విజయవాడ: తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత వర్ల రామయ్యపై పోలీసు అధికారుల సంఘం నాయకులు సీరియస్ అయ్యారు. పోలీసుల మీద అవాకులు చవాకులు పేలుతున్న వర్ల రామయ్య నోరు అదుపులో పెట్టుకోవాలని పోలీసు అధికారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు శ్రీనివాస్‌ హెచ్చరించారు. 

పోలీసులపై ఇష్టం వచ్చినట్లు అసత్యప్రచారాలు చేస్తారా అంటూ మండిపడ్డారు. ఇకపై పోలీసులపై అసత్యప్రచారం చేసినా దూషించినా, న్యాయపోరాటం చేస్తామని హెచ్చరించారు.  పోలీసుల జాతకాలు నీ వద్ద ఉన్నాయని మాట్లాడుతున్నా వర్ల రామయ్య నీ జాతకం మొత్తం నా దగ్గర ఉంది ఖబర్దార్‌ అంటూ హెచ్చరించారు.  

రాజకీయ పబ్బం గడుపుకోడానికి తెలుగుదేశం పార్టీ నాయకులు అసత్య ప్రచారం చేస్తున్నారని పోలీసు అధికారుల సంఘం కార్యదర్శి మస్తాన్‌ ఖాన్‌ ఆరోపించారు. పోలీస్‌ వ్యవస్థ ఎవరికీ తలొగ్గి పనిచేయదని స్పష్టం చేశారు. పోలీసులను కించపరిచేలా మాట్లాడటం ఫ్యాషన్‌ అయిపోయిందని, తమకు అనవసరంగా పార్టీ రంగు పులమడం సరికాదని హితవు పలికారు.