోతే ఫ్రంట్ లైన్ వారియర్స్ తో కలిపి రాష్ట్ర వ్యాప్త ఆందోళన చేపడతాం'' అని అచ్చెన్న ప్రకటించారు.
