అమరావతి: పార్టీ ఫిరాయింపులపై ఏపీ శాసనసభ సభ స్పీకర్ తమ్మినేని సీతారాం కీలక వ్యాఖ్యలు చేశారు. రాజ్యసభ ఛైర్మెన్  వెంకయ్యనాయుడు తీరును ఆయన తప్పుబట్టారు.

ఆదివారం నాడు అమరావతిలో జరిగిన ఓ కార్యక్రమంలో ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాం  ఈ వ్యాఖ్యలు చేశారు.రాజ్యసభలో టీడీపీ పార్లమెంటరీ పార్టీని బీజేఎల్పీలో విలీనం చేయడం సరైంది కాదని తమ్మినేని సీతారాం అభిప్రాయపడ్డారు. నలుగురు టీడీపీ ఎంపీలు బీజేపీలో పార్లమెంటరీలో చేరడాన్ని రాజ్యసభ చైర్మెన్ వెంకయ్యనాయుడు ఆమోదించడం తప్పేనని ఆయన తేల్చి చెప్పారు.

ఉన్నత పదవుల్లో ఉన్నవారు ఇలా ప్రవర్తించడం సరికాదని తమ్మినేని సీతారాం అభిప్రాయపడ్డారు.ఫిరాయింపుల సమస్య  ఏపీ అసెంబ్లీలో చోటు చేసుకొంటే నిర్మోహమాటంగా వ్యవహరించనున్నట్టు స్పీకర్ తమ్మినేని సీతారాం ప్రకటించారు.

శాసనసభ వ్యవస్థలో ఉంటూ తాను ఫిరాయింపులను ప్రోత్సహించబోనని తమ్మినేని సీతారాం ప్రకటించారు.రెండు మాసాల క్రితం సుజనా చౌదరి, సీఎం రమేష్, టీజీ వెంకటేష్, గరికపాటి మోహన్ రావులు టీడీపీ పార్లమెంటరీ పార్టీని బీజేపీ పార్లమెంటరీ పార్టీలో విలీనం చేస్తున్నట్టుగా రాజ్యసభ చైర్మెన్ కు లేఖ ఇచ్చారు.

ఈ నలుగురు టీడీపీ ఎంపీలు బీజేపీలో చేరినట్టుగా రాజ్యసభ ఆమోదం తెలిపింది. ఈ విషయమై ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాం స్పందించారు. ఇదే తరహాలో పలు రాష్ట్రాల్లో ప్రజా ప్రతినిధులు పార్టీలు ఫిరాయింపులకు పాల్పడ్డారు.

జమిలి ఎన్నికలు వస్తే  ఏం చేయగలమని ఆయన ప్రశ్నించారు. అంతా ఏలినవారి దయే అని అభిప్రాయపడ్డారు. శ్రీశైలం ప్రాజెక్టుకు గోదావరి జలాలను మళ్లించాలంటే వేరే మార్గం ఉందా అని ఆయన ప్రశ్నించారు.

ఇది ప్రెస్‌మీట్ లో  పరిష్కారమయ్యేది కాదన్నారు. అంతరాష్ట్ర సమస్య అంటూ తమ్మినేని సీతారాం అభిప్రాయపడ్డారు.రెండు రాష్ట్రాల మధ్య ఒప్పందం కుదిరిన తర్వాతే నీటిని మళ్ళిస్తారని తమ్మినేని సీతారాం స్పష్టం చేశారు.