Asianet News TeluguAsianet News Telugu

రాష్ట్రంలో దేవాలయమన్నదే లేకుండా కుట్ర... జగన్ కనుసన్నల్లోనే: అచ్చెన్న ఆగ్రహం

జగన్ రెడ్డి ప్రోద్బలంతోనే విధ్వంసాలు జరుగుతున్నాయని... ఈ దాడులకు ఎప్పుడు అడ్డుకట్ట పడుతుందో దేవుడికే తెలియాలని ఆందోళన వ్యక్తం చేశారు ఏపీ టిడిపి అధ్యక్షులు అచ్చెన్నాయుడు. 

ap tdp chief atchannaidu serious attacks on temples
Author
Guntur, First Published Jan 10, 2021, 2:58 PM IST

అమరావతి: హిందూ దేవాలయాలపై రోజుకో చోట విధ్వంసం జరుగుతున్నా జగన్ రెడ్డి మౌనం వహిస్తున్నారని ఏపీ బిజెపి అధ్యక్షులు కింజారపు అచ్చెన్నాయుడు ఆరోపించారు. అందువల్లే ఉన్మాదులు రెచ్చిపోతున్నారని... రాష్ట్రంలో దేవాలయం అనేది లేకుండా కుట్ర చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. 

''జగన్ రెడ్డి ప్రోద్బలంతోనే విధ్వంసాలు జరుగుతున్నాయి. ఈ దాడులకు ఎప్పుడు అడ్డుకట్ట పడుతుందో దేవుడికే తెలియాలి. చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలంలో యల్లంపల్లి ఆంజనేయస్వామి ఆలయం తలుపులు పగులగొట్టడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. జగన్ రెడ్డి 19 నెలల పాలనలో హిందూ దేవాలయాలపై 140కి పైగా దాడులు జరిగాయి. ఏ ఘటనలోనూ ఇంతవరకు దోషులను పట్టుకున్న పాపాన పోలేదు. హిందూమతంపై జరుగుతున్న దాడిపై జగన్ రెడ్డి మౌనం వీడాలి. అన్ని మతాలను సమానంగా చూడాల్సిన బాధ్యత ముఖ్యమంత్రిపై లేదా?'' అని నిలదీశారు.

read more  ఏపీలో కానిస్టిట్యూషన్ బ్రేక్ డౌన్... ఇక రంగంలోకి గవర్నర్‌...: యనమల సంచలనం

''పథకం ప్రకారం హిందువుల మనోభావాలను దెబ్బతీస్తున్నారు. విగ్రహాల ధ్వంసం నుంచి ప్రజలను తప్పుదారి పట్టించేందుకు విజయవాడలో ఆలయాల పునరుద్ధరణ అంటూ కొత్త నాటకానికి తెరతీశారు. అభివృద్ధికి, విధ్వంసానికి తేడా ఉంది. హిందూ విశ్వాసాలపై ఎందుకంత అలుసు? జగన్ రెడ్డి హిందూ మతాన్ని అభిమానించే వారైతే.. అమరావతిలో రూ.150 కోట్లతో తలపెట్టిన వేంకటేశ్వర స్వామి దేవాలయ నిర్మాణాన్ని ఎందుకు నిలిపివేశారు? దివ్యదర్శనం పథకాన్ని ఎందుకు ఆపారు? కృష్ణా, గోదావరి పవిత్ర సంగమం వద్ద నిర్వహించే హారతి కార్యక్రమాన్ని ఎందుకు నిలిపివేశారు?'' అంటూ ప్రశ్నించారు. 

''దేవాదాయశాఖ నిధులను దారి మళ్లిస్తున్నారు. దేవాలయ భూములను అన్యాక్రాంతం చేస్తున్నారు. అంతర్వేది రథం దగ్ధంపై సీబీఐ విచారణ ఏమైంది? దేవాలయాలపై పథకం ప్రకారం జరుగుతున్న దాడులకు ముగింపు పలకని పక్షంలో ప్రజా పోరాటం తప్పదు'' అని అచ్చెన్నాయుడు హెచ్చరించారు, 

Follow Us:
Download App:
  • android
  • ios