అమరావతి: తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడుపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ. జగన్ పాలనపై చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను ఖండించారు. 

కడుపు మంటతో చంద్రబాబు అలా విమర్శిస్తున్నారంటూ విరుచుకుపడ్డారు. వైసీపీ ప్రభుత్వం 100 రోజులపాలన చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుందని తెలిపారు. ప్రభుత్వం చేసే ప్రతి పని ప్రజల కోసమేనని చెప్పుకొచ్చారు.

అర్థరాత్రి హైదరాబాద్ నుంచి పారిపోయి వచ్చిన దొంగ చంద్రబాబు నాయుడు అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రాన్ని ఐదేళ్లపాటు కొల్లగొట్టిన వారు జగన్ ను విమర్శిస్తారా అంటూ మండిపడ్డారు. 

టీడీపీ ప్రభుత్వం చేయలేని ఎన్నో పనులను సీఎం జగన్ చేసి చూపించారని నాయకుడు ఎలా ఉండాలో జగన్ చూపిస్తున్నారని ప్రశంసించారు. ప్రజలకు ఎవరు మేలు చేస్తారో వారే నాయకులు అవుతారని పునరుద్ఘాటించారు. 

గత పాలనలో  కంటే ఇప్పుడే శాంతి భద్రతలు అదుపులో ఉన్నాయని తెలిపారు. అధికారం ఉందని గతంలో టీడీపీ నేతలు అహంకారంతో ప్రవర్తించారని, ప్రజాస్వామ్యంలో చట్టాలు వాటి పని అవి చేసుకుంటూ పోతాయని బొత్స సత్యనారాయణ తెలిపారు. 

రాజధానిపై మళ్లీ కీలక వ్యాఖ్యలు చేసిన బొత్స
నవ్యాంధ్ర రాజధాని అమరావతిపై మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు మంత్రి బొత్స సత్యనారాయణ. అమరావతియే రాజధాని అని గత ప్రభుత్వం ఏమైనా గెజిట్ విడుదల చేసిందా అంటూ నిలదీశారు. తాత్కాలిక నిర్మాణంలా తాత్కాలిక రాజధాని అని పేరు పెట్టి జగన్ ను విమర్శిస్తారా అంటూ చంద్రబాబుపై మండిపడ్డారు. 

ఈ రాష్ట్రానికి చిరునామా లేకుండా చేసింది చంద్రబాబు కాదా అంటూ నిలదీశారు. తాత్కాలిక రాజధాని కాబట్టే పెట్టుబడులు రావడం లేదన్నారు. పెట్టుబడిదారులు ఎక్కడికి వెళ్లిపోరని స్పష్టం చేశారు. పెయిడ్ ఆర్టిస్టులను పెట్టి మరీ అసత్య ప్రచారాలు చేస్తున్నారంటూ మండిపడ్డారు. 

ఎన్ని జిమ్మిక్కులు చేసినా వైసీపీకంటూ  కొన్ని విధానాలు ఉన్నాయని వాటిని అనుసరించి ముందుకు వెళ్తామన్నారు. వైయస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అవినీతిని అరికట్టామని తెలిపారు. స్పీకర్ అనే పదవికి మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు మచ్చ తెచ్చారంటూ ఆరోపించారు. 

రాజధాని ప్రాంతంలో ఎమ్మెల్యేనే టీడీపీ నేతలు కులం పేరుతో దూషించారంటే టీడీపీ నేతల దౌర్జన్యాలు ఎలా ఉన్నాయో ఇట్టే అర్థమవుతుందన్నారు. ప్రత్యేక హోదాపై వైసీపీ వెనకడుగు వేయదన్నారు. 

హోదా కోసం నిరంతరం పోరాటం చేస్తూనే ఉంటామని తేల్చి చెప్పారు. ప్రధాని నరేంద్రమోదీతో సీఎం జగన్ మరోసారి భేటీ అయ్యి ప్రత్యేక హోదాపై చర్చిస్తారని మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు.