Michaung Cyclone: తుఫాన్ ప్రభావంతో పలు జిల్లాల్లో విద్యా సంస్థలకు సెలవు ప్రకటించారు. ఇంతకీ ఏ ఏ జిల్లాల్లో పాఠశాలలకు సెలవు ప్రకటించారో  ఒకసారి తెలుసుకుందాం.  

Michaung Cyclone: మిగ్‌జాం తుఫాన్ వణికిస్తోంది. ఈ తుఫాన్ ప్రభావంతో తమిళనాడుతోపాటు ఆంధ్రప్రదేశ్‌లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇప్పటికే పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో కోస్తాతో పాటు రాయలసీమలో కూడా విస్తారంగానే వర్షాలు కురుస్తున్నాయి. దీంతో ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. ప్రజలకు తుఫాన్ హెచ్చరికలు చేస్తూ.. ప్రజలను అప్రమత్తం చేస్తున్నాయి. అలాగే.. ముంపు, తీర ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు  తరలిస్తున్నారు. ఈ నేపథ్యంలో పలు జిల్లాల్లో స్కూళ్లకు ప్రభుత్వం సెలవు కూడా ప్రకటించింది.

ఇప్పటికే విశాఖపట్నంలో స్కూళ్లకు హాలిడే ప్రకటించేశారు. ఈ తుఫాన్ తీవ్రత తగ్గకపోవడంతో (డిసెంబర్ 5న) నేడు కూడా సెలవు ప్రకటించారు.  అలాగే ఎన్టీఆర్ జిల్లా, ప్రకాశం జిల్లా, కృష్ణా జిల్లాల్లో విద్యా సంస్థలకు సెలవు ప్రకటించారు. అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ విద్యా సంస్థలు సెలవు ప్రకటించాల్సిందిగా విద్యాశాఖ పేర్కొంది. ముందస్తు జాగ్రత్తగా ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.  ప్రైవేట్ విద్యా సంస్థలకు కూడా విద్యాశాఖ ఆదేశాలను తక్షణమే అమలు చేయాలని ,ఈ మేరకు డీఈవోకు ఆదేశాలు ఇచ్చారు. 

 ఇదిలాఉంటే.. తుఫాను కారణంగా కోస్తాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. శ్రీకాకుళం, ఉభయ గోదావరి జిల్లాలు, విశాఖ పట్నం, విజయనగరం, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, కృష్టా జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. తిరుపతి జిల్లాలో కూడా పడుతున్నాయి. ఇక తుఫాన్ నెల్లూరు మచిలీపట్నం మధ్య తీరం దాటనున్నట్టు తెలుస్తోంది. దీంతో మత్య్స కారులు వేటకు వెళ్లొద్దని ఇప్పటికే ప్రభుత్వం హెచ్చరించింది. అంతేకాకుండా తుఫాన్ ప్రభావం వల్ల ఇప్పటికే పలు రైళ్లు రద్దు అయ్యాయి. అందు వల్ల రైల్వే ప్రయాణికులకు ఈ విషయాన్ని కూడా  గుర్తించుకోవాలి.