Asianet News TeluguAsianet News Telugu
breaking news image

ఈవీఎంలపై ఏపీ మాజీ సీఎం జగన్ అనుమానాలు.. ఏది నిజం, ఏది అబద్ధం.. ఏ మాట నమ్మాలి..?

ఏపీ మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్ ఈవీఎంలపై సంచనల కామెంట్స్ చేశారు. ఈవీఎంలు వద్దు, బ్యాలెటే ముద్దు అన్నట్లు ట్వీట్ చేయడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. 2019లో ఇదే జగన్ ఈవీఎంలలో ఎలాంటి లోపం లేదని మాట్లాడటం గమనార్హం.

AP's former CM Jagan's suspicions on EVMs.. Which is true, which is false.. Which word should be believed..? GVR
Author
First Published Jun 18, 2024, 9:47 AM IST

2019 ఎన్నికల తర్వాత ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ విధానం (ఈవీఎం)పై అనుమానాలు వ్యక్తం చేసినప్పుడు జగన్ ఇలా స్పందించారు. ‘‘ఈవీఎంలలో ఏదో జరిగిపోతా ఉందని అంతా గగ్గోలు పెడుతున్నారు. 2014 ఎన్నికల్లో మా మీదు (చంద్రబాబు) గెలిచారు. అప్పుడు ఈవీఎంలతోనే గెలిచారు కదా. మరి అప్పుడు ఈవీఎంలు ట్యాంపర్ చేసే గెలిచారనుకోవాలా..?’’

అదే ఏడాది మరోసారి జగన్‌ ఏమన్నారంటే.... ‘‘80 పర్సెంటేజీ జనాభా వెళ్లి పోలింగ్ బూత్‌లో బటన్‌ నొక్కారు. బటన్‌ నొక్కిన తర్వాత వారు ఏ పార్టీకి ఓటేశారన్నది వీవీ ప్యాట్‌లో కనిపిస్తుంది. వాళ్లు వేసిన ఓటు, వీవీ ప్యాట్‌లో కనిపించిన ఓటు రెండూ మ్యాచ్‌ అయ్యాయి కాబట్టే.. ఓటర్లు సంతృప్తి చెంది, బూత్‌లో నుంచి బయటకు వచ్చారు. ఇలా ఓటేసిన 80 శాతం మందిలో ఎవరూ కంప్లైంట్‌ చేయలేదు. నేను ఫ్యాన్‌ గుర్తుకు ఓటేశాక.. నాకు సైకిల్‌ గుర్తు కనిపిస్తే నేనేందుకు గమ్మునుంటా..? గమ్మునుండను కదా. అక్కడే గొడవ చేసి.. వెంటనే కంప్లైంట్‌ చేసేవాడిని. అలా ఓటేసిన వారికి.. వేరే పార్టీకి ఓటు వేసినట్లు వీవీ ప్యాట్‌లో కనిపించలేదు కాబట్టే అందరూ శాటిస్‌ఫై అయ్యారు. కాబట్టే పోలింగ్‌ బూత్‌లో గానీ, పోలింగ్‌ ఆఫీసర్‌ దగ్గర గానీ ఎవరూ కంప్లైంట్‌ ఇవ్వలేదు. ఇవన్నీ చంద్రబాబు నాయుడికి తెలిసే.. తానెవరికి ఓటేశానో తనకే తెలియదని చెప్పి డ్రామాలు చేయడం ఎంతవరకు ధర్మం అని అడుగుతున్నా..'' అంటూ జగన్‌ గత ఎన్నికల సమయంలో సెటైర్లు వేశారు. 

ఇప్పుడేమో ఈవీఎంలు వద్దు బ్యాలెట్ పేపరే ముద్దు అన్నట్లు జగన్ చేసిన ట్వీట్ సంచలనం రేపుతోంది. ‘‘న్యాయం జరగడం మాత్రమే కాదు, జరిగినట్లు కనిపించాలి కూడా. అలాగే ప్రజాస్వామ్యం ప్రబలంగా ఉండటమే కాకుండా నిస్సందేహంగా ప్రబలంగా కనిపించాలి. 
ప్రపంచ వ్యాప్తంగా దాదాపు ప్రతి అభివృద్ధి చెందిన ప్రజాస్వామ్య దేశంలో పేపర్ బ్యాలెట్ పద్ధతిలోనే ఎన్నికలు నిర్వహిస్తున్నారు, EVMలు కాదు. 
నిజమైన ప్రజాస్వామ్య స్ఫూర్తిని నిలబెట్టుకోవాలంటే మనం కూడా అదే దిశగా పయనించాలి (పేపర్ బ్యాలెట్ వాడాలి).’’ అంటూ జగన్ ట్వీట్ చేయడం చర్చనీయాంశంగా మారింది. ఈ ట్వీట్ కు టీడీపీ, బీజేపీ, జనసేన శ్రేణులు కౌంటర్ ఇస్తున్నాయి.

 

 

ఇప్పుడు దేశ వ్యాప్తంగా ఈవీఎంలపై అనుమానాలు వ్యక్తమవుతున్న వేళ తన మాటలను తానే ఖండించుకున్నారు. ఇటీవల ఎన్నికల ఫలితాల తర్వాత... ఎన్నికల్లో ఏదో తప్పు జరిగిందన్నట్లు పరోక్షంగా మాట్లాడిన జగన్‌... అంతా దేవుడికే తెలుసంటూ కామెంట్ చేశారు. సోషల్‌ మీడియాలో వైసీపీ కేడర్‌, ఫాలోవర్లతో ఈవీఎంలపై అనుమానాలు రేకెత్తించేలా పోస్టింగులు చేయిస్తూ వస్తున్నారు. తాజాగా ఎలాన్‌ మస్క్‌ ట్వీట్‌తో భారత్‌తో పాటు అంతర్జాతీయంగా ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ విధానంపై అనుమానాలు, ఊహాగానాలు ఊపందుకున్నాయి. 

‘‘ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్లను రద్దు చేయాలి. మానవులు లేదా AI ద్వారా ఈవీఎంలను హ్యాక్ చేసే ప్రమాదం ఉంది. వాటిని తొలిగించి పేపర్ బ్యాలెట్ విధానం అమలు చేయాలి’’ అని ట్వీట్ చేశారు. 
ప్యూర్టోరికో ప్రైమరీ ఎన్నికల్లో ఈవీఎంలకు సంబంధించి ఓటింగ్ అవకతవకలు జరిగాయని అమెరికా అధ్యక్ష అభ్యర్థి కెన్నెడీ చేసిన ట్వీట్‌పై మస్క్‌ ఇలా స్పందించారు. 

 


అయితే, ఎలాన్‌ మస్క్‌ చేసిన ట్వీట్‌పై దేశమంతా చర్చ మొదలైంది. కాంగ్రెస్‌ పార్టీ నేతలైతే మస్క్‌ అనుమానాలకు మరింత బలం చేకూర్చేలా మాట్లాడారు. బీజేపీ మాత్రం ఖండించింది. కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ నేత రాజీవ్‌ చంద్రశేఖర్‌ మస్క్‌కు స్ట్రాంగ్ కౌంటర్‌ ఇచ్చారు. ‘‘మస్క్ ఆలోచనా విధానం అమెరికా సహా ఇతర ప్రాంతాల్లో అమలు చేయొచ్చు. కానీ భారత్‌లో ఈవీఎంలను హ్యాక్ చేయడం అసాధ్యం. అమెరికాలో ఇంటర్నెట్ ఆధారంగా ఓటింగ్ యంత్రాలు పనిచేస్తాయి. భారత్‌లో మాత్రం బ్లూటూత్, వైఫై, ఇంటర్నెట్ లాంటి ఏ మార్గాల్లోనూ ఈవీఎంలను కనెక్ట్‌ చేయడం సాధ్యం కాదు. ఈవీఎంలను రీప్రోగ్రామ్ చేయడం కూడా అసాధ్యం. భారత్‌లో తయారుచేసినట్లే మీ దేశంలోనూ ఈవీఎంలను తయారుచేయొచ్చు. అవసరమైతే దీనిపై మస్క్‌కి శిక్షణ కూడా ఇస్తాం'' అని రాజీవ్‌ చంద్రశేఖర్‌ రిప్లై ఇచ్చారు. 

 

అలాగే, ఎలాన్‌ మస్క్‌ కామెంట్స్‌పై కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ ఆంధ్రప్రదేశ్‌ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి కూడా స్పందించారు. మస్క్‌ చెప్పినట్లు ఈవీఎంలను హ్యాక్ చేసే వీలుంటే ఆయన్ను భారత్‌కు ఆహ్వానించాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని కోరారు. ఇలాగే, చాలా మందికి ఈసీ అవకాశమిచ్చినా నిరూపించలేకపోయారని తెలిపారు. ఇది ఓ రకంగా మస్క్ కి గట్టి సవాల్ అనే చెప్పాలి. 

 

ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్ కూడా ఈవీఎంలపై అనుమానాలు వ్యక్తం చేస్తూ ట్వీట్ చేయడంపై సోషల్ మీడియాలో రచ్చ జరుగుతోంది. 2019లో 151 అసెంబ్లీ, 22 పార్లమెంటు సీట్లు గెలుచుకున్న లేని అనుమానాలు ఇప్పుడెందుకని ప్రశ్నిస్తున్నారు. అప్పుడు, ఈవీఎంలు అంతా సవ్యంగానే పనిచేస్తున్నాయని క్లాస్ పీకిన జగన్.. చంద్రబాబు నాటకాలాడుతున్నారంటూ సెటైర్లు వేశారు. మరి ఇప్పుడెందుకు జగన్ యూ టర్న్ తీసుకున్నారు..? తనకు అనుకూలంగా జరిగితే అన్నీ బాగున్నట్లు... లేకపోతే లోపాలు ఉన్నట్లా..? అలా అయితే, జగన్‌ 2019లో చెప్పిన మాటలు నమ్మాలా..? లేక ఇప్పుడు చేసిన ట్వీట్‌ నిజం అనుకోవాలా..? జనం దేన్ని నమ్మాలో ఆయనో చెబితే సరిపోతుంది కదా. గతంలో తాను ఈవీఎంలపై చెప్పినవన్నీ అబద్ధాలే. 2019లో తాను ఘన విజయం సాధించినప్పుడు కూడా ఇలాగే ఈవీఎంలను ట్యాంపర్‌ చేశారని చెప్పొచ్చు కదా.. ఇలా నెటిజన్లు జగన్‌ ట్వీట్‌పై స్పందిస్తున్నారు.

 

 

మరో కోణం...

అయితే, వైసీపీ ఇరుకున పడిన ప్రతిసారి ఏదో ఒక కొత్త టాపిక్ ఎంచుకుంటుంది. తాజా ఎన్నికల ఫలితాలను ఎలా సమర్థించుకోవాలో కూడా తెలియని పరిస్థితుల్లో ఆ పార్టీ ఉంది. ఘోర పరాజయానికి కారణాలను వైసీపీ కనిపెట్టే లోపే... గత ఐదేళ్లలో జగన్, ఆయన ప్రభుత్వం చేసిన తప్పులను వెలికితీసే పని మొదలుపెట్టింది చంద్రబాబు ప్రభుత్వం. ప్రజాధనంతో కొన్న ఫర్నీచర్ ను జగన్ క్యాంపు కార్యాలయానికి తరలించడం, కోట్లాది రూపాయలు వెచ్చించి ఇంటికి ఫెన్సింగ్ వేసుకోవడం, దాదాపు రూ.500 కోట్లతో విశాఖ రుషికొండపై భారీ భవంతుల నిర్మాణం... ఇలా జగన్ చేసిన దుబారా ఖర్చులు, లెక్కలేని పనులను టీడీపీ ప్రజల్లోకి తీసుకెళ్తోంది. రుషికొండ భవనాలపై అయితే ఓ రేంజ్ లో రచ్చ జరుగుతోంది. ఈ సమయంలో ఈవీఎంలపై జగన్ స్పందించడం డైవర్షన్ పాలిటిక్స్ లో భాగమేనని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.    

 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios