Asianet News TeluguAsianet News Telugu

ఇళ్లపట్టాల పంపిణీపై సిబిఐ విచారణ... లేదంటే అంతపనీ చేస్తాం: ప్రభుత్వానికి అచ్చెన్న హెచ్చరిక

ఇవాళ ఇళ్లు కడుతున్నాము,  ఇళ్లస్థలాలిస్తున్నాము అని చెప్పుకుంటూ రాష్ట్రవాసులను మోసగిస్తున్న వైసిపి సర్కార్ మాటలు నమ్మి ప్రజలు మోసపోకూడదని అచ్చెన్నాయుడు  సూచించారు. 

AP TDP Chief Atchannaidu Warning to CM YS Jagan
Author
Amaravathi, First Published Dec 25, 2020, 4:38 PM IST

అమరావతి: రాష్ట్రానికి లభించిన ముఖ్యమంత్రి ప్రజలను మోసంచేసే మరో కార్యక్రమానికి నేడు శ్రీకారం చుట్టాడని, ఇళ్లస్థలాలిస్తున్నామంటూ ఊకదంపుడుప్రచారం చేసుకుంటున్నాడని టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు కింజారపు అచ్చెన్నాయుడు ఆరోపించారు.పాలకులు తమను మోసగిస్తున్నప్పుడే ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని సూచించారు. 

శుక్రవారం అచ్చెన్నాయుడు తన నివాసం నుంచి జూమ్ యాప్ ద్వారా మాట్లాడుతూ... నేడు ఇళ్లుకడుతున్నాము,  ఇళ్లస్థలాలిస్తున్నాము అని చెప్పుకుంటూ రాష్ట్రవాసులను మోసగిస్తున్న వారిమాటలు నమ్మి ప్రజలు మోసపోకూడదని సూచించారు. రాష్ట్రం ఏర్పడ్డాక పేదలకు శాశ్వత గృహనిర్మాణ పథకాన్ని అమలు చేసిన ఘనత తెలుగుదేశం పార్టీకి, స్వర్గీయ ఎన్టీ.రామారావుకే దక్కుతుందన్నారు. టీడీపీ ఏర్పడకముందు రాష్ట్రంలో పూరిగుడిసెలు కళ్లముందు కనిపించేవని... ఎన్టీఆర్ ముఖ్యమంత్రి అయ్యాకే  గ్రామాలు, పట్ణణాలకు సమీపంలో స్థలాలు సేకరించి, పేదలకు గృహాలను నిర్మించారన్నారు. చంద్రబాబు  ముఖ్యమంత్రి అయ్యాక అంతకు రెట్టింపు గృహనిర్మాణాలు చేపట్టారని పేర్కొన్నారు.

''ప్రస్తుత సీఎం జగన్మోహన్ రెడ్డికి ప్రచారయావ ఎక్కువైంది. ఇళ్లపండగ పేరుతో నిత్యం ప్రకటనలిస్తున్న ప్రభుత్వం, ప్రజలకు తప్పుడు మాటలు చెబుతోంది. ఫేక్ ముఖ్యమంత్రి తాను అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పాలి. 28.03లక్షల మందికి ఇళ్లపట్టాలు ఇస్తున్నట్లు ముఖ్యమంత్రి పత్రికల్లో ప్రకటనలిచ్చాడు. నా సొంత నియోజకవర్గంలో ఇన్నివేల మందికి ఇళ్లపట్టాలిస్తున్నట్లు అధికారులు నాకు ఒక బుక్ లెట్ ఇచ్చారు. అది చూశాక అధికారులు ఇచ్చే ఇళ్లస్థలాలు ఎక్కడివైనా సరే, అవేవీ నివాసయోగ్యానికి అనుకూలంగా లేవు. కొండలు, గుట్టలు, శ్మశానాలకు సమీపంలో, వాగులపక్కన, వర్షంపడితే చెరువులను తలపించే ప్రదేశాలను ఇళ్లస్థలాలకు ఎంపికచేశారు. అటువంటి స్థలాలు పేదలకుఎలా ఉపయోగపడతాయో ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలి'' అని ప్రశ్నించారు.

read more   ఫలానా కులం, మతం వారొద్దంటే రాజధానెలా అవుతోంది?:అమరావతిపై జగన్ సంచలనం

''ప్రకటనల్లో జగనన్న ఊళ్లను తయారుచేస్తున్నాడని ఊదరగొట్టారు. జగన్ ప్యాలెస్ లు చూస్తే, ఆయన రాజప్రాసాదాల్లోని బాత్ రూమ్ విస్తీర్ణంకూడా లేని సెంటు స్థలాన్ని పేదలకుఇస్తూ, ఊళ్లనే తయారుచేస్తున్నామంటూ మోసపు మాటలు చెబుతారా? జగన్ ప్రభుత్వంలో రూపొందించే ప్రతి పథకంలో అవినీతే. ముందే డబ్బు ఎలా రాబట్టాలనే ఆలోచన చేశాకే పథకాలను జగన్ ప్రభుత్వం రూపొందిస్తోంది. పేదలు, మరీ ముఖ్యంగా దళితుల సాగుబడిలో ఉన్నభూములను లాక్కొని, వాటిని ఇళ్లస్థలాలుగా మార్చారు. అన్నినియోజకవర్గాల్లో రూ.5, రూ.10లక్షల విలువ చేయని భూములను రూ.60, రూ.70లక్షలకు ఇళ్లస్థలాల కోసం కొనుగోలు చేశారు. భూములకొనుగోళ్లలోనే వైసీపీ ఎమ్మెల్యేలు, మంత్రులు అందినకాడికి ప్రభుత్వసొమ్ముని దోచేశారు'' అని ఆరోపించారు.

''రాష్ట్రం మొత్తమ్మీద వైసీపీ ప్రభుత్వం ఇళ్లపట్టాల ముసుగులో ఎలా దోచేసిందో, నియోజకవర్గాల వారీగా ఎంత దోపిడీ చేశారో ఆధారాలతో సహా టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఫొటో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశాం. దానిపై వైసీపీ నుంచి స్పందన లేదు. ఇళ్ల స్థలాల పంపిణీ ముసుగులో జరిగిన అవినీతిని ఆధారాలతో సహా బయపెట్టినా ప్రభుత్వం నుంచీ ఒక్కరూ మాట్లాడలేదు.పేదల నుండి తక్కువ ధరకు భూమిని కొని ఎక్కువధరకు ప్రభుత్వానికి అంటగట్టడం ద్వారా రూ.4వేలకోట్ల వరకు దోపిడీచేయడం ఒకఎత్తయితే, ఆ విధంగా సేకరించిన భూమిని చదునుచేసే పేరుతో, ఉపాధిహామీ పథకం ముసుగులో రూ.2వేలకోట్ల వరకు కాజేశారు. అంతటితో ఆగకుండా ఆ పనికిమాలిన భూమిని పేదలకు ఇవ్వడానికి ప్రతిపట్టాకు రూ.50వేలు, రూ.60వేల వరకు అందినచోట అందినట్లు ఇళ్లస్థలాలు కావాలనుకునేవారినుండి అధికార పార్టీ రూ.500కోట్ల వరకు దిగమింగింది. అంతిమంగా వైసీపీ ప్రభుత్వం, ముఖ్యమంత్రి ఇళ్లపట్టాల పండుగ పేరుతో రూ.6,500కోట్ల వరకు కాజేసిందనేది జగనెరిగిన సత్యమని ప్రజలందరికీ అర్థమైంది'' అని మండిపడ్డారు.

''28లక్షలమందికి పట్టాలిస్తున్నట్లు చెబుతున్న ప్రభుత్వం నా నియోజకవర్గంలోని ఒక గ్రామంలో 37మందికి పట్టాలిస్తున్నట్లు కరపత్రాల్లో ప్రచురించింది.  ఆ గ్రామంలో కేవలం ఏడుగురికి పట్టాలిచ్చిన ప్రభుత్వం మిగిలిన 30మందికి వారికి ఉన్న సొంత స్థలాలకే పొజిషన్ సర్టిఫికెట్లు ఇచ్చి ప్రభుత్వమే స్థలాలిచ్చినట్లుగా చెప్పుకుంటోంది. అలా చెప్పమని సదరు స్థలాలవారిని బెదిరిస్తున్నారు. లబ్ధిదారులకు ఉన్న సొంతస్థలాలకు పొజిషన్ సర్టిఫికెట్లు ఇచ్చినంత మాత్రాన ఆ స్థలం ప్రభుత్వం ఇచ్చినట్లు అవుతుందా? ఇదేమీ ఇళ్లపట్టాల పంపిణీనో  ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలి'' అని అచ్చెన్నాయుడు ప్రశ్నించారు.

Follow Us:
Download App:
  • android
  • ios