అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎలక్షన్ కౌంటింగ్ నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి భారీ భద్రతను ఏర్పాటు చేసింది ప్రభుత్వం. సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్‌ సందర్భంగా వైసీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి బుధవారం తాడేపల్లిలోని నివాసానికి చేరుకున్నారు. 

ఎన్నికల ఫలితాలు రానున్న నేపథ్యంలో వైఎస్ జగన్ కు ఉన్న జెడ్ సెక్యూరిటీని పక్కాగా అమలు చేయాలని సూచించింది. కేంద్ర హోంశాఖ ఆదేశాలతో వైఎస్ జగన్ నివాసం వద్ద భద్రత కట్టుదిట్టం చేసింది. అందులో భాగంగా జగన్ కు ఉన్న  జెడ్ కేటగిరి భద్రత కల్పించాలని పోలీస్ శాఖ నిర్ణయించింది. 

బుధవారం వైఎస్ జగన్ హైదరాబాద్ నుంచి తాడేపల్లి చేరుకోనున్న నేపథ్యంలో లోటస్ పాండ్ నుంచి శంషాబాద్ ఎయిర్ పోర్ట్ వరకు వైఎస్ జగన్ సంచారానికి బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని ఏర్పాటు చేయాలని తెలంగాణ పోలీస్ శాఖను ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖకు చెందిన అదనపు డైరెక్ట్ జనరల్ ఆఫ్ పోలీస్ ఈ నెల 21న లేఖ జారీ చేసింది. 

ఇకపోతే గన్నవరం విమానాశ్రయం చేరుకున్నప్పటి నుంచి ప్రత్యేక బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని ఏర్పాటు చేసింది పోలీస్ శాఖ. విజయవాడ నగర పోలీస్ కమిషనర్ ను, గుంటూరు రూరల్, అర్బన్ ఎస్పీలు జగన్ భద్రతకు సంబంధించి ప్రత్యేక చర్యలు తీసుకున్నారు.