Asianet News TeluguAsianet News Telugu

జగన్ రెడ్డి నిరంకుశ పాలనపై తిరుగుబాటు... జగన్ పతనం మొదలైంది: అచ్చెన్నాయుడు

రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేయాల్సిన పోలవరాన్ని జగన్ రెడ్డి సుడిగుండంలో నెట్టేశారని అచ్చెన్నాయుడు మండిపడ్డారు. 

AP TDP Chief Atchannaidu fires on cm jagan
Author
Guntur, First Published Nov 22, 2020, 1:10 PM IST

గుంటూరు: పోలవరం సందర్శనకు పిలుపునిచ్చిన సీపీఐ, సీపీఎం నేతలను హౌస్ అరెస్టులు చేయడం ప్రభుత్వ పిరికితనానికి నిదర్శనమన్నారు టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు  
కింజరాపు అచ్చెన్నాయుడు. పోలవరం పనులు ఏమీ జరగలేదు, టీడీపీ ప్రభుత్వం ఏమీ చేయలేదు అంటున్న ప్రభుత్వం సందర్శనకు పిలుపిస్తే ఎందుకు వణుకుతోంది? అని నిలదీశారు. 

''రాష్ట్ర ప్రజానీకం భవిష్యత్తుకు వీచికైన పోలవరాన్ని సందర్శిస్తామని ప్రజాపక్షాలు వెళ్తుంటే అడ్డుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది? రాష్ట్ర భవిష్యత్తును తిరగరాసి, సరికొత్త ధాన్యాగారాన్ని దేశానికి తయారు చేసే పోలవరం విషయంలో ప్రభుత్వ చిత్తశుద్ధి, చేతగాని తనం ఏమిటో బయటపడకుండా ఉండేందుకే ఈ హౌస్ అరెస్టులు. రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేయాల్సిన పోలవరాన్ని జగన్ రెడ్డి సుడిగుండంలో నెట్టేశారు. పోలవరం సందర్శనతో అక్కడ జగన్ ప్రభుత్వం పోలవరాన్ని ఎంత దారుణంగా నిర్లక్ష్యం చేశారో, రాష్ట్రాన్ని ఏ స్థాయికి దిగజార్చారో ప్రజలకు తెలిసిపోతుందని, వారు నిలదీస్తారనే భయంతోనే ఈ హౌస్ అరెస్టులు చేస్తున్నారు'' మండిపడ్డారు.

''ప్రజా సంక్షేమంపై చిత్తశుద్ధి ఉంటే.. ప్రజలు మీరు చేసిన అభివృద్ధి ఏంటో చూసి వస్తామంటే ఎందుకు భయపడుతున్నారు.? గతంలో చేసిన పనులు చూపించేందుకు ప్రజల్ని పోలవరం తీసుకెళ్తే విమర్శించారు. నేడు మీరు చేసిన పనుల్ని చూద్దామని ప్రజలు వెళ్తుంటే అడ్డుకుంటున్నారు. ఎందుకంత అభద్రత.? ఎందకంత భయం.?'' అంటూ ప్రశ్నించారు.

read more  సవరించిన అంచనా: జగన్ ప్రభుత్వానికి పోలవరం అథారిటీ చల్లని కబురు

''పోలవరం ఎత్తు తగ్గించి, నీటి నిల్వ సామర్ధ్యం తగ్గించి ప్రాజెక్టు ప్రయోజనాలను దెబ్బతీస్తున్నందుకే ప్రజల పర్యటనను చూసి భయపడుతున్నారా? పోలవరం అనేది ప్రజల ఆస్తి. దాన్ని పరిశీలించే హక్కు రాష్ట్రంలోని ప్రతి పౌరుడికీ ఉంటుంది. అలాంటి హక్కును కూడా పోలీస్ చర్యలతో అడ్డుకోవడం నియంతృత్వం'' అని విరుచుకుపడ్డారు. 

''సాగునీటి ప్రాజెక్టుల విషయంలో జగన్ రెడ్డి భాధ్యతా రాహిత్యంగా వ్యవహరిస్తే జల సంక్షోభం తప్పదు. పోలవరాన్ని పూర్తి స్థాయిలో నిర్మిస్తే రాష్ట్ర సాగునీటిరంగ ముఖచిత్రమే మారిపోతుంది. ప్రాజెక్టు నీటి నిల్వ ఎత్తును తగ్గిస్తే దీనిపై ఆదారపడి నిర్మిస్తున్న రాయలసీమ ప్రాజెక్టులకు, ఉత్తరాంధ్ర సుజల స్రవంతి వంటి పధకాలకు గండి పడుతుందని జలవనరుల నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయినా పోలవరం ప్రాజెక్టుపై అడుగడుగునా నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారు. రెండేళ్ల పాలనలో 2% పనులు కూడా చేయకుండా.. 70% పనులు పూర్తి చేసిన ప్రతిపక్షంపై విమర్శలు చేస్తూ కాలం నెట్టుకురావాలని చూడడం సిగ్గుచేటు'' అన్నారు. 

''మొన్నటికి మొన్న టిడ్కో గృహాల విషయంలో అదే చేశారు. అంతకు ముందు అమరావతి నిర్మాణం విషయంలోనూ అదే చేశారు. ఇప్పుడు పోలవరం విషయంలోనూ అదే చేస్తున్నారు. టీడీపీ హయాంలో అభివృద్ధి ఏమీ జరగలేదు అన్నపుడు.. అక్కడి వాస్తవ పరిస్థితులు ప్రజలు చూసి వస్తామంటే ఎందుకు ప్రభుత్వం అడ్డుకుంటోంది.?'' అని నిలదీశారు. 

''జగన్ రెడ్డి నిరంకుశ పాలనపై ప్రజల తిరుగుబాటు మొదలైంది. ప్రజా ఉద్యమం మొదలైంది. ప్రభుత్వ పతనానికి తొలి అడుగులు ప్రజల నుండే పడుతున్నాయి. ఇప్పటికైనా పోలవరం విషయంలో నిజాలు ప్రజలకు తెలియజేయాలి. లేకుంటే ప్రజా ఉద్యమ సునామీ కొట్టుకుపోతావ్. పోలవరం విషయంలో చేస్తున్న మోసానికి వెంటనే ప్రజలందరికీ బహిరంగ క్షమాపణలు చెప్పి.. అరెస్టు చేసిన రాజకీయ, ప్రజాసంఘాల నేతలను వెంటనే విడిచిపెట్టాలి'' అని అచ్చెన్నాయుడు డిమాండ్ చేశారు. 

Follow Us:
Download App:
  • android
  • ios