మేము పందులమైతే నీవు ఊర పందివి. సీఎం చంద్రబాబు, రాజశేఖర్‌రెడ్డి కంటే ఒక సంవత్సరం చిన్నవాడు. అంత పెద్ద మనిషిని పట్టుకుని తిట్టడం జగన్ వ్యక్తిత్వానికి నిదర్శనం
ప్రతిపక్ష నేత వైస్ జగన్మోహన్ రెడ్డిపై మంత్రులు విరుచుకుపడ్డారు. ''వైఎస్ పాలనలో జగన్ రూ.లక్ష కో ట్లు దోచుకున్నాడు. ఆ మొత్తం ఇప్పటికి వడ్డీతో కలసి రూ.3 లక్షల కోట్లు అయ్యుంటుంది’’ అని మంత్రి ఆదినారాయణ రెడ్డి ధ్వజమెత్తారు. ఆదివారం అనంతపురం జిల్లా పుట్టపర్తి నియోజకవర్గ పరిధిలోని నిడిమామిడిలో చీఫ్ విప్, స్థానిక ఎమ్మెల్యే పల్లె రఘునాథరెడ్డి అధ్యక్షతన తెలుగుదేశం పార్టీ ఆత్మీయ సదస్సును నిర్వహించారు.
పెడపల్లి నుంచి నిడిమామిడి వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రులు ఆదినారాయణరెడ్డి, కొల్లు రవీంద్ర, కాల్వ శ్రీనివాసులు, జవహర్ మాట్లాడుతూ, వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అవినీతిపై ధ్వజమెత్తారు.
మంత్రి ఆదినారాయణరెడ్డి మాట్లాడుతూ, ‘‘నేను జగన్ అని పిలిచేవాడిని. అత్యంత సాన్నిహిత్యముంది. అయినా మమ్మల్ని ప్రజాప్రతినిధులుగా కాక పందులుగా చూశావు. మేము పందులమైతే నీవు ఊర పందివి. సీఎం చంద్రబాబు, రాజశేఖర్‌రెడ్డి కంటే ఒక సంవత్సరం చిన్నవాడు. అంత పెద్ద మనిషిని పట్టుకుని తిట్టడం జగన్ వ్యక్తిత్వానికి నిదర్శనం’’ అని మండిపడ్డారు.
మంత్రి కాల్వ శ్రీనివాసులు మాట్లాడుతూ, ‘‘టీడీపీని బలహీన పరిచేందుకు దుష్టశక్తులు నానా కుతంత్రాలు పన్నుతున్నాయి. ప్రధాని మోదీ చేతిలో జగన్, పవన్ కీలుబొమ్మలు’’ అంటూ మండిపడ్డారు.
‘‘వైఎస్సార్ పరిపాలనలో పరిటాల రవిని హత్య చేశారు. ఫ్యాక్షన్ రాజకీయాలకు అడ్డా వైసీపీ. టీడీపీకి జిల్లా కంచుకోట. ఎన్టీఆర్‌ను ఇందిరమ్మ బర్తరఫ్ చేస్తే నెల రోజుల్లోనే తిరిగి ఎన్టీఆర్‌ను సీఎంని చేసిన ఘనత టీడీపీ కార్యకర్తలదే’’ అని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు.
‘‘జగన్ చేస్తున్న సంకల్ప యాత్ర పాప పరిహార యాత్రగా సాగుతోంది. జగన్ చరిత్ర ఫ్యాక్షన్ చరిత్ర. జగన్ పాదయాత్ర ముద్దుల యాత్ర’’ అని మంత్రి జవహర్ విమర్శించారు. చీఫ్‌విప్ పల్లె రఘునాథరెడ్డి మాట్లాడుతూ, ‘‘వైసీపీ రౌడీల పార్టీ. దోచుకుని, దాచుకోవాలన్న తాపత్రయం ఉన్న పార్టీ’’ అన్నారు. ఎంపీ నిమ్మల కిష్టప్ప, పలువురు వక్తలు మాట్లాడుతూ, జగన్, పవన్, బీజేపీలపై విమర్శలు గుప్పిస్తూ, తెలుగుదేశం చేసిన పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను వివరించారు.
