జైల్లో చంద్రబాబు : సూపరింటిండెంట్ రాహుల్ సెలవు.. ఏపీ జైళ్ల శాఖ వివరణ
రాజమండ్రి సెంట్రల్ జైలు సూపరింటెండెంట్ సెలవుపై వెళ్లడం ఏపీ రాజకీయాల్లో కలకలం రేపుతోంది. రాజమండ్రి సెంట్రల్ జైలు సూపరింటెండెంట్ భార్యకు అనారోగ్యంగా వుందని, అందుకే ఆయన సెలవు పెట్టారని ఏపీ జైళ్ల శాఖ క్లారిటీ ఇచ్చింది.

రాజమండ్రి సెంట్రల్ జైలు సూపరింటెండెంట్ రాహుల్ సెలవుపై వెళ్లడం ఏపీ రాజకీయాల్లో కలకలం రేపుతోంది. స్కిల్ డెవలప్‌మెంట్ స్కాంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రస్తుతం అక్కడే రిమాండ్‌లో వున్నారు . ఈ నేపథ్యంలో ఆయన సెలవుపై వెళ్లడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ క్రమంలో జైళ్ల శాఖ స్పందించింది. రాహుల్ భార్య కొన్నాళ్లుగా అనారోగ్యంతో వున్నారని.. ఆమె నిన్న ఉదయం ఆసుపత్రిలో చేరారని తెలిపింది. ఆసుపత్రిలో భార్యను చూసుకునేందుకు రాహుల్ సెలవు పెట్టారని.. 4 రోజుల సెలవు అభ్యర్ధనను జైళ్ల శాఖ అంగీకరించిందని పేర్కొంది. రాహుల్ ఎలాంటి నిబంధనలు ఉల్లంఘించలేదని జైళ్ల శాఖ వెల్లడించింది.
అంతకుముందు ఈ వ్యవహారంపై హోంమంత్రి తానేటి వనిత స్పందించారు. రాజమండ్రి సెంట్రల్ జైలు సూపరింటెండెంట్ భార్యకు అనారోగ్యంగా వుందని, అందుకే ఆయన సెలవు పెట్టారని వనిత క్లారిటీ ఇచ్చారు. సెంట్రల్ జైలులో బ్లాక్ మొత్తం చంద్రబాబుకి కేటాయించామని.. సీసీ కెమెరాలతో పాటు కట్టుదిట్టమైన భద్రత కల్పించామని హోంమంత్రి పేర్కొన్నారు.
ALso Read: సెలవుపై రాజమండ్రి జైలు సూపరింటెండెంట్.. వివాదం, క్లారిటీ ఇచ్చిన తానేటి వనిత
కాగా.. చంద్రబాబుతో ఆయన సతీమణి భువనేశ్వరి ములాఖత్ అయిన తర్వాత మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు భద్రతపై ఆమె అనుమానాలు వ్యక్తం చేశారు. డిఐజీ రవికిరణ్ 12వ తేదీ రాత్రి జైలులో తనిఖీలు నిర్వహించారు .13వ తేదీన మరోసారి ఎస్పీ జగదీశ్ తో కలిసి చంాద్రబాబు భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. ఈ నేపథ్యంలో రాహుల్ సెలవు పెట్టడంపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
అరెస్టయి రాజమండ్రి సెంట్రల్ జైలుకు వెళ్లిన తర్వాత ఆయన సతీమణి భువనేశ్వరి, కుమారుడు నారా లోకేష్, కోడలు బ్రాహ్మణి ములాఖత్ లో భాగంగా చంద్రబాబును కలిశారు. ఆ తర్వాత జనసేన అధినేత పవన్ కల్యాణ్, టిడిపి ఎమ్మెల్యే పవన్ కల్యాణ్ చంద్రబాబును కలిశారు. మరోసారి చంద్రబాబుతో ములాఖత్ కోసం భువనేశ్వరి శుక్రవారం దరఖాస్తు చేసుకున్నారు. దాన్ని అధికారులు తిరస్కరించారు.