ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో వీడియోలు పెట్టారనే ఆరోపణలపై తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా కార్యకర్త వెంగళరావును సీఐడీ పోలీసులు గురువారం రాత్రి అరెస్ట్ చేశారు. ఈరోజు వెంగళరావును పోలీసులు గుంటూరులోని సీఐడీ కోర్టులో హాజరుపరిచారు.
తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా కార్యకర్త వెంగళరావుకు సీఐడీ కోర్టులో ఊరట లభించింది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో వీడియోలు పెట్టారనే ఆరోపణలపై వెంగళరావును సీఐడీ పోలీసులు గురువారం రాత్రి అరెస్ట్ చేశారు. అయితే ఈరోజు వెంగళరావును గుంటూరులోని సీఐడీ కోర్టులో హాజరుపరిచారు. అయితే ఈ సందర్భంగా వెంగళరావు తరఫున వాదనలు వినిపిస్తూ.. సీఐడీ పోలీసులు అతడిని అక్రమ కేసులో ఇరికించారని చెప్పుకొచ్చారు. కస్టడీలో అధికారులు ఇబ్బంది పెట్టినట్టుగా వెంగళరావు తెలిపాడని చెప్పారు.
మరోవైపు వెంగళరావును రిమాండ్‌కు ఇవ్వాలని సీఐడీ పోలీసులు చేసిన విజ్ఞప్తిని కోర్టు తిరస్కరించింది. సెక్షన్ 41 ఏ నోటీసు ఇవ్వాలని కోర్టు ఆదేశించింది. వెంగళరావుకు వ్యక్తిగత పూచీకత్తుతోనే బెయిల్ మంజూరు చేశారు. దీంతో వెంగళరావు పోలీసు కస్టడీ నుంచి విడుదలయ్యారు.
ఇక, వెంగళరావు మాట్లాడుతూ.. ప్రభుత్వ అవినీతిని తాను నిత్యం ప్రశ్నిస్తున్నానని చెప్పారు. అర్థరాత్రి అరెస్ట్ చేసి శారీరకంగా, మానసికంగా వేధించారని ఆరోపించారు. సీఐడీ పోలీసుల వైఖరి దుర్మార్గంగా ఉందన్నారు. విచారణలో చంద్రబాబు నాయుడు, నారా లోకేష్‌ల పేర్లు చెబితే వదిలిపెడతామని పోలీసులు చెప్పారని అన్నారు. రాజధాని, పోలవరంపై ప్రశ్నిస్తే ఇలా వేధిస్తారా? అని ప్రశ్నించారు. వేలకోట్ల సంద దోచుకుంటే ప్రశ్నించడం తప్పా అని అడిగారు.
