ఏపీ ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ తన సెలవులను వాయిదా వేసుకున్నారు. ఈ నెల 19వ తేదీ నుంచి ఆయన సెలవుపై వెళ్లనున్నారు. దీంతో పరిషత్ ఎన్నికలు జరిగే అవకాశాలు కనిపించడం లేదు.

అమరావతి: తన సెలవులను ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కమిషనర్ (ఏపీఎస్ఈసి) రమేష్ కుమార్ వాయిదా వేసుకున్నారు. ఈ నెల 16వ తేదీ నుంచి సెలవుపై వెళ్లాలని భావించిన ఆయన తన మనసు మార్చుకున్నారు. ఈ నెల 18వ తేదీన మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికలు ఉండడంతో ఆయన తన సెలవులను మార్చుకున్నారు. ఈ విషయంపై ఆయన రాష్ట్ర గవర్నర్ హరిచందన్ కు లేఖ రాశారు. 

ఈ నెల 19వ తేదీ నుంచి 22వ తేదీ వరకు సెలవుపై వెళ్లనున్నట్లు ఆయన తెలిపారు. మూడు రోజుల క్రితం ఆయన సెలవులకు దరఖాస్తు పెట్టుకున్నారు. ఆయన పెట్టిన సెలవులను పంచాయతీరాజ్ శాఖ అనుమతి ఇచ్చింది. అయితే, తాజాగా ఆయన గతంలో పెట్టిన సెలువనలు వాయిదా వేసుకున్నారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ (ఏపీ ఎస్ఈసీ) నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఈనెల 16నుంచి 21వరకు సెలవులో ఉంటున్నారని వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. కుటుంబ సభ్యులతో కలిసి ఆయన అరుణాచల్ ప్రదేశ్ పర్యటనకు వెళ్తున్నారు. దీన్ని బట్టి నిమ్మగడ్డ రమేష్ కుమార్ హయాంలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు జరగబోవని అర్థమవుతోంది.

నిమ్మగడ్డ రమేష్ కుమార్ మార్చి 31వ తేదీన పదవీ విరమణ చేయనున్నారు. దాంతో ఎంపీటీసీ, జడ్పీటీసీ అభ్యర్థుల ఆశలపై నీళ్ళు చల్లినట్లేనని అంటున్నారు. ఏడాది కాలంగా ఎన్నికల కోసం ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల కోసం ఎదురు చూస్తున్నారు. నిరుడు మార్చిలో అభ్యర్థులు నామినేషన్లు వేశారు. 

పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల తర్వాత పాత నోటిఫికేషన్ ప్రకారమే ఎన్నికలు జరుగుతాయనే ఆశలో ఎంపీటీసీ, జడ్పీటీసీ అభ్యర్థులు ఉన్నారు. 
కొత్త జిల్లాల ఏర్పాటు తర్వాతే ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు జరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు.

కొత్త జిల్లాల ఏర్పాటు చేస్తే రిజర్వేషన్లు కూడా మారే అవకాశం ఉంటుంది దీంతో ఎంపీటీసీ, జడ్పీటీసీ అభ్యర్థులు నెత్తీనోరు కొట్టుకుంటున్నారు. ప్రజల్లోనే ఉండటానికి ఏడాది కాలంగా స్థాయికి మించి ఖర్చు చేశామమని అభ్యర్థులు అంటున్నారు.

గ్రామ పంచాయతీ ఎన్నికలు ముగిశాయి. మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ముగిసింది. ఈ నెల 14వ తేదీన ఓట్ల లెక్కింపు జరగనుంది. మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వెలువడి, మేయర్,. డిప్యూటీ మేయర్ ఎన్నికలు జరిగిన తర్వాత ఆయన సెలవులో ఉంటారు.