కర్ణాటకలో 13మంది ఏపీవారి మృతికి సీఎం జగనే కారణం..: అచ్చెన్నాయుడు
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విధానాల వల్లే ఏపీకి చెందిన 13 మంది కర్ణాటకలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందారని అచ్చెన్నాయుడు ఆరోపించారు.

అమరావతి : కర్ణాటకలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఏపీకి చెందిన 13 మంది మృతిచెందడానికి ముఖ్యమంత్రి జగన్ రెడ్డే కారణమని అచ్చెన్నాయుడు ఆరోపించారు. వైసిపి ప్రభుత్వ చేతగాని పాలనవల్లే రైతుల పంటలు ఎండిపోతున్నాయని... రాష్ట్రంలో కరువు పరిస్థితులు నెలకొనడంతో ప్రజలు పనుల కోసం ఇతర రాష్ట్రాలకు వలస వెళుతున్నారని అన్నారు. ఇలా ఉపాధి నిమిత్తం కర్ణాటకకు వెళ్ళినవారు రోడ్డు ప్రమాదంలో మృతిచెందారని అచ్చెన్నాయుడు అన్నారు.
ఏపీలో గత వంద సంవత్సరాల్లో ఇంతటి తీవ్ర కరువు పరిస్థితులు చూడలేదని అచ్చెన్నాయుడు అన్నారు. సాగునీరు అందక కళ్లముందే పంటలు ఎండిపోతున్నా ఈ సైకో సీఎం రైతులపై కనీస కనికరం చూపించలేదని అన్నారు.కరువు నివారణ చర్యలు చేపట్టకపోవడం వల్లే బతుకుదెరువు కోసం అనంతపురం వాసులు కర్ణాటకకు వెళ్ళారని... అక్కడ జరిగిన రోడ్డు ప్రమాదంలో మృత్యువాత పడ్డారన్నారు. రాష్ట్రంలోనే ఉపాధి లభించి ఉంటే ఈ 13 మంది మరణించేవారు కాదని అచ్చెన్నాయుడు అన్నారు.
రాష్ట్రంలో కరువు భయపెడుతున్నా నివారణ చర్యలపై జగన్ రెడ్డి, వ్యవసాయ, ఇరిగేషన్ మంత్రులకు కనీస స్పృహ లేదని అచ్చెన్న మండిపడ్డారు. ఖరీఫ్ లో 40 లక్షల ఎకరాల్లో పంటే వేయలేదని... వేసిన పంటల్లో నీరు అందక మూడొంతులు దెబ్బతిన్నాయన్నారు. రాయలసీమ, ఉత్తరాంధ్ర, పల్నాడు, కృష్ణా డెల్టా, గోదావరి జిల్లాల్లో తీవ్ర దుర్భిక్ష పరిస్థితులు ఉన్నాయని అచ్చెన్న ఆందోళన వ్యక్తం చేసారు.
Read More 2024 లో చంద్రబాబు చస్తాడు... ఇక జగన్ కు అడ్డుండదు : వైసిపి ఎంపీ సంచలనం
రాయలసీమలో 18 లక్షల ఎకరాల్లో సాగు కావాల్సిన వేరుశనగ పంట ఈ ఏడాది కేవలం 7 లక్షల ఎకరాల్లోనే సాగైందని అచ్చెన్న తెలిపారు. ఈ పంటకు కూడా సాగునీరు అందక ఎండిపోతున్నాయన్నారు. ఉద్యానపంటలకు కూడా సాగు నీరు అందడం లేదన్నారు. కూరగాయల పంటలు కూడా దెబ్బతిన్నాయన్నారు. శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకు కరువు నెలకొని ఉందని అచ్చెన్నాయుడు అన్నారు.
పట్టిసీమను సక్రమంగా వినియోగించుకోకపోవడం వల్ల 40 టీఎంసీల నీరు కోల్పోయామని అచ్చెన్న అన్నారు. ఉద్దేశపూర్వకంగా పట్టిసీమ పంపులకు జగన్ సర్కార్ బూజు పట్టించిందని మండిపడ్డారు. నీటి నిర్వహణలో జగన్ రెడ్డి పూర్తిగా వైఫల్యం చెందారన్నారు. కరువు ఇంత తీవ్రస్థాయిలో ఉంటే కనీస సమీక్షలు కూడా లేవని మండిపడ్డారు.