తమపై నిరాధార ఆరోపణలు చేసే రాజకీయ నేతలపై ఆంధ్రప్రదేశ్ పోలీసులు రివర్స్ అటాక్‌ మొదలుపెట్టారు. ఎలాంటి ఆధారం లేకుండా ఆరోపణలు చేసే నేతలకు నోటీసులు ఇవ్వాలని నిర్ణయించిన పోలీస్ శాఖ... వైసీపీ నేత వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కామెంట్లు చేసిన టీడీపీ నేత వర్లరామయ్యకు నోటీసులు జారీ చేశారు.

ఇప్పటికే కచ్చులూరు బోటు ప్రమాదం వ్యవహారంలో మాజీ ఎంపీ హర్షకుమార్‌కు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. అవసరమైతే చంద్రబాబు నాయుడుకు సైతం నోటీసులు ఇవ్వాలని పోలీసులు భావిస్తున్నారు.

కాగా వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులను తారుమారు చేసేందుకు కుట్ర జరుగుతోందంటూ వర్ల ఆరోపించారు. ఈ కేసులో అసలు ముద్దాయిలు ఎవరో సీఎం జగన్‌కు తెలుసునంటూ ఆయన వ్యాఖ్యానించారు.

కేసుకు ఏమాత్రం సంబంధం లేని వారిని నిందితులుగా చూపిస్తున్నారని.. అందుకే ప్రభుత్వం సీబీఐ దర్యాప్తును కోరడం లేదని వర్ల ఆరోపించారు. అసలు నిందితుల్ని దాచిపెట్టి నకిలీవాళ్లను చూపించడమే జగన్ ప్రభుత్వం అసలు ఉద్దేశ్యమని తెలిపారు. 

వర్ల వ్యాఖ్యలను సీరియస్‌గా తీసుకున్న పోలీసులు.. ఆయనకు 160 సీఆర్పీసీ కింద నోటీసులు పంపారు. చేసిన ఆరోపణలకు సంబంధించి సాక్ష్యాలు చూపాలని నోటీసుల్లో తెలిపారు.

దీనిపై వర్ల రామయ్య మండిపడ్డారు. వివేకా హత్య కేసులో తాను చేసిన ఆరోపణలకు కట్టుబడి ఉన్నానని వర్ల స్పష్టం చేశారు. గత నెల 15న దేవీపట్నం మండలం కచ్చులూరు వద్ద జరిగిన బోటు ప్రమాదం ఘటనపై ప్రజలు తప్పుదోవ పట్టించే విధంగా మాట్లాడారని ఆరోపిస్తూ హర్షకుమార్‌కు పోలీసులు నోటీసులు జారీచేశారు.

బోటులో 93 ఉంది ఉన్నారని ఎలా చెప్పారో తమకు ఆధారాలు తెలపాలని పోలీసులు నోటీసులలో పేర్కొన్నారు. ఇదే సమయంలో కోర్టు ప్రాంగణంలో ఉన్న షెడ్లను తొలగిస్తున్న సమయంలో అక్కడికి వెళ్లిన హర్షకుమార్ జిల్లా ప్రధాన న్యాయమూర్తితో పాటు మహిళా సిబ్బందిని దూషించారనే అభియోగంపై మరో కేసు నమోదైయ్యింది. ఈ పరిణామాల నేపథ్యంలో హర్షకుమార్ ఇప్పటికీ అజ్ఞాతంలోనే ఉన్నట్లు తెలుస్తోంది. 

మరోవైపు వివేకా హత్య కేసుపై జరుగుతున్న ప్రచారాలు, ఆరోపణలను ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ ఖండించారు. కేసు విచారణ సక్రమంగా, సమర్థవంతంగా జరుగుతోందని డీజీపీ స్పష్టం చేశారు.

రాజకీయ నేతలు మాట్లాడే మాటలను తాము పట్టించుకోబోమన్నారు. పోలీసులు వాళ్ల పని వాళ్లు చేస్తారని తెలిపారు. పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాల కార్యక్రమంలో మాట్లాడుతూ డీజీపీ ఈ వ్యాఖ్యలు చేశారు.