విజయవాడ: తెలంగాణ సీఎం కేసీఆర్ పై మండిపడ్డారు పీసీసీ ఉపాధ్యక్షులు తులసిరెడ్డి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంపై కేసీఆర్ ఆది నుంచి వివక్ష చూపుతూనే ఉన్నారని అది ఇంకా కొనసాగుతూనే ఉందని ఆరోపించారు. 

కృష్ణా, గోదావరి జలాలపై తెలంగాణ ప్రభుత్వ పెత్తనం ఏంటని నిలదీశారు. ఇప్పటికే కృష్ణమ్మను బంధించిన కేసీఆర్ గోదావరిని కూడా బంధించాలని చూస్తున్నారంటూ ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్ తెలంగాణ సీఎం కేసీఆర్ మాయలో పడొద్దని హితవు పలికారు. 

మరోవైపు ఏపీ ప్రభుత్వంపై విమర్శలు చేశారు. రైతుల సమస్యలను పరిష్కరించడంలో వైసీపీ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని విమర్శించారు. రాష్ట్రంలో రోజూ ఏదోఒక చోట రైతుల ఆత్మహత్యలు జరుగుతూనే ఉన్నాయని చెప్పుకొచ్చారు.  
 
ఇకనైనా రైతుల సమస్యలపై ప్రభుత్వం దృష్టి సారించాలని సూచించారు. రైతులకు రుణాలు, నాణ్యమైన విత్తనాలు, సకాలంలో సాగునీరు విడుదల చేయాలని కోరారు. పోలవరం ప్రాజెక్ట్ యొక్క ప్రస్తుత పరిస్థితిని ప్రజలకు వివరించేలా శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అలాగే రాష్ట్రంలో రైతాంగ సమస్యలు, సాగునీటి ప్రాజెక్టులపై అఖిలపక్ష సమావేశం నిర్వహించాలని తులసిరెడ్డి వైయస్ జగన్ ను కోరారు.