అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డిపై మాజీ సీఎం చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం జగన్ తన పాదయాత్రలో పోలవరానికి పునాదులే పడలేదని పదేపదే విమర్శించారని, ఎగతాళి చేశారని చెప్పుకొచ్చారు. 

తనను విమర్శించిన జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరోజు స్పిల్ వేలో ఉండే రివర్స్ స్లూయిజ్ గేట్ల ద్వారా 2 లక్షల క్యూసెక్కుల నీటిని ఎలా మళ్లించారో చెప్పాలని నిలదీశారు. 
అవహేళనలు, ఆరోపణలను ఎదుర్కొంటూనే పోలవరం ప్రాజెక్టును 70శాతం పూర్తిచేసినట్లు చంద్రబాబు నాయుడు ట్విట్టర్ లో పోస్ట్ చేశారు.  

మిగిలిన 30 శాతం ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేయకపోతే పోలవరం ఒక కలగానే మిగిలిపోతుందని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. వరద సమయంలో ప్రాజెక్టు కోసం పనిచేస్తున్న సంస్థలకు వెనక్కు వెళ్లిపోవాలి అంటూ నోటీసులు ఇవ్వడం సబబు కాదన్నారు. 

నిర్మాణ సంస్థలకు నోటీసులు ఇవ్వడం చూస్తుంటే ప్రాజెక్ట్ నిర్మాణం పట్ల జగన్ ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి, దూరదృష్టి ఏపాటిదో అర్థం అవుతోందని ఎద్దేవా చేశారు. తన ట్వీట్ చివరలో పోలవరం స్లూయిజ్ గేట్ల ద్వారా వరద నీటిని విడుదల చేసిన వీడియోను చంద్రబాబు పోస్ట్‌ చేశారు.

 

మరోవైపు కృష్ణానది ఎగువన శ్రీశైలం, నాగార్జున సాగర్ జలాశయాలలో నీళ్ళు లేకపోయినా పట్టిసీమ పుణ్యమా అని గోదావరి వరద జలాలతో ప్రకాశం బ్యారేజ్ కళకళలాడుతోందని అందుకు సంబంధించి ఫోటోలను సైతం ట్విట్టర్ లో అప్ లోడ్ చేశారు చంద్రబాబు. నదుల అనుసంధాన ప్రయోజనం ఇదేనని చెప్పుకొచ్చారు. పట్టిసీమ వృధా అన్నవారికి ఈ విషయం ఎప్పటికీ అర్థం కాదంటూ పరోక్షంగా జగన్ పై విమర్శలు చేశారు చంద్రబాబు.