అమరావతి: తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడుపై నిప్పులు చెరిగారు మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ. మాట్లాడితే వైసీపీ అరాచకాలు అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నారని తమ హయాంలోనే ప్రజలు సంతోషంగా ఉన్నారని చెప్పుకొచ్చారు.

నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిపై పదేపదే ఆరోపణలు చేస్తున్న చంద్రబాబు నాయుడు ఆయనను అరెస్ట్ చేసిన విషయాన్ని గుర్తించాలన్నారు. ఎంపీడీవో సరళపై దాడి అంటూ వచ్చిన ఆరోపణల నేపథ్యంలో ఆయనపై పోలీసులు చట్టప్రకారంగా చర్యలు తీసుకున్నారని చెప్పుకొచ్చారు. 

కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కేసులో వైసీపీ ప్రభుత్వం గానీ, సీఎం జగన్ గానీ, డీజీపీ గౌతం సవాంగ్ గానీ ఎలాంటి జోక్యం చేసుకోలేదని చెప్పుకొచ్చారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పటికీ ఆరోపణలు వస్తేనే అరెస్ట్ చేయించినట్లు గుర్తు చేశారు.  

చంద్రబాబు నాయుడు పాలనలో తెలుగుదేశం పార్టీ నాయకులు, ఎమ్మెల్యేలు చేసిన దౌర్జన్యాలు అన్నీ ఇన్నీ కావన్నారు. ఆనాటి దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అరాచకాలు చేసినా ఏనాడు చంద్రబాబు ఒక కేసు కూడా పెట్టించలేదన్నారు. 

ఒక మహిళా అధికారిపై దాడికి పాల్పడితే ఖండించాల్సింది పోయి షెటిల్మెంట్ చేశారని ఘాటుగా విమర్శించారు. సీఎం జగన్మోహన్ రెడ్డి చంద్రబాబులా వ్యవహరించలేదని తప్పుంటే ఉపేక్షించొద్దని హెచ్చరించిన వ్యక్తి సీఎం జగన్ అని చెప్పుకొచ్చారు.

కాల్ మనీ సెక్స్ రాకెట్ కేసుల్లో తెలుగుదేశం పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అభియోగాలు ఎదుర్కొన్నప్పటికీ ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు. ఒక్కరిమీద అయినా కేసు పెట్టారా అని నిలదీశారు మంత్రి బొత్స సత్యనారాయణ. 

ఇపోతే ఒక సీనియర్ ఐపీఎస్ అధికారిపై తెలుగుదేశం పార్టీకి చెందిన ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ భౌతిక దాడులకు పాల్పడినా ఆ ముగ్గురిపై కనీసం కేసు కూడా రిజిస్టర్ అయిన దాఖలాలు లేవన్నారు. తమ ప్రభుత్వం అలాంటిది కాదన్నారు. ఆరోపణలు ఎదుర్కొన్నది సొంద పార్టీ ఎమ్మెల్యే అయినా సరే చర్య తప్పదని అదీ తమ పాలన అని చెప్పుకొచ్చారు మంత్రి బొత్స సత్యనారాయణ.