రాజధాని కోసం భూములివ్వడమే రైతుల తప్పా అని ప్రశ్నించారు ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు. రైతులను అరెస్ట్ చేయడం దేశంలో ఎక్కడా లేదని ఆయన అన్నారు. మీలాగే మేం అడ్డుకుని వుంటే ఆ రోజు మీరు పాదయాత్ర చేసేవారా అని అచ్చెన్నాయుడు నిలదీశారు.

ప్రజాస్వామ్యంలో అధికారపక్షం ఎంత ముఖ్యమో.. ప్రతిపక్షం కూడా అంతే ముఖ్యమని ఆయన స్పష్టం చేశారు. మేం లోపాలను ఎత్తిచూపుతాం.. సమాధానం చెప్పాల్సిందేనని అచ్చెన్నాయుడు తేల్చి చెప్పారు.

మరోవైపు రైతుల చేతికి బేడీలు వేసిన ఘటనలో ఆరుగురు పోలీస్ కానిస్టేబుళ్ల సస్పెన్షన్‌ను పోలీస్ శాఖ తాత్కాలికంగా నిలిపివేసింది. ఇదిలా ఉంటే రాజధాని అమరావతి ప్రాంత రైతులకు బేడీలు వేసి, కేసులు పెట్టి, అక్రమ అరెస్టులు చేయడాన్ని నిరసిస్తూ రాజధాని అమరావతి జేఏసీ ఈ రోజు ఛలో గుంటూరు జైలు కార్యక్రమానికి పిలుపునిచ్చింది.

పోలీసుల అరెస్ట్ లతో ఈ కార్యక్రమం ఉద్రిక్తంగా మారింది. గుంటూరు జైల్ భరో కార్యక్రమానికి అనుమతి లేదని, ఎవరు వెళ్ళడానికి వీలు లేదని చెప్పిన పోలీసులు, ఆందోళనను అడ్డుకోవటంలో భాగంగా అమరావతి జేఏసీ నేతలను, టిడిపి సిపిఐ నేతలను ఎక్కడికక్కడే గృహనిర్బంధం చేశారు.

మాజీ మంత్రి నక్కా ఆనందబాబు, అమరావతి జేఏసీ నాయకులను హౌస్ అరెస్ట్ చేశారు. పోలీసుల తీరుపై టిడిపి నేతలు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. టీడీపీ జైలు భరో కార్యక్రమానికి ఎలాంటి అనుమతి లేదని చెప్తున్న పోలీసులు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలలోనూ అరెస్ట్ ల పర్వాలు కొనసాగిస్తున్నారు .