అమరావతి: ఏపీకి అన్యాయం చేసినందునే ప్రధానమంత్రి మోడీ నోరు మెదపడం లేదని ఏపీ ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు  కుటుంబరావు చెప్పారు. ఎన్డీఏ నుండి టీడీపి వైదొలిగిన తర్వాత మోడీ ఎందుకు నోరు మెదపడం లేదని ఆయన ప్రశ్నించారు.

బీజేపీని ఇప్పుడంతా భారతీయ జుమ్లా పార్టీ అంటున్నారని  కుటుంబరావు ఎద్దేవా చేశారు.  రాష్ట్రానికి కేంద్రం నుండి నిధులు ఇచ్చినట్టు భ్రమలు కల్పించేలా ఆ పార్టీ ఎంపీ, బీజేపీ అధికార ప్రతినిధి జీవీఎల్ నరసింహరావు మాట్లాడుతున్నారన్నారు.

బుధవారం నాడు ఆయన అమరావతిలో మీడియాతో మాట్లాడారు. జీవీఎల్ నరసింహరావు  తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆయన విమర్శించారు. రాష్ట్రానికి కేంద్రం నుండి భారీగా  నిధులు వచ్చాయని భ్రమలు కల్గించేలా జీవీల్ నరసింహరావు మాట్లాడుతున్నారని ఆయన చెప్పారు. 

సాగరమాల ప్రాజెక్టు కింద  రూ.1800 కోట్లను కేంద్రం ఇచ్చినట్టు జీవీఎల్ ప్రకటించడాన్ని ఆయన తప్పుబట్టారు.ఈ ప్రాజెక్టు కింద కేంద్రం కేవలం రూ.5 కోట్లను మాత్రమే కేటాయించిందన్నారు.

సాగరమాల ప్రాజెక్టుకు రాష్ట్ర ప్రభుత్వం రూ.3750 కోట్లను ఖర్చు పెట్టిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. కోస్టల్ ఎకనామిక్ జోన్ ఊసే లేదన్నారు. కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం రాసిన లేఖలను మాత్రమే చూపిస్తున్నారని, కేంద్రం రాసిన లేఖలను ఎందుకు చూపడం లేదని కుటుంబరావు ప్రశ్నించారు.

592 ప్రాజెక్టుల్లో రాష్ట్రానికి 104 ప్రాజెక్టులను కేటాయించినట్టుగా జీవీఎల్ నరసింహరావు చెప్పడం అబద్దమన్నారు. రాష్ట్రానికి ఇచ్చిన హమీలను అమలు చేయడంలో కేంద్రం తన మాటను నిలుపుకోలేదని కుటుంబరావు చెప్పారు.గృహ నిర్మాణంలో లబ్దిదారుల ఎంపిక పారదర్శకంగా  సాగుతోందని చెప్పారు. 

ప్రతి వెధవ బీజేపీని విమర్శించేవాడు అంటూ జీవీఎల్ చేసిన వ్యాఖ్యలను ఆయన ప్రస్తావించారు. ఏపీ రాష్ట్రానికి అన్యాయం చేసిన బీజేపీ నేతలు తప్పుబట్టడంలో అర్ధం లేదన్నారు.