విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డిపై నిప్పులు చెరిగారు తెలుగుదేశం పార్టీకి చెందిన మాజీమంత్రులు నిమ్మకాయల చినరాజప్ప, చింతకాయల అయ్యన్నపాత్రుడు. వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ నేతలపై దాడులు పెరిగిపోయాయని ఆరోపించారు. 

జగన్ సర్కార్ అన్ని రంగాల్లో పూర్తిగా విఫలమైందని మండిపడ్డారు. కీలకమైన పోలవరం ప్రాజెక్టు, పీపీఏల పున:సమీక్ష వంటి నిర్ణయాలతో రాష్ట్రం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటుందని తెలిపారు. జగన్ అధికారంలోకి వచ్చిన నాలుగున్నర నెలల్లో రాష్ట్రం అంధకారంగా మారిందని విమర్శించారు. 

పోలవరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందని పదేపదే ఆరోపిస్తూ రివర్స్ టెండరింగ్  కు వెళ్లారని మండిపడ్డారు. రివర్స్ టెండరింగ్ ప్రాజెక్టు నిర్మాణ పనులు దక్కించుకున్న మెఘా కృష్ణారెడ్డికి వెంటనే ఎలక్ట్రికల్ బస్సులు టెండర్ ను కట్టబెట్టారని విమర్శించారు. 

వైసీపీ ప్రభుత్వం అమలులోకి తీసుకువచ్చిన వాలంటీర్ వ్యవస్థ చాలా దారుణంగా ఉందన్నారు. అనేక గ్రామాల్లో వాలంటీర్ల వ్యవస్థల వల్ల దాడులు జరుగుతున్నాయని చెప్పుకొచ్చారు. కొంతమంది అయితే ఆత్మహత్య చేసుకుని చనిపోతున్నారంటూ విమర్శించారు.  

ప్రజావ్యతిరేక పాలన చేస్తున్న సీఎం జగన్ కు ప్రజలు త్వరలోనే గుణపాఠం చెప్తారని హెచ్చరించారు. కమీషన్ల కోసమే పోలవరం రివర్స్ టెండరింగ్, పీపీఏల పున: సమీక్ష అంటూ చెప్పుకొచ్చారు. రాబోయే రోజుల్లో సీఎం జగన్ శ్రీకృష్ణ జన్మస్థానానికి వెళ్లాల్సిందేనంటూ శాపనార్థాలు పెట్టారు.