తిరుపతిలో అమరావతి రైతుల సభ... టిడిపి శ్రేణులు సహకరించండి: అచ్చెన్నాయుడు పిలుపు
వైసిపి ప్రభుత్వ మూడు రాజధానుల నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ అమరావతినే ఏకైక రాజధానిగా కొనసాగించాలని డిమాండ్ చేస్తూ ఉద్యమం కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనేే తిరుపతిలో జరగనున్న అమరావతి పరిరక్షణ సభను విజయవంతం చేయాలని ఏపీ టిడిపి అధ్యక్షులు అచ్చెన్నాయుడు పిలుపునిచ్చారు.
అమరావతి: రేపు(శుక్రవారం) తిరుపతిలో తలపెట్టిన రాజధాని అమరావతి (amaravathi) పరిరక్షణ మహోధ్యమ సభకు రాష్ట్ర ప్రజానీకం అంతా కదలిరావాలని టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు కింజరాపు అచ్చెన్నాయుడు (TDP Chief Atchannaidu) పిలుపునిచ్చారు. రాజధాని అమరావతికి మద్ధతుగా ఈ సభకు హాజరై విజయవంతం చేయాలని అచ్చెన్న కోరారు. టీడీపీ శ్రేణులు (TDP Supporters) కూడా ఈ సభను విజయవంతం చేయడంలో భాగం కావాలని అచ్చెన్నాయుడు ఆదేశించారు.
''ప్రాంతీయ విధ్వేశాలు రెచ్చగొట్టే రాష్ట్ర ద్రోహులకు ఈ సభతో ప్రజలు గుణపాఠం చెప్పాలి. అమరావతిలో ఉన్న రూ.2లక్షల కోట్ల సంపదను ఈ ప్రభుత్వం బూడిదపాలు చేసింది. రాష్ట్ర భవిష్యత్ ను నాశనం చేసిన ఈ ప్రభుత్వాన్ని గద్దె దింపితేనే ప్రజలకు భవిష్యత్ ఉంటుంది. అభివృద్ధి చేయడం చేతకాక ప్రాంతాల మధ్య చిచ్చుపెట్టి పబ్బం గడుపుకోవాలని పాలకపక్షం ప్రయత్నాలు చేస్తోంది'' అని మండిపడ్డారు.
''రాజధానికి 30 వేల ఎకరాలు కావాలని చెప్పిన మొదటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి (ys jaganmohan reddy). ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టడం ఇష్టంలేక రాజధానిని మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నామని అసెంబ్లీలో చెప్పారు. రాజధాని మార్పు భూములు దోచుకున్నవారికే కావాలని... తమకు కాదని... రాజధానిగా అమరావతి ఉంటుందని ఎన్నికల ముందు ప్రచారం చేసి రాష్ట్ర ప్రజలతో ఓట్లు వేయించుకున్నారు. చెప్పిన మాటపై జగన్ నిలబడరని రాజధాని విషయంలోనే తేలిపోయింది. రోడ్లు వేయడానికి డబ్బులు లేవన్న వ్యక్తి మూడు రాజధానులు (three capitals) ఎలా కడతారో ప్రజలకు సమాధానం చెప్పాలి.?'' అని అచ్చెన్న నిలదీసారు.
read more తిరుపతి సభకు ఏపీ హైకోర్టు గ్రీన్ సిగ్నల్: ఈ నెల 17న అమరావతి జేఏసీ సభ
''కొందరు మేధావుల ముసుగు వేసుకుని కొందరు వైసీపీ సానుభూతిపరులు రాష్ట్రంలో అల్లర్లు సృష్టించాలని చూస్తున్నారు. వైసీపీలో కూడా మూడు రాజధానులపై కొందరు మదనపడుతున్నారు. అన్ని పార్టీలు అమరావతిని ఏకైక రాజధానిగా కోరుతున్నాయి'' అన్నారు.
''రాష్ట్రంలోని పరిశ్రమలను తరిమేసి నిరుద్యోగుల నోట్లో మట్టికొట్టిన ఈ ప్రభుత్వాన్ని యువత నిలదీయాలి. రెండున్నరేళ్లలో ఒక్క పరిశ్రమ కూడా రాష్ట్రానికి రాలేదు. చంద్రబాబు నాయుడు తెచ్చిన పరిశ్రమలు తప్ప కొత్తవి లేవు. వచ్చిన వాటిని కమీషన్ల కోసం తరిమేస్తున్నారు'' అని మండిపడ్డారు.
read more తుది అంకానికి అమరావతి జేఏసీ పాదయాత్ర: 17న తిరుపతిలో సభకు ప్లాన్
''రాష్ట్ర ప్రజలు కోరుకునేది అభివృద్ధి వికేంద్రీకరణ తప్ప..అధికార వికేంద్రీకరణ కాదు. సాగునీటి ప్రాజెక్టులు నిర్మిస్తే రాష్ట్రాభివృద్ధికి అడుగులు పడతాయి. జగన్ రెడ్డి సీఎం అయ్యాక రాష్ట్రంలోని నీటి ప్రాజెక్టులను నిర్వీర్యం చేసి వ్యవసాయాన్ని కుదేలు చేశారు. రెండున్నరేళ్లలో రాష్ట్రానికి వైసీపీ ఏం చేసిందో ప్రజలు నిలదీయాలి'' అని అచ్చెన్నాయుడు సూచించారు.
అమరావతిని రాష్ట్రానికి ఏకైక రాజధానిగా కొనసాగించాలని...మూడు రాజధానుల నిర్ణయాన్ని విరమించుకోవాలంటూ అమరావతి ప్రాంత రైతులు, మహిళలు ఉద్యమం చేస్తున్న విషయం తెలిసిందే. రెండేళ్లుగా ఉద్యమిస్తున్న వీరు కొద్దిరోజులుగా న్యాయస్థానం నుండి దేవస్థానం పేరిట పాదయాత్ర చేపట్టారు. అమరావతి ప్రాంతంలో ప్రారంభమైన ఈ పాదయాత్ర తిరుమలకు చేరుకుంది.
పాదయాత్ర ముగింపు సందర్భంగా తిరుపతిలో అమరావతి పరిరక్షణ మహోధ్యమ సభను ఏర్పాటు చేసారు. ఈ సభకు పోలీసులు అనుమతి నిరాకరించినా హైకోర్టుకు వెళ్లి సభకు అనుమతి తెచ్చుకున్నారు. దీంతో శుక్రవారం సభ జరగనున్న నేపథ్యంలో విజయవంతం చేయాలని అచ్చెన్నాయుడు టిడిపి శ్రేణులకు పిలుపునిచ్చారు.