Asianet News TeluguAsianet News Telugu

పరిషత్ ఎన్నికలపై కోర్టు తీర్పు: న్యాయనిపుణులతో ఎపీ ఎస్ఈసీ సమాలోచనలు

పరిషత్ ఎన్నికలను రద్దు చేస్తూ ఏపీ హైకోర్టు సింగిల్ జడ్జి బెంచ్ ఇచ్చిన తీర్పుపై ఏపీ ఎస్ఈసీ న్యాయ నిపుణులతో సమాలోచనలు చేస్తోంది. తీర్పుపై అపీల్ కు వెళ్లే ఆలోచన ఎస్ఈసీ ఉంది.

AP SEC reviews High Court order on Parishant elections with legal experts
Author
Amaravati, First Published May 21, 2021, 12:50 PM IST

అమరావతి: పరిషత్ ఎన్నికలను రద్దు చేస్తూ ఏపీ హైకోర్టు సింగిల్ జడ్జి బెంచ్ ఇచ్చిన తీర్పుపై ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కమిషనర్ (ఏపీ ఎస్ఈసీ) అధికారులు న్యాయనిపుణులతో సమాలోచనలు జరుపుతున్నారు. తీర్పుపై అపీల్ కు వెళ్లే ఆలోచనలో ఎపీ ఎస్ఈసీ ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే న్యాయ నిపుణులతో చర్చిస్తున్నారు.

ఏపీ సీఈసీ నీలం సాహ్ని ప్రస్తుతం ఢిల్లీలో ఉన్నారు. ఏపీ సీఈసీ కార్యాలయం అధికారులు విషయాన్ని ఆమెకు చేరవేశారు. కోర్టు తీర్పు మేరకే ఎన్నికలు నిర్వహించామని ఆమె భావిస్తున్నారు. అదే విషయాన్ని అపీల్ లో చేరుస్తామని సీఈసీ అధికారులు చెబుతున్నారు. 

ఇదిలావుంటే, పరిషత్ ఎన్నికల విషయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ (ఎస్ఈసీ) నీలం సాహ్నికి హైకోర్టులో ఎదురు దెబ్బ తగిలింది. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలను హైకోర్టు రద్దు చేసింది. పరిషత్ ఎన్నికలకు కొత్తగా తిరిగి నోటిఫికేషన్ ఇవ్వాలని ఆదేశించింది. సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు అనుగుణంగా ఎన్నికలు జరగలేదని హైకోర్టు స్పష్టం చేసింది.

పరిషత్ ఎన్నికలను ప్రక్రియను కొనసాగించడాన్ని సవాల్ చేస్తూ టీడీపీ, బిజెపి, జనసేన పిటిషన్లు దాఖలు చేశాయి. ఈ పిటిషన్లపై విచారణ జరుగుతున్న క్రమంలో మార్చిలో ఎన్నికల ప్రక్రియను కొనసాగిస్తూ ఎస్ఈసీ నీలం సాహ్ని నోటిఫికేషన్ జారీ చేశారు. దీంతో ఎన్నికలను కొనసాగించడానికి అనుమతి ఇస్తూ తమ తీర్పు వచ్చే వరకు ఫలితాలను నిలిపేయాలని ఆదేశించింది. దాంతో ఓటింగు జరిగినప్పటికీ ఓట్ల లెక్కింపు ఆగిపోయింది. 

ఎస్ఈసీగా నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఉన్న సమయంలో పరిషత్ ఎన్నికల ప్రక్రియను మధ్యలో ఆపేశారు. కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా ఆయన మధ్యలోనే ఎన్నికలను వాయిదా వేశారు. కోర్టు అనుమతితో తిరిగి ఎస్ఈసీగా పదవీ బాధ్యతలు స్వీకరించిన నిమ్మగడ్డ రమేష్ కుమార్ గ్రామ పంచాయతీ, మున్సిపల్ ఎన్నికలను నిర్వహించారు. పరిషత్ ఎన్నికలపై ఏ విధమైన నిర్ణయం తీసుకోకుండానే పదవీ విరమణ చేశారు. 

నిమ్మగడ్డ రమేష్ కుమార్ స్థానంలో ఎస్ఈసీగా నియమితులైన నీలం సాహ్ని ఆగిపోయిన దగ్గరి నుంచి పరిషత్ ఎన్నికలను నిర్వహిస్తూ నోటిఫికేషన్ జారీ చేశారు. దాంతో ఓటింగ్ ప్రక్రియ కొనసాగినప్పటికీ కోర్టు ఆదేశాలతో ఓట్ల లెక్కింపు ఆగిపోయింది. హైకోర్టు తీర్పుతో పూర్తిగా ఎన్నికలు రద్దవుతున్నాయి.

Follow Us:
Download App:
  • android
  • ios