Asianet News TeluguAsianet News Telugu

వర్ల రామయ్య లేఖతో కదిలిన ఎస్ఈసీ... వారిని ఓటర్ జాబితా నుండి తొలగించాలంటూ కీలక ఆదేశాలు

ఓటర్ల జాబితాలో అవకతవకలు జరిగాయంటూ టిడిపి సీనియర్ నాయకులు వర్ల రామయ్య రాసిన లేఖపై రాష్ట్ర ఎన్నికల సంఘం స్పందించింది. ఈ క్రమంలోనే జిల్లా స్థాయి ఎన్నికల అధికారులకు కీలక ఆదేశాలిచ్చింది. 

ap state election commission reacts on tdp leader varla ramaiah letter
Author
Vijayawada, First Published Jan 17, 2022, 4:17 PM IST

విజయవాడ: అధికారుల అండదండలతో వైసిపి (YCP) నాయకులు తమ పార్టీకి అనుకూలంగా ఓటర్ల జాబితాను తయారుచేసుకుందని టిడిపి పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య (varla ramaiah) రాష్ట్ర ఎన్నికల సంఘానికి (state election commission) ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఈ మేరకు ఓటర్ల జాబితాలో జరిగిన అవకతవకలను వివరిస్తూ ఎలక్షన్ కమీషన్ కు వర్ల రామయ్య లేఖ రాసారు. తాజాగా ఈ లేఖపై ఎన్నికల సంఘం స్పందించింది.  

వర్ల రామయ్య లేవనెత్తిన అంశాలపై చర్యలు తీసుకోవాలని అన్ని జిల్లా కలెక్టర్లు, జిల్లా ఎన్నికల అధికారులకు రాష్ట్ర ఎన్నికల కమీషన్ ఆదేశాలు జారీ చేసింది. ఒక కుంటుంబంలోని ఓటర్లను వివిధ బూత్ కు జంబ్లింగ్ చేశారన్న అంశంపై స్పందిస్తూ అధికారులు ఈసీ కీలక ఆదేశాలిచ్చింది.  ఒక భవనం నివసిస్తున్న ఒక కుటుంబం ఒకే బూత్ లో ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. 

ఇక మృతిచెందిన, వలస వెళ్లిన ఓటర్లను, వివిధ చోట్ల ఓట్లు కలిగిన వ్యక్తులను ఓటర్ జాబితా నుంచి వెంటనే తొలగించాలని ఆదేశించింది. ఓటర్ కార్డుకు ఆధార్ ను లింక్ చేయడం గురించి భారత ఎన్నికల సంఘం నుంచి ఎటువంటి ఆదేశాలు అందలేదని ఎస్ఈసి (SEC) తెలిపింది.   

ఇక బూత్ లెవల్ ఏజెంట్ల నియామకంపై ఎస్ఈసీ వివరణ ఇచ్చింది. బూత్ లెవల్ ఏజెంట్లకు సంబంధించి 2010లో భారత ఎన్నికల సంఘం జారీ చేసిన ఆదేశాలే ఇప్పటికీ అమలులో ఉన్నాయని ఈసీ తెలిపింది. ఒక వ్యక్తిని బూత్ లెవల్ ఏజెంటుగా ఏదేనీ పార్టీ నియమిస్తే...ఆ పార్టీ ఆ వ్యక్తిని తొలగించే వరకు వారే కొనసాగుతారని తెలిపింది. 

విలేజ్ రెవెన్యూ అసిస్టెంట్స్, గ్రామ, వార్డు వాలంటీర్లు అధికార పార్టీ ఓటర్లను ఓటర్ జాబితాలో ఉంచి, ప్రతిపక్ష పార్టీల ఓటర్లు తొలగిస్తూ పక్షపాతంగా వ్యవహరిస్తున్నారన్న అంశంపై జిల్లా ఎన్నికల అధికారులు సమగ్రంగా విచారించి తగు చర్యలు తీసుకోవాలని జిల్లా ఎన్నికల అధికారులకు ఎస్ఈసీ ఆదేశించింది. దీనిపై సమగ్ర నివేదికను తయారుచేసి తమకు పంపాలని ఆదేశించింది. 

అంగన్ వాడీలను ఓటర్ల ఎన్యూమరేషన్ కోసం ప్రభుత్వం వాడుకుంటోందని లేవనెత్తిన అంశంపై రాష్ట్ర ఎన్నికల సంఘం స్పందించింది. అన్ని జిల్లాల్లో గ్రామ, వార్డు సెక్రటరీ ఉద్యోగులు అంగన్ వాడీ కార్యకర్తలుగా ఉన్నారని కమీషన్ ఒప్పుకుంది. కాబట్టి అంగన్వాడీ కార్యకర్తల స్థానంలో అర్హతలు కలిగిన వారిని బూత్ లెవల్ ఆఫీసర్లు నియమించాలని జిల్లా ఎన్నికల అధికారులకు ఎస్ఈసీ ఆదేశించింది. 

ఇదిలావుంటే దళితులకు రక్షణ కల్పించడంలో ప్రభుత్వం విఫలమమైంది... కాబట్టి పోలీసులే వారిని కాపాడాలని వర్ల రామయ్య డిజిపి గౌతమ్ సవాంగ్ (goutham sawang) ను కోరారు. ఈ మేరకు ఇటీవలే డిజిపికి ఆయన ఓ లేఖ రాసారు. 

''రాష్ట్రంలో దళితులపై దాడులు నిత్యకృత్యమైనా నిందితులపై చర్యలు లేవు. వైసీపీ (ycp) పాలనలో దళితుల ప్రాణ, మాన, ఆస్తులకు భద్రత లేకుండా పోయింది. దళితులపై దాడికి పాల్పడినా... పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోవటం లేదని రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్ విక్టర్ ప్రసాద్ సైతం అసంతృప్తి వ్యక్తం చేశారు'' అని డిజిపి దృష్టికి తీసుకెళ్లారు రామయ్య.

''న్యాయస్ధానాలు జోక్యం చేసుకుని డాక్టర్ సుధాకర్ విషయంలో సీబీఐ విచారణకు ఆదేశించాయి. వేధింపుల వల్లే డా.సుధాకర్ చనిపోయారు. వరప్రసాద్ కు శిరోముండనం చేసిన నిందితులకు, చీరాలలో కిరణ్, చిత్తూరులో ఓం ప్రతాప్ చావుకి కారణమైన వారికి ఇంతవరకు ‎శిక్ష పడలేదు. వైసీపీ నేతలు, పోలీసులు కలిసి పనిచేస్తున్నారు'' అని వర్ల ఆరోపించారు.

''అమరావతి ఎస్సీ రైతులపై అక్రమంగా ఎస్సీ, ఎస్టీ చట్టం కింద కేసుపెట్టి వేదించిన అధికారులపై చర్యలు తీసుకోమని హైకోర్టు సైతం ‎ఆదేశించింది. రాష్ట్రంలో దళితులపై జరుగుతున్న అఘాయిత్యాలపై జాతీయ ఎస్సీ కమిషన్ జోక్యం చేసుకుని పదే పదే విచారణకు ఆదేశిస్తుంది'' అని గుర్తుచేసారు.
 

Follow Us:
Download App:
  • android
  • ios