మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ మరోసారి సంచలన నిర్ణయం తీసుకున్నారు. అభ్యర్ధులు మృతి చెందిన చోట ఎన్నికల ప్రక్రియ ఆగకుండా చర్యలు చేపడుతున్నట్లు ఆయన ప్రకటించారు.

ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఇప్పటి వరకు 56 మంది మృతి చెందినట్లు ఎస్ఈసీ గుర్తించింది. నామినేషన్ వేసి చనిపోయిన వారి స్థానంలో నామినేషన్ వేసేందుకు మరొకరికి అవకాశం కల్పిస్తున్నట్లు నిమ్మగడ్డ ఆదేశాలు జారీ చేశారు.

ఈ నెల 28 మధ్యాహ్నం 3 గంటల లోపు నామినేషన్ వేసేందుకు వెసులుబాటు కల్పిస్తున్నట్లు తెలిపారు. నామినేషన్ల ఉపసంహరణకు వచ్చే నెల మూడో తేదీ వరకు ఆయన అవకాశం ఇచ్చారు. మృతి చెందిన అభ్యర్ధుల్లో వైసీపీ 28, టీడీపీ 17, బీజేపీ 5, సీపీఐ 3, కాంగ్రెస్‌ నుంచి ఇద్దరు వున్నారు. 

కొద్దిరోజుల క్రితం మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ ను రాష్ట్ర ఎన్నికల కమిషనర్  నిమ్మగడ్డ రమేష్ కుమార్ విడుదల చేశారు. గతంలో ఆపిన దగ్గరి నుంచే ఎన్నికల ప్రక్రియ కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు. నిరుడు మార్చి 11వ తేదీన మునిసిపల్ ఎన్నికలకు నోటిఫికేషన్ జారీ అయింది. మార్చి 11, 12 తేదీల్లో అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. 

ఈ ఏడాది మార్చి 10వ తేదీన మున్సిపల్ ఎన్నికల పోలింగ్ జరుగుతుంది. ఓట్ల లెక్కింపు మార్చి 14వ తేదీన జరుగుతుంది. అవసరమైతే రీపోలింగ్ మార్చి  13వ తేదీన జరుగుతుంది. 

మార్చి 2,3 తేదీల్లో నామినేషన్ల ఉపసంహరణకు అవకాశం కల్పించారు. నిరుడు మార్చి 16వ తేదీన నామినేషన్ల ఉపసంహరణ గడువు రోజునే నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఎన్నికలను వాయిదా వేశారు. రాష్ట్రంలోని 12 కార్పోరేషన్లకు, 75 మునిసిపాలిటీలకూ నగర పంచాయతీలకూ ఎన్నికలు జరగనున్నాయి.

కోర్టు కేసుల కారణంగా రాజమండ్రి, నెల్లూరు కార్పోరేషన్లకు ఎన్ికలు జరగడం లేదు. విజయనగరం, విశాఖ, ఏలూరు, విజయవాడ, మచిలీపట్నం, గుంటూరు, ఒంగోలు, చిత్తూరు, తిరుపతి, కడప, కర్నూలు, అనంతపురం కార్పోరేషన్లకు ఎన్నికలు జరగనున్నాయి.

కాగా, కరోనా వైరస్ కారణంగా అప్పట్లో నిమ్మగడ్డ రమేష్ కుమార్ స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేసిన విషయం తెలిసిందే. ఆయన నిర్ణయాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రభుత్వం తీవ్రంగా వ్యతిరేకించింది.

మున్సిపల్ ఎన్నికల ప్రక్రియను ఆపేసి, గ్రామ పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేశారు. దీంతో ప్రస్తుతం గ్రామ పంచాయతీ ఎన్నికలు జరుగుతున్నాయి.