పారిపోతున్న ఏపీ అధికారులు... అంతు చూస్తామంటున్న టీడీపీ

ఏపీలో వైసీపీకి కొమ్ముకాసిన అధికారుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయ్. గత ఐదేళ్లూ చంద్రబాబు సహా ప్రతిపక్ష నేతలను ఇబ్బంది పెట్టిన పలు కీలక శాఖల అధికారులు మెల్లగా జారుకుంటున్నారు. వారికంటే ముందే ఇది గ్రహించిన టీడీపీ అలెర్ట్ అయింది. కాగా, అధికారులెవరినీ రిలీవ్ చేయొద్దని, సెలవులు ఇవ్వొద్దని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. వైసీపీకి అనుకూలంగా పనిచేసిన అధికారుల పరిస్థితి ఇప్పుడెలా ఉంటుందో మరి....  

AP officers who are fleeing... TDP wants to see the end

ఆంధ్రప్రదేశ్‌లో కొత్త ప్రభుత్వం కొలువుదీరబోతున్న తరుణంలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరించిన రాష్ట్రస్థాయి ముఖ్య అధికారులు, ఐఏఎస్‌లు తప్పించుకునేందుకు ప్రయత్నిస్తున్నారట. వేరే రాష్ట్రాల నుంచి డిప్యూటేషన్‌పై ఆంధ్రప్రదేశ్‌కు వచ్చిన ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లు రిలీవ్ కోరుతూ లేఖలు రాశారట. మరికొందరు ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లు చంద్రబాబును కలిసేందుకు ప్రయత్నించగా... అపాయింట్‌ ఇవ్వలేదు. మరికొందరు తెలంగాణకు వెళ్లేందుకు కొన్ని కీలక శాఖల అధికారులు దరఖాస్తు చేసుకోగా... ఉన్నతాధికారులెవరికీ సెలవులు ఇవ్వొద్దని ప్రభుత్వం ఆదేశాలివ్వడం గమనార్హం. 


వైసీపీ హయాంలో చంద్రబాబుతో పాటు తెలుగుదేశం నేతలను ఇబ్బందులకు గురిచేసిన అధికారులను వదిలిపెట్టే పరిస్థితి కనిపించడం లేదు. వారు చేసిన తప్పులను బయటపెట్టి చర్యలు చేపట్టేందుకు ఇప్పటికే చకచకా ఏర్పాట్లు జరుగుతున్నట్లు తెలుస్తోంది.

ఇప్పటికే సెలవుపై వెళ్లాలని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కేఎస్‌ జవహర్‌ రెడ్డిని సాధారణ పరిపాలన శాఖ ఆదేశించింది. జీఏడీ ఆదేశాలతో ఆయన సెలవు పెట్టి వెళ్లారు. ఈ నెలలోనే జవహర్‌ రెడ్డి రిటైర్మెంట్‌ కూడా ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు ఆర్థికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రావత్‌ కూడా సెలవుపై వెళ్లారట. 


టీటీడీ ఈవో ధర్మారెడ్డి పరిస్థితేంటి..?
ఈ నేపథ్యంలోనే సెలవుపై వెళ్తాలని దరఖాస్తు చేసుకున్న టీటీడీ ఈవో ఈవో ధర్మారెడ్డి అభ్యర్థనను ప్రభుత్వం తిరస్కరించింది. ధర్మారెడ్డి తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో పదవికి అనర్హుడని మొదటి నుంచి టీడీపీ, బీజేపీ, జనసేన అరోపిస్తోంది. ఆయన్ను టీటీడీ పదవి నుంచి తొలగించాలని న్యాయస్థానాలను సైతం ఆశ్రయించారు. టీటీడీ పదవిని అడ్డుపెట్టుకొని జగన్‌కు అనుకూలంగా ధర్మారెడ్డి ఢిల్లీలో లాబీయింగ్‌లు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ధర్మారెడ్డి సెలవు దరఖాస్తును తిరస్కరించిన నేపథ్యంలో ఏం జరగబోతోంది..? అన్న అంశం రేకెత్తిస్తోంది. 

స్కిల్‌ డెవలప్‌మెంట్‌ ఇతర కేసుల్లో చంద్రబాబు సీఐడీ చాలా ఇబ్బందులు పెట్టింది. వైసీపీ ప్రభుత్వ ఆదేశాలతో ఎక్కడా లేని కేసులన్నీ పెట్టి సీఐడీ చీఫ్‌ సంజయ్‌, ఇతర అధికారులు వేధింపులకు దిగారన్న టీడీపీ వాదన. చంద్రబాబు ప్రభుత్వం కొలువుదీరనున్న వేళ సీఐడీ చీఫ్‌ సంజయ్‌ సెలవు పెట్టి స్విట్జర్లాండ్‌ వెళ్లాలనుకున్నారట. కారణం తెలియదు గాని, సెలవు ప్రతిపాదనను సంజయ్ వెనక్కి తీసుకున్నారు. చంద్రబాబుపై స్కిల్‌ డెవలెప్‌మెంట్‌ కేసులో అదనపు అడ్వొకేట్‌ జనరల్‌ సుధాకర్‌ రెడ్డితో పాటు సజయ్‌ ఢిల్లీ, హైదరాబాద్ సహా అనేక ప్రాంతాల్లో ప్రెస్‌మీట్లు పెట్టారు. చంద్రబాబుపై అవినీతి ఆరోపణలు చేశారని రాజకీయ నాయకుల మాదిరిగా మీడియా ఎదుట ఆరోపణలు చేశారు. 

ఇక, మాతృ సంస్థకు వెళ్తానని స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ఐజీ రామకృష్ణ, ఆంధ్రప్రదేశ్‌ నుంచి రిలీవ్‌ చేయాలని గనులశాఖ ఎండీ  వెంకట్‌రెడ్డి, తనను బాధ్యతల నుంచి రిలీవ్‌ చేయాలని సమాచారశాఖ కమిషనర్‌ విజయ్‌కుమార్‌రెడ్డి, మాతృశాఖకు పంపాలని బేవరేజెస్‌ కార్పొరేషన్‌ మాజీ ఎండీ వాసుదేవరెడ్డి ప్రభుత్వాన్ని కోరినట్లు తెలుస్తోంది. మరికొందరు అధికారులు సైతం తమ మాతృశాఖలకు బదిలీ చేయాలని కోరినట్లు సమాచారం. కాగా, ఆంధ్రప్రదేశ్‌కు డిప్యుటేషన్‌పై వచ్చిన అధికారుల రిలీవ్‌ చేయకూడదని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios