సీపీఎస్‌ రద్దు చేస్తూ ప్రభుత్వం ప్రకటన చేయాలని ఏపీ ఉపాధ్యాయ సంఘాల నేతలు డిమాండ్‌ చేశారు. ఫిట్ మెంట్‌ 27 శాతం ఇవ్వాలని, కాంట్రాక్ట్ ఉద్యోగులను క్రమబద్ధీకరించాలని విజ్ఞప్తి చేశారు. ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకు హెచ్‌ఆర్‌ఏ, డీఏ, టీఏ ఇవ్వాలని సుధీర్ బాబు డిమాండ్‌ చేశారు. 

సమస్యల పరిష్కారం కోసం ఆంధ్రప్రదేశ్‌లోని ఉపాధ్యాయ సంఘాలు (teachers union) గత కొన్ని రోజులుగా ఆందోళన నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఫ్యాప్టో ఆధ్వర్యంలో శనివారం విజయవాడలో రౌండ్‌టేబుల్‌ సమావేశం నిర్వహించిన ఉపాధ్యాయ సంఘాల నేతలు భవిష్యత్‌ ఉద్యమ కార్యాచరణపై చర్చించారు. ఈ సమావేశానికి పీడీఎఫ్‌ ఎమ్మెల్సీలు, కాంట్రాక్ట్ ఔట్ సోర్సింగ్ జేఏసీ నేతలు కూడా హాజరయ్యారు. తమతో పాటు కలిసి వచ్చే అన్ని ఉద్యోగ సంఘాలను కలుపుకొని ముందుకు వెళ్లేందుకు నిర్ణయించినట్టు ఉపాధ్యాయ నేతలు తెలిపారు. 

ఈ సందర్భంగా ఫ్యాప్టో అధ్యక్షుడు సుధీర్‌ బాబు మాట్లాడుతూ.. సీపీఎస్‌ రద్దు చేస్తూ ప్రభుత్వం ప్రకటన చేయాలని డిమాండ్‌ చేశారు. ఫిట్ మెంట్‌ 27 శాతం ఇవ్వాలని, కాంట్రాక్ట్ ఉద్యోగులను క్రమబద్ధీకరించాలని విజ్ఞప్తి చేశారు. ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకు హెచ్‌ఆర్‌ఏ, డీఏ, టీఏ ఇవ్వాలని సుధీర్ బాబు డిమాండ్‌ చేశారు. ఈనెల 14న సీఎస్‌కు నోటీసు ఇవ్వనున్నట్టు ఫ్యాప్టో కార్యదర్శి శరత్‌ చంద్ర చెప్పారు.

ఉపాధ్యాయ సంఘాల ఉద్యమ కార్యాచరణ:

* ఫిబ్రవరి 14, 15న సీఎంను కలిసేందుకు ప్రయత్నం

* ఈనెల 15 నుంచి 20 వరకు పీఆర్సీ పునఃసమీక్షకు సంతకాల సేకరణ

* ఈనెల 21-24 మధ్య ఉద్యోగ, ఉపాధ్యాయ, పింఛనర్లతో బ్యాలెట్ల నిర్వహణ

* మంత్రులకు, ఎమ్మెల్యేలకు విజ్ఞాపనలు

* ఫిబ్రవరి 25న ప్రభుత్వానికి బహిరంగ లేఖ

* మార్చి 2, 3న కలెక్టరేట్ల వద్ద రిలే నిరాహార దీక్షలు 

కాగా.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంతో పీఆర్సీ సాధన సమితి కుదుర్చుకొన్న ఒప్పందం విషయంలో ఉపాధ్యాయ సంఘాలు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నాయి. కొత్త PRC జీవోలను నిరసిస్తూ ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు JACగా ఏర్పడి Strikeనోటీసులు ఇచ్చారు. అయితే ఈ నెల 4, 5 తేదీల్లో ప్రభుత్వం ఏర్పాటు చేసిన సంప్రదింపుల కమిటీ నిర్వహించిన చర్చలు సఫలమయ్యాయి. 

దీంతో పీఆర్సీ సాధన సమితి సమ్మెను విరమిస్తున్నట్టుగా ప్రకటించింది. అయితే ఈ విషయమై ఉపాధ్యాయ సంఘాల నేతలు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. ప్రభుత్వంతో జరిగిన చర్చల నుండి చివరి నిమిషంలో ఉపాధ్యాయ సంఘాలు వాకౌట్ చేశాయి. పీఆర్సీ సాధన సమితి ప్రభుత్వంతో చేసుకొన్న ఒప్పందంతో తమకు సంబంధం లేదని ఉపాధ్యాయ సంఘాలు ప్రకటించాయి. ఈ మేరకు ఏపీ పీఆర్సీ సాధన సమితిలో తమ పదవులకు ఏపీటీఎఫ్ నేతలు రాజీనామాలు చేశారు.