మండౌస్ తుఫాను బీభత్సం... రైతులను ఆదుకోండి : జగన్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన అచ్చెన్నాయుడు
తుపాను కారణంగా నష్టపోయిన రైతులను ఆదుకోవాలని జగన్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు. అధికార యంత్రాంగం ద్వారా పంట నష్టాన్ని అంచనా వేయాలని ఆయన కోరారు.

మండౌస్ తుఫాను కోస్తా తీరాన్ని వణికిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే వేలాది ఎకరాల పంట నీట మునిగిన సంగతి తెలిసిందే. ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే.. చిత్తూరు, తిరుపతి, కడప, అనంతపురం, నెల్లూరు, గుంటూరు, కృష్ణా , ఉభయ గోదావరి జిల్లాలపై తుఫాను ప్రభావం తీవ్రంగా వుంది. చేతికొచ్చిన పంట నీట మునగడంతో రైతన్నలు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో అన్నదాతలను ఆదుకోవాలని తెలుగుదేశం పార్టీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు డిమాండ్ చేశారు. అధికార యంత్రాంగం ద్వారా పంట నష్టాన్ని అంచనా వేయాలని అచ్చెన్నాయుడు కోరారు. వర్షానికి తడిసిన పంటలను ప్రభుత్వమే కొనుగోలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల కడప జిల్లా అన్నమయ్య డ్యాం కొట్టుకుపోయి 64 మంది ప్రాణాలు కోల్పోయారని, వేలాది ఇళ్లు, వందలాది ఎకరాల్లో పంట నాశనమైందని అచ్చెన్నాయుడు దుయ్యబట్టారు. రైతుల సంక్షేమాన్ని జగన్ ప్రభుత్వం గాలికి వదిలేసిందని ఆయన ఎద్దేవా చేశారు. ఇప్పటికైనా స్పందించి రైతాంగాన్ని ఆదుకోవాలని ప్రభుత్వానికి ఆయన సూచించారు.
కాగా... డిసెంబర్ 13 నాటికి దక్షిణ అండమాన్ సముద్రంలో తుఫాను ఏర్పడే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ ఆదివారం తెలిపింది. దీని ప్రభావంతో డిసెంబర్ 13-14 తేదీలలో అండమాన్, నికోబార్‌లో విస్తారంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. అలాగే డిసెంబర్ మధ్య నాటికి బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని ఓ నివేదిక సూచించింది. అయితే తుఫాన్‌గా మారే అవకాశం లేదు.
ALso REad:మాండౌస్ తుఫాను ఎఫెక్ట్ : తిరుపతిలో 24 గంటల్లో 158.9 సగటు వర్షపాతం నమోదు
ఇదిలావుండగా.. పొరుగున ఉన్న తమిళనాడులోని మామల్లపురంలో ఆదివారం రాత్రి 'మండౌస్' తుఫాను తీరాన్ని దాటిన తరువాత తాజా సమాచారం అందింది. మండౌస్ తుఫాను అవశేషాలు అల్పపీడన ప్రాంతంలోకి ప్రవేశించాయని ఐఎండీ ఆదివారం తెలియజేసింది. అల్పపీడన ద్రోణి (మాండూస్ తుఫాను అవశేషం) ఉత్తర తమిళనాడు, పరిసర ప్రాంతాల్లో అల్పపీడనంగా మారిందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) ఒక ప్రకటనలో తెలిపింది.
మాండూస్ తుఫాను ప్రభావంతో తమిళనాడు, దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిశాయి. ఆంధ్రప్రదేశ్ లోని తిరుపతి జిల్లా కేవీబీపురం మండలంలో అత్యధిక వర్షపాతం నమోదైంది. కాగా.. ఈ తుఫాను వల్ల ఐదుగురు చనిపోయారు. వందలాది చెట్ల నేలకూలాయి. చెన్నైలో విద్యుత్ అంతరాయం కలిగింది. ఆంధ్రప్రదేశ్ లోని అన్నమయ్య జిల్లాలో 20.5, చిత్తూరులో 22, ప్రకాశంలో 10.1, ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లాలో 23.4, తిరుపతి జిల్లాలో 2.4, వైఎస్‌ఆర్ కడప జిల్లాలో 13.2 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది. తుపాను ప్రభావంతో కురుస్తున్న వర్షాలపై సీఎం జగన్ శనివారం సమీక్ష నిర్వహించారు.నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య జిల్లాల కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు