హైదరాబాద్: తెలుగు రాష్ఠ్రాలకు కొత్త గవర్నర్ రానున్నారా..? తొలి మహిళా ఐపీఎస్ అధికారి కిరణ్ బేడీ తెలుగు రాష్ట్రాలకు గవర్నర్ గా రానున్నారా... ప్రస్తుతం ఉన్న ఉమ్మడి గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ పై బదిలీ వేటు పడిందా...నరసింహన్ ను తొలగించి కిరణ్ బేడీని కేంద్రం రంగంలోకి దింపనుందని ప్రచారం జోరుగా సాగుతోంది. 

గత కొద్దిరోజులుగా తెలుగు రాష్ట్రాలకు కొత్త గవర్నర్ అంటూ పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఈఎస్ఎల్ నరసింహన్ బదిలీకి రంగం సిద్ధం కాడంతో ఆయన స్థానంలో కిరణ్ బేడీని పంపాలని కేంద్రం యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఇకపోతే కిరణ్ బేడీ 1949 జూన్ 9న పంజాబ్ రాష్ట్రంలోని అమృత్ సర్ లో జన్మించారు. 

తొలి మహిళా ఐపీఎస్ అధికారిగా గుర్తింపుపొందారు. 1972లో ఐపీఎస్ కు ఎంపికైన ఆమె పోలీస్ శాఖలో అనేక పదవులు చేపట్టడంతోపాటు అనేక సంస్కరణలు తీసుకువచ్చారు. అయితే బ్యూరో అఫ్ పోలీస్ రీసెర్చి అండ్ డెవెలప్‌మెంట్ డైరెక్టర్ జనరల్ గా పనిచేస్తూ డిసెంబర్ 2007లో స్వచ్ఛంద పదవీ విరమణ చేశారు. 

అనంతరం 2011లో అన్నాహజారే నేతృత్వంలో జరిగిన ఇండియన్ యాంటీ కరప్షన్ మూవ్ మెంట్ లో పాల్గొన్నారు. అనంతరం 2015 జనవరిలో భారతీయ జనతాపార్టీలో చేరారు. ఆ తర్వాత  జరిగిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ సీఎం అభ్యర్థిగా బరిలోకి దిగారు. అది కాస్త బెడిసికొట్టింది. 

అనంతరం 2016 మే 22న ఆమెను పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ గా కేంద్ర ప్రభుత్వం నియమించింది. ఆ నాటి నుంచి ఇప్పటి వరకు ఆమె పదవిలో కొనసాగుతున్నారు. ఆమె తెలుగు రాష్ట్రాలకు గవర్నర్ గా వస్తున్నారన్న విషయం ఇప్పుడు తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. 

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గవర్నర్ గా సుదీర్ఘకాలం పనిచేసిన నరసింహన్ అత్యధిక మంది ముఖ్యమంత్రులతో ప్రమాణ స్వీకారం చేయించిన గవర్నర్ గా రికార్డు సృష్టించారు. రాష్ట్ర విభజన సమయంలో ఆనాటి యూపీఏ  ప్రభుత్వం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గవర్నర్ గా నరసింహన్ ను నియమించింది. 

ఆ తర్వాత బీజేపీ కేంద్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ హయాంలో నియమించిన గవర్నర్లను తొలగించినా నరసింహన్ ను మాత్రం తొలగించలేదు. కేంద్రంలో కీలకశాఖలో ఉండే ఓ అధికారికి గవర్నర్ అత్యంత సన్నిహితంగా ఉండటంతో ఆయనపై బదిలీవేటు పడలేదు. 

విపరీతమైన దైవభక్తి కలిగిన 76 ఏళ్ళ  నర్సింహన్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చివరి గవర్నర్ గా కొత్త తెలుగు రాష్ట్రాలకు తొలి గవర్నర్ గా పనిచేసి తనదైన ముద్ర వేసుకున్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో సంయమనంతో వ్యవహరించారని పేరుంది. 

అలాగే రాష్ట్ర విభజన అనంతరం ఏర్పడిన పరిణామాలు ముఖ్యంగా ఓటుకు నోటు, జోనల్ వ్యవహారం, నీటి పారుదల విషయాలపై సమస్యలు ఎదురైనప్పుడు చురుగ్గా, లౌక్యంతో వ్యవహరించారు. తెలంగాణ, సమైక్యాంధ్ర ఉద్యమాలు, రాష్ట్రపతి పాలన వంటి క్లిష్ట పరిస్థితుల్లో నరసింహన్ సమర్ధంగా పనిచేశారు. 

రాష్ట్ర విభజన అనంతరం ముఖ్యమంత్రి పదవికి కిరణ్ కుమార్ రెడ్డి రాజీనామా చేసినా పరిపాలన స్తంభించకుండా చురుగ్గా వ్యవహరించారు. పెట్రోలు బంకుల డీలర్లు సమ్మె చేసినప్పుడు ఆయన కలగజేసుకున్న గంటలోపే వాళ్లు సమ్మె విరమించారు. సార్వత్రిక ఎన్నికల సమయంలోనూ కీలకంగా పనిచేశారు.