Asianet News TeluguAsianet News Telugu

డీజీపీపై వ్యాఖ్యలు: ఈసారి కోర్టుకెక్కుతాం.. చంద్రబాబుకు పోలీస్ అధికారుల సంఘం వార్నింగ్

ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్‌పై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యల పట్ల ఏపీ పోలీసు అధికారుల సంఘం స్పందించింది. డీజీపీపై బాబు వ్యాఖ్యలను ఖండిస్తున్నట్టు స్పష్టం చేసింది. 

ap police officers association condemns chandrababu comments on dgp gautam sawang ksp
Author
Amaravathi, First Published Mar 5, 2021, 6:06 PM IST

ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్‌పై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యల పట్ల ఏపీ పోలీసు అధికారుల సంఘం స్పందించింది. డీజీపీపై బాబు వ్యాఖ్యలను ఖండిస్తున్నట్టు స్పష్టం చేసింది.

పంచాయతీ ఎన్నికల్లో పరాజయం నేపథ్యంలో చంద్రబాబు పరిస్థితిని అర్థం చేసుకోగలమని వ్యాఖ్యానించింది. అయితే, ఎన్నికల్లో ఓటమికి పోలీసు శాఖదే బాధ్యత అనడం సమంజసం కాదని తెలిపింది.

పోలీసులపై చంద్రబాబు వ్యతిరేకత కొత్తేమీ కాదని ఎద్దేవా చేసింది. డీజీపీని, పోలీసులను బెదిరిస్తూ కుల, ప్రాంతీయ భావాలు రేకెత్తించి తమ స్థైర్యాన్ని దెబ్బతీసే ప్రయత్నం చేయొద్దని పోలీసు అధికారుల సంఘం ప్రతినిధులు హితవు పలికారు.

40 ఏళ్ల రాజకీయ జీవితంలో 14 ఏళ్లు సీఎంగా ఉన్న చంద్రబాబు డీజీపీపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదని వారు అభిప్రాయపడ్డారు. డీజీపీపై చేసిన ఆరోపణలను తాము చంద్రబాబు వ్యక్తిత్వానికి ప్రతీకలుగానే భావిస్తామని మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో పోలీస్ అధికారుల సంఘం పేర్కొంది. 

ప్రస్తుత డీజీపీ గౌతమ్ సవాంగ్ గతంలో టీడీపీ ప్రభుత్వంలోనూ పనిచేశారని, అప్పుడు ఆయన కులం, మతం గుర్తుకురాలేదా? అని వారు  ప్రశ్నించారు. 35 ఏళ్లుగా ఐపీఎస్ అధికారిగా ప్రజలకు సేవలు అందిస్తున్న సవాంగ్‌పై చంద్రబాబు ఈ విధంగా ఆరోపణలు చేయడం దురదృష్టకరమని ఆవేదన వ్యక్తం చేశారు. మరోసారి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే కోర్టులను ఆశ్రయించాల్సి ఉంటుందని చంద్రబాబును హెచ్చరించారు. 

Follow Us:
Download App:
  • android
  • ios