అమరావతి: వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై మంత్రి యనమల రామకృష్ణుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారం కోసం ఏపీని టీఆర్‌ఎస్‌కు తాకట్టు పెట్టాలని జగన్‌ కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. 

గురువారం మీడియాతో మాట్లాడిన ఆయన ఏపీలో అనుకూల పరిస్థితులు లేకపోవడంతో వైఎస్ జగన్, కేసీఆర్ తో కలిసి కుట్రలు చేస్తున్నారంటూ మండిపడ్డారు. జగన్న కుట్ర చాలా ప్రమాదకరమైనదంటూ ధ్వజమెత్తారు. రాష్ట్రానికి అన్యాయం చేసేలా వైఎస్ జగన్ ప్రవర్తిస్తున్నారంటూ ఆరోపించారు. 

ప్రధాని మోదీ, కేసీఆర్, జగన్‌ కుట్రలు సఫలమైతే రాష్ట్రానికి సాగునీరు రాదన్నారు. విభజన చట్టం ద్వారా రావాల్సిన నిధులు ఏపీకి రావని తెలిపారు. టీడీపీని ఎదుర్కొనలేక ముగ్గురు కలిసి కూటమిగా ఏర్పడుతున్నారని విమర్శించారు. మోదీ నాయకత్వంలో జగన్, కేసీఆర్ కుట్రలు పన్నుతున్నారంటూ దుయ్యబుట్టారు. 

అభివృద్ధిని అడ్డుకునేవారిలో వైఎస్ జగన్ ప్రథముడు అంటూ తిట్టిపోశారు. రాజకీయంగా ఏపీకి మరింత ద్రోహం చెయ్యాలన్న దుర్భుద్ధితో ముగ్గురూ వ్యవహరిస్తున్నారంటూ మండిపడ్డారు. హైదరాబాద్ కేంద్రంగా జరుగుతున్న బెదిరింపులు ప్రజాస్వామ్య వ్యతిరేక చర్య అంటూ చెప్పుకొచ్చారు. 

గతంలో కేసీఆర్‌ చేసిన ధూషణలను ఏపీ ప్రజలు మర్చిపోరని గుర్తు చేశారు. హైదరాబాద్‌లో ఉన్న ఏపీ ప్రజలను టీఆర్‌ఎస్‌ నేతలు బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ఏపీలో టీడీపీకి వ్యతిరేకంగా పనిచేయాలని ఒత్తిడి చేస్తున్నారని మంత్రి యనమల ఆరోపించారు. 

వైస్ జగన్‌కు ఉన్నంత పదవి, డబ్బు వ్యామోహం దేశవ్యాప్తంగా ఎవరికీ ఉండదన్నారు మంత్రి నక్కా ఆనందబాబు. రాష్ట్రాభివృద్ధి, సంక్షేమ పథకాలు చూసి జగన్, కేసీఆర్ లు ఓర్వలేకపోతున్నారని, అందుకే కుట్రలు పన్నుతున్నారంటూ ఆరోపించారు.