ఆంధ్రప్రదేశ్ పదో తరగతి పరీక్ష ఫలితాలు నేడు విడుదలయ్యాయి. విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఫలితాలను విడుదల చేశారు. విద్యార్థులు https://www.bse.ap.gov.in/ వెబ్‌సైట్‌లో తమ ఫలితాలను చూసుకోవచ్చు.
ఆంధ్రప్రదేశ్ పదో తరగతి పరీక్ష ఫలితాలు నేడు విడుదలయ్యాయి. విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఫలితాలను విడుదల చేశారు. విద్యార్థులు https://www.bse.ap.gov.in/ వెబ్‌సైట్‌లో తమ ఫలితాలను చూసుకోవచ్చు. విద్యార్థులు వారి రోల్ నెంబర్ వివరాలను ఎంటర్ చేసి ఫలితాలను పొందవచ్చు. ఇక ఫలితాలు గ్రేడ్‌ల రూపంలో కాకుండా మార్కుల రూపంలో ఉంటాయని అధికారులు అధికారులు ఇదివరకే ప్రకటించిన సంగతి తెలిసిందే. ఫలితాలు విడుదల చేసిన సందర్భంగా మంత్రి బొత్స మాట్లాడుతూ.. ఉత్తీర్ణత సాధించని విద్యార్థులకు వచ్చే నెల 6 నుంచి 15 వరకు సప్లీమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నట్టుగా చెప్పారు. వారి కోసం స్పెషల్ క్లాసెస్ ఏర్పాటు చేయనున్నట్టుగా చెప్పారు.
పదో తరగతిలో 67.20 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. పదో తరగతి పరీక్షల్లో బాలికలు పైచేయి సాధించారు. ఉత్తీర్ణ శాతం బాలికల్లో 70.70 శాతం, బాలురలో 64.02 శాతంగా ఉంది. మొత్తం 6,15,908 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా.. 4,14,281 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారని మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. ఫలితాల్లో 78.3 శాతం ఉత్తీర్ణతతో ప్రకాశం జిల్లా ప్రథమ స్థానంలో నిలవగా.. 49.7 శాతం ఉత్తీర్ణతతో అనంతపురం ఆఖరిస్థానంలో నిలిచింది. రాష్ట్రంలోని 797 స్కూళ్లు 100 శాతం ఉత్తీర్ణత సాధించాయి. 71 స్కూళ్లలో ఒక్క విద్యార్థి కూడా పాస్ కాలేదు.
ఇక, రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఏడాది ఏప్రిల్ 27న ప్రారంభమైన టెన్త్ పరీక్షలు మే 9న పూర్తయ్యాయి. మొత్తం 3,776 పరీక్ష కేంద్రాల్లో పరీక్ష నిర్వహించగా.. 6,22,537 మంది పదో తరగతి పరీక్షలకు ఫీజు చెల్లించారు. ఈసారి పదో తరగతి ఫలితాల్లో విద్యార్థులకు వచ్చిన మార్కులు మాత్రమే ప్రకటిస్తారు. గతంలో ఉన్న గ్రేడింగ్ పద్ధతికి బదులు.. 2020 నుంచి విద్యార్థులకు మార్కులు ఇస్తున్నారు.
మరోవైపు పరీక్షల ఫలితాలు వెలువరించాక.. విద్యాసంస్థలు, పాఠశాలలు తమ విద్యార్థులకు ఫలానా ర్యాంకులు వచ్చాయంటూ ప్రకటనలు ఇవ్వకూడదంటూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. పదో తరగతి పబ్లిక్ పరీక్షల్లో ర్యాంకులతో ప్రకటనలు జారీచేయడాన్ని నిషేధిస్తూ పాఠశాల విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బి.రాజశేఖర్ జూన్ 1న 83వ నంబరు జీవో జారీచేశారు. ఏపీ పబ్లిక్ ఎగ్జామినేషన్స్ యాక్ట్–1997 ప్రకారం ఇటువంటి మాల్‌ప్రాక్టీస్, తప్పుడు ప్రకటనలను చేసే వారికి ఏడేళ్ల వరకు జైలు, రూ.లక్ష వరకు జరిమానా విధించనున్నారు.
