ఏఎస్సై చేయి నరికిన అల్లరిమూకలు: మీ ధైర్యసాహసాలు స్పూర్తిదాయకం... ఏపీ పోలీసుల సెల్యూట్
పంజాబ్‌లో లాక్‌డౌన్ విధులు నిర్వర్తిస్తున్న ఓ ఏఎస్సై చేతిని కొందరు నరికివేశారు. ఈ సందర్భంగా ఆయన చూపిన ధైర్య సాహసాలకు సంఘీభావంగా పంజాబ్ డీజీపీ ఓ క్యాంపెయినింగ్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.
కరోనా వైరస్‌ను అరికట్టేందుకు గాను భారతదేశంలో కేంద్ర ప్రభుత్వం లాక్‌డౌన్ విధించిన సంగతి తెలిసిందే. అయితే ప్రజలు బయటకు రావొద్దని ప్రధాని మోడీ, ముఖ్యమంత్రులు, ఇతర ప్రముఖులు ఎంతగా విజ్ఞప్తి చేస్తున్నప్పటికీ కొందరు బాధ్యత లేకుండా ప్రవర్తిస్తూనే ఉన్నారు.
ఈ క్రమంలో పంజాబ్‌లో లాక్‌డౌన్ విధులు నిర్వర్తిస్తున్న ఓ ఏఎస్సై చేతిని కొందరు నరికివేశారు. ఈ సందర్భంగా ఆయన చూపిన ధైర్య సాహసాలకు సంఘీభావంగా పంజాబ్ డీజీపీ ఓ క్యాంపెయినింగ్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.
Also Read:పంజాబ్ ఘటన: ఏడున్నర గంటలు కష్టపడి తెగిన పోలీసు చేతిని అతికించిన డాక్టర్లు
‘‘మేబీ హర్జీత్‌సింగ్’’ అనే ఈ కార్యక్రమంల పోలీసులు తమ ఖాకీ యూనీఫామ్‌లో వారి పేర్లకు బదులు హర్జీత్ సింగ్ పేరుతో బ్యాడ్జిలను పెట్టుకుని సంఘీభావం తెలపాలని కోరారు. అలాగే సాధారణ ప్రజలు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనాలంటే హర్జీత్ సింగ్ పేరుతో ఓ ప్లకార్డ్ ప్రదర్శించి దానిని సోషల్ మీడియాలో పోస్ట్ చేయాని డీజీపీ కోరారు.
దీనిలో భాగంగా ఏపీ డీజీప గౌతమ్ సవాంగ్ ఆధ్వర్యంలో రాష్ట్ర పోలీసులు మేబీ హర్జీత్ సింగ్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడుతూ... అల్లరి మూకలు చేతిని నరికినప్పటికీ, వారిని వెంబడించి ఆటకట్టించిన హర్జీత్ సింగ్ ధైర్యసాహసాలు పోలీస్ వ్యవస్థకు స్పూర్తిదాయకమని కొనియాడారు.
విపత్కర పరిస్ధితుల్లో ప్రజల ఆరోగ్యాన్ని రక్షిస్తూ, ప్రాణాలను సైతం పణంగా పెట్టి, వైద్యం అందిస్తున్న వైద్యులకు తాను చేతులెత్తి నమస్కారాలు తెలియజేస్తున్నట్లు డీజీపీ పేర్కొన్నారు.
Also Read:లాక్‌డౌన్ ఉల్లంఘన: ప్రశ్నించిన పోలీసులపై కత్తులతో దాడి
అలాగే హర్జీత్ సింగ్‌కు 48 గంటలు తిరగకముందే అత్యంత క్లిష్టమైన ఆపరేషన్‌ను చేసి చేతిని అతికించి యథాస్థితికి తీసుకొచ్చిన వైద్య బృందానికి గౌతమ్ సవాంగ్ ధన్యవాదాలు తెలియజేశారు.
మంగళగిరిలోని రాష్ట్ర పోలీస్ ప్రధాన కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో అడిషనల్ డీజీలు హరీశ్ కుమార్ గుప్తా, రవిశంకర్, మహేశ్ చంద్ర లడ్డా తదితరులు పాల్గొన్నారు. బీజేపీ రాజ్యసభ సభ్యుడు రాజీవ్ చంద్రశేఖర్ సైతం హర్జీత్ సింగ్ ధైర్య సాహసాలను ప్రశంసిస్తూ సెల్యూట్ చేశారు. ఆయన త్వరగా కోలుకోవాలని ట్వీట్ చేశారు.