లక్షల మంది ఓటు వేసే అవకాశం కోల్పోవడానికి కారణమైన వారిపై చర్యలు తీసుకోవాల్సిందేనని ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ స్పష్టం చేశారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఎలక్షన్ వద్దు సెలక్షన్ కావాలని కొందరు అంటున్నారని... ఎన్నికలు ఆపడానికి ప్రయత్నిస్తూనే వున్నారని నిమ్మగడ్డ స్పష్టం చేశారు.

ఎన్నికలకు ఇదే సరైన సమయమని సుప్రీంకోర్టు చెప్పిందని ఎస్ఈసీ గుర్తుచేశారు. ఎన్నికలను వ్యతిరేకించే శక్తులు ఇకనైనా మారాలని ఆయన పిలుపునిచ్చారు. ఏకగ్రీవాలను గుడ్డిగా ఆమోదించొద్దని అధికారులకు చెప్పానని నిమ్మగడ్డ స్పష్టం చేశారు.

ఏకగ్రీవాల విషయంలో విచక్షణాధికారాలు వినియోగించుకోవచ్చని ఆయన వెల్లడించారు. ఏకగ్రీవాల విషయంలో ఫిర్యాదులు వస్తే వాటిని ఆపేస్తామని నిమ్మగడ్డ స్పష్టం చేశారు.

అంతకుముందు ఒంగోలులో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఎన్ని ప్రయత్నాలు జరిగినా అంతిమ విజయం న్యాయానిదేనన్నారు. రాష్ట్రంలో ఎన్నికల నోటిఫికేషన్లు రద్దు చేయాలని దాఖలైన రెండు పిటిషన్లను ఏపీ హైకోర్టు ఇవాళ కొట్టేసింది. 

న్యాయ వ్యవస్థపై తనకు పూర్తి నమ్మకం, విధేయత ఉందన్నారు. రాజ్యాంగంలో ఉన్నదే ఈసీ అమలు చేస్తోందని ఆయన చెప్పారు. తన పరిధిలో తాను బాధ్యతాయుతంగా పనిచేస్తానని ఆయన చెప్పారు.

గత మాసంలో ఎన్నికల నిర్వహణకు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఎన్నికల షెడ్యూల్ ను విడుదల చేసింది ఎన్నికల సంఘం. ఎన్నికల నిర్వహణ విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి ఎన్నికల సంఘానికి మధ్య ఘర్షణ వాతావరణం చోటు చేసుకొంది.

ఎన్నికల సంఘం తీసుకొన్న కొన్ని నిర్ణయాలను రాష్ట్ర ప్రభుత్వం తిప్పి పంపిన ఘటనలు కూడ ఉన్నాయి. తాను తీసుకొన్న నిర్ణయాలను ఎన్నికల సంఘం కూడ వెనక్కి తిప్పి పంపింది.