ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్ రెడ్డి భద్రత విషయంలో పోలీసులు వ్యవహరిస్తోన్న తీరుపై సర్వత్రా విమర్శలు వెలువడుతున్నాయి. సీఎం కాన్వాయ్ అంటే మరో వాహనం ధరి దాపుల్లోకి కూడా రాకూడదు. ఎంతో జాగ్రత్త వహించాల్సిన సమయంలో ఇతర వాహనాల్లో సీఎం కాన్వాయ్ కలిసిపోయింది. 

భద్రతా ప్రమాణాలను ఏ మాత్రం లెక్క చేయకుండా ఏపీ పోలీసులు వ్యవహరిస్తున్నట్లు ఇటీవల జరిగిన ఘటనతో చర్చనీయాశంగా మారింది. అసలు వివరాల్లోకి వెళితే.. సామూహిక అక్షరాభ్యాసం కార్యక్రమంలో భాగంగా శుక్రవారం గుంటూరు జిల్లా, పెనుమాకలోని ఒక ప్రభుత్వ పాఠశాలకు వెళ్లిన జగన్ కార్యక్రమాన్ని ముగించుకొని నివాసానికి వెళ్లారు. 

ఈ క్రమంలో ఉండవల్లి సెంటర్‌ నుంచి తాడేపల్లి వైపుకు కాన్వాయ్ వెళుతుండగా ప్రకాశం బ్యారేజ్ వద్ద ఇతర వాహనాలు జగన్ కాన్వాయ్ లో కలిశాయి. సీఎం కాన్వాయ్ వస్తుందని తెలిసినప్పటికీ బ్యారేజ్ దగ్గర వాహనాలను ఆపకుండా పోలీసులు ఒక్కసారిగా వాహనాలను వదిలేశారు. దీంతో సీఎం ఉంటున్న కారు పక్కన సెక్యూరిటీ కాన్వాయ్ ల మధ్య ఇతర కార్లు వచ్చి చేరాయి. సీఎం కాన్వాయ్ వద్ద ఈ విధంగా జరగడం ప్రమాదాలకు తావిచ్చినట్లే అని పలువురు పోలీసు శాఖ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.