అమరావతి:

పంచాయితీ ఎన్నికల రీ కౌంటింగ్ పై రాష్ట్ర ఎన్నికల సంఘం బుధవారం నాడు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు పంచాయితీరాజ్ శాఖ కు ఏపీ ఎస్ఈసీ ఆదేశాలు జారీ చేసింది. ఎన్నికల రిటర్నింగ్ అధికారులు, ఎండీఓల నివేదికల ఆధారంగా ఎస్ఈసీ చర్యలు తీసుకోనుంది.

గ్రామ పంచాయితీ ఎన్నికల కౌంటింగ్ విషయంలో అనేక అక్రమాలు, అవకతవకలు చోటు చేసుకొన్నాయని విపక్షాలు ఆరోపించాయి. కౌంటింగ్ సమయంలో అధికార పార్టీకి అనుకూలంగా అధికారులు వ్యవహరించారని టీడీపీ ఆరోపించింది.

 

ఇతర పార్టీల గెలుపును కూడ తమ ఖాతాలో వేసుకొన్నారని చంద్రబాబు విమర్శలు చేసిన విషయం తెలిసిందే. ఈ విషయమై విపక్షాల నుండి వచ్చిన విమర్శల నేపథ్యంలో ఏపీ రాష్ట్ర ఎన్నికల సంఘం ఈ నిర్ణయం తీసుకొంది.

ఎల్లుండి లోపుగా పంచాయితీల వారీగా నివేదికలు పంపాలని ఆదేశాలు జారీ చేసింది. గ్రామ పంచాయితీ ఎన్నికలు పూర్తైన తర్వాత కౌంటింగ్ ఎన్ని గంటలకు ప్రారంభించారు. కౌంటింగ్ సమయంలో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడిందా... విద్యుత్ సరఫరా అంతరాయానికి గల కారణాలు ఏమిటనే విషయమై కూడ వివరాలు తెలపాలని కోరింది.

కౌంటింగ్ పూర్తైన తర్వాత ఓటమి పాలైన అభ్యర్ధి తరపున ఏజంట్ నుండి సంతకాలు తీసుకొన్నారా అని ప్రశ్నించింది,. ఎక్కడెక్కడ రీ కౌంటింగ్ జరిగిందో వివరాలు కూడ అందించాలని ఎస్ఈసీ ఆదేశించింది. పంచాయితీల వారీగా నిర్ణీత ఫార్మెట్ లో పంపాలని ఎస్ఈసీ కోరింది. ఈ మేరకు పంచాయితీ రాజ్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, కమిషనర్ కు రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది.