అధికార వైసిపికి అండతో కొందరు పోలీసులు ప్రతిపక్ష టిడిపి నాయకులు, కార్యకర్తలపై రెచ్చిపోతున్నారని... ఇలాంటివారి చిట్టా రెడీ చేస్తున్నామని మాజీ మంత్రి, ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు హెచ్చరించారు.
అమరావతి : నేడు ప్రతిపక్షంలో వున్న తెలుగుదేశం పార్టీ వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో భారీ విజయంతో అధికారంలోకి రావడం ఖాయమని ఏపీ టిడిపి అధ్యక్షులు కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. వైసిపి పార్టీకి కొమ్ముకాస్తూ ఇప్పుడు టిడిపి నాయకులు, కార్యకర్తలను వేధిస్తున్న పోలీసులను టిడిపి ప్రభుత్వం వదిలిపెట్టదని హెచ్చరించారు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసినవెంటనే యాక్షన్ లోకి దిగుతామంటూ పోలీసులు, వైసిపి నాయకులకు అచ్చెన్న వార్నింగ్ ఇచ్చారు.
ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి భారత రాజ్యాంగాన్ని సైతం ఉల్లంఘిస్తూ... చట్టాలను సైతం లెక్కచేయకుండా రాష్ట్రంలో అరాచక పాలన సాగిస్తున్నాడని అచ్చెన్నాయుడు మండిపడ్డారు. స్వతంత్రంగా వ్యవహరించాల్సిన వ్యవస్థలన్నింటిని తన గుప్పిట్లో పెట్టుకున్న సీఎం ప్రతిపక్ష పార్టీల నాయకులనే కాదు కార్యకర్తలను వేధిస్తున్నాడని ఆరోపించారు. వైసిపి మూడేళ్ల పాలనలో ఎంతమందిపై అక్రమ కేసులు పెట్టారో... ఎంతమందిని జైళ్లకరు పంపారో లెక్కే లేదన్నారు. ఇలా వైసిపి అరాచక పాలనలో ఇబ్బందులు ఎదుర్కొంటున్న టిడిపి కార్యకర్తలకు, నాయకులకు అన్ని విధాలుగా అండగా ఉంటామన్నారు. ఏ కష్టం వచ్చినా 60 లక్షల మంది టీడీపీ సైన్యం వెన్నెంటే ఉంటుందని అచ్చెన్న ధైర్యం చెప్పారు.
వైసిపి పక్షాన నిలిచే కొందరు పోలీసులు, ప్రభుత్వాధికారులు జగన్ రెడ్డి అరాచకాలను వంతపాడుతున్నారని అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. కొందరు పోలీసులు మరీ దారుణంగా వ్యవహరిస్తున్నారని... వైసీపీ నేతలతో కుమ్మక్కై టిడిపి కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టి అర్థరాత్రి అరెస్టులు, థర్డ్ డిగ్రిలతో వేదిస్తున్నారని తెలిపారు. మరికొందరు పోలీసులు తొడలు కొడుతూ మీసాలు తిప్పుతున్నారు... ఇది డ్యూటీ లో భాగం అనుకుంటున్నారా ? లేక ఫ్యాషన్ అనుకుంటున్నారా? అని ప్రశ్నించారు. పోలీసులు ఓవర్ యాక్షన్ తగ్గించుకుంటే మంచిదని అచ్చెన్నాయుడు సూచించారు.
read more టీడీపీ సోషల్ మీడియా కార్యకర్త వెంగళరావుకు ఊరట.. రిమాండ్‌కు సీఐడీ కోర్టు తిరస్కరణ
చట్ట విరుద్ధంగా వ్యవహరిస్తున్న పోలీసుల చిట్టా తయారు చేస్తున్నామని అచ్చెన్న తెలిపారు. వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి వచ్చేది టీడీపీ ప్రభుత్వమే... అప్పుడు కార్యకర్తల కన్నీళ్లకు కారణమైన ఖాకీలను, వైసీపీ నేతల్ని వదిలే ప్రసక్తే లేదని అన్నారు. అప్పుడు మిమ్మల్ని ఎవరూ కాపాడలేరని అచ్చెన్న హెచ్చరించారు.
2024 ఎన్నికల తర్వాత ఈ రాష్ట్రంలో ఈ వైసీపీ ఉండదు, జగన్ రెడ్డి ఉండరని అన్నారు. తప్పులు చేసిన వైసీపీ నేతల్ని, వాళ్ళ తప్పుడు పనులకు సహకరించిన పోలీసుల పరిస్థితి ఏంటో ఆలోచించుకోవాలన్నారు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణం స్వీకారం చేసిన రోజే మీపై చర్యలకు శ్రీకారం చుడతామని పోలీసులకు అచ్చెన్నాయుడు వార్నింగ్ ఇచ్చారు.
ఇదిలావుంటే అనంతపురం జిల్లా యాడికికి చెందిన ఆరుగురు బీసీ యువకులపై కస్టోడియల్ టార్చర్ కు పాల్పడిన తాడిపత్రి పోలీసులపై చర్యలు తీసుకోవాలంటూ టిడిపి నేత వర్ల రామయ్య జాతీయ బీసీ కమీషన్ కు లేఖ రాసారు. ఏపీలో పోలీసులు అధికార వైసీపీ కార్యకర్తల్లా పనిచేస్తున్నారని... ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ అరెస్టులు చేస్తున్నారని అన్నారు. ముఖ్యంగా ఓ వర్గం పోలీసులు మరీ దారుణంగా వ్యవహరిస్తున్నారని... అర్థరాత్రులు ప్రతిపక్ష నాయకులు, కార్యకర్తలను అరెస్ట్ చేసి చిత్రహింసలకు గురిచేస్తున్నారని వర్ల రామయ్య పేర్కొన్నారు.
యాడికిలో అధికార పార్టీ మద్దతుదారులు బీసీ వర్గానికి చెందిన స్థానిక యానిమేటర్ రాజీనామా చేయాలని ఒత్తిడి తెచ్చారని... అన్యాయమైన ఈ డిమాండ్ ను వ్యతిరేకిస్తూ టీడీపీ మద్దతుదారులు ఆందోళనకు దిగారన్నారు. వైసీపీ నాయకుల తప్పుడు ఫిర్యాదుతో పోలీసులు ఒక మహిళతో పాటు ఆరుగురు బీసీ యువకులను విచారణ పేరుతో పోలీస్ స్టేషన్‌కు పిలిపించారని... మహిళను మినహాయించిన మిగిలిన వారిని పోలీస్ స్టేషన్‌లో ఉంచి కస్టోడియల్ టార్చర్‌కు గురిచేశారని వర్ల రామయ్య పేర్కొన్నారు. బాధితులను కస్టడియల్ టార్చర్‌కు గురిచేసి వారి ప్రాథమిక హక్కులను ఉల్లంఘించిన పోలీసులపై కఠినమైన చర్యలు తీసుకోవాలని రామయ్య డిమాండ్ చేసారు.
