Asianet News TeluguAsianet News Telugu

''వైసిపి భూమాయాజాలం...కొనేది లక్షల్లో, అమ్మేది కోట్లల్లో''

పేదలకు ఇళ్ల స్థలాల పథకం వైసీపీ నేతలకు ఆర్థిక ఫలాలు పథకంగా మారిందని  ఆంధ్ర ప్రదేశ్ టిడిపి అధ్యక్షులు కళా వెంకట్రావు ఆరోపించారు. 

AP TDP Chief Kala Venkat Rao  Fires on YCP Govt
Author
Guntur, First Published Jun 6, 2020, 10:59 AM IST

గుంటూరు: పేదలకు ఇళ్ల స్థలాల పథకం వైసీపీ నేతలకు ఆర్థిక ఫలాలు పథకంగా మారిందని  ఆంధ్ర ప్రదేశ్ టిడిపి అధ్యక్షులు కళా వెంకట్రావు ఆరోపించారు. వైసీపీ నేతలు దళితులు, బలహీన వర్గాలకు చెందిన వారిని బెదిరించి ఏకపక్షంగా భూములు లాక్కుని వన్ సైడ్ ట్రేడింగ్ కి పాల్పడుతున్నారని అన్నారు. ఇళ్ల స్థలాలకు భూసేకరణ పేరుతో ఎకరం 7 లక్షలు చేయని భూమిని రూ.45 లక్షలకు కొని వైసీపీ నాయకులు వాటాలు వేసుకుని పంచుకుంటున్నారని ఆరోపించారు.

''ఇళ్ల స్థలాల పేరుతో ఇప్పటికే రూ.500 కోట్ల అవినీతి జరిగింది. ప్రతి నియోజకవర్గంలో 10 కోట్లకు పైబడి వైసీపీ నేతలు దండుకుంటున్నారు. ఇళ్ల స్థలాల కొనుగోలు పేరుతో లక్షలు విలువచేసే భూములను కోట్లు విలువ చేసే భూములుగా చూపి దోచుకుంటున్నారు. పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లులో భూమికి మంచి రేటు ఇప్పిస్తామని, అందులో వాటా ఇవ్వాలని చెప్పి వచ్చిన డబ్బులన్నీ వైసీపీ నాయకులే లాక్కున్నారని ఓ రైతు కేసు పెట్టడం భూసేకరణలో వైసీపీ దోపిడీకి ప్రత్యక్ష సాక్ష్యం'' అన్నారు. 

''తూర్పుగోదావరి జిల్లా రాజానగరం నియోజకవర్గం కోరుకొండ మండలంలోని బూరుగుపూడి, కాపవరంలో పేదల ఇళ్ల కోసం అంటూ ముంపు భూములను కొనుగోలు చేశారు. రూ.5 లక్షల నుంచి 7 లక్షల విలువ చేసే భూములను రూ.20 లక్షల నుంచి 45 లక్షలకు కొనుగోలు చేస్తున్నారు. సుమారు 586 ఎకరాలు కొనుగోలు చేశారంటే అవినీతి ఏ స్థాయిలో జరిగిందో అర్థమవుతోంది. ఇళ్ల పట్టాల పంపిణీ పేరుతో పది మంది పేదల పొట్ట కొట్టి వైకాపాకు చెందిన ఎమ్మెల్యేలు, ధనవంతుల జేబులు నింపుతున్నారు'' అని మండిపడ్డారు. 

read more  నా హత్యకు సుపారీ, అఖిప్రియను అరెస్టు చేయాల్సిందే: ఏవీ సుబ్బారెడ్డి

''ఇళ్ల స్థలాల పేరుతో పేదలు, బడుగు, బలహీన వర్గాల నుంచి బలవంతంగా భూములు లాక్కుంటున్నారు. దశాబ్దాలుగా దళితులు, బలహీన వర్గాలకు చెందిన సన్నకారు రైతులు, రైతు కూలీలు సాగుచేసుకుంటున్న భూములను లాక్కోవడం అంటే వారి జీవనాధారాన్ని దెబ్బతీయడమే. చెరువు, వాగు, స్మశానం కోసం వదిలిన భూములు, పోరంబోకు, పాఠశాలల గ్రౌండ్స్, సామాజిక అవసరాల కోసం ఉపయోగించే భూములను స్వాధీనం చేసుకుంటున్నారు'' అని  తెలిపారు. 

''విశాఖ చుట్టుపక్కల 6,116 ఎకరాలను ల్యాండ్ పూలింగ్ పేరుతో పేదల, బడుగు, బలహీన వర్గాల అసైన్డ్ భూములను బలవంతంగా లాక్కుంటున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఈ తంతు జరుగుతోంది. జీవో నెం.72తో వారి గొంతు కోస్తున్నారు. తాతముత్తాల నుంచి సాగు చేసుకుంటున్న భూములను ఇళ్ల పట్టాల పేరుతో బలవంతంగా తీసుకోవడంపై పేదలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నా ఈ ప్రభుత్వానికి పట్టడం లేదు'' అని ఆవేదన వ్యక్తం చేశారు. 

''కాకినాడలో తీర ప్రాంతాన్ని రక్షించే మడ అడవులను కొట్టేసి పేదలకు ఇళ్ల జాగాలు ఇస్తామంటూ అవినీతికి పాల్పడుతున్నారు. మడ అడవులను తొలగించి మెరక చేయడంలోనూ భారీ అవినీతికి పాల్పడ్డారు. 

గత ప్రభుత్వం పేదలకోసం నిర్మించిన ఇళ్లను లబ్ది దారులకు ఇవ్వకుండా... పచ్చని పంట పొలాలను, ఎప్పుడో నలభై ఏళ్ల నాడు పేదలకు ఇచ్చిన భూములను ఇళ్ల స్థలాల కోసం గుంజుకుంటున్నారు. ముందు వైసీపీ నాయకులు కబ్జా చేసిన భూములు వెనక్కి తీసుకొని పేదలకు ఇవ్వాలి.  ప్రభుత్వానికి పేదల పట్ల నిజంగా చిత్త శుద్ధి ఉంటే వైసీపీ నేతలు ఆక్రమించుకున్న భూముల్లో పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలి'' అని కళా వెంకట్రావు డిమాండ్ చేశారు. 

Follow Us:
Download App:
  • android
  • ios