విజయవాడ: దేవాలయాలపై దాడుల వెనుక ఎవరున్నారో డీజీపీ బయటపెట్టడంతో బీజేపీ నేతలకు వణుకు పుట్టిందని  మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ విమర్శించారు.

ఆదివారం నాడు మధ్యాహ్నం ఏపీ దేవాదాయశాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ విజయవాడలో మీడియాతో మాట్లాడారు.

బీజేపీకి నేతలకు భయపడేది లేదన్నారు.తాము తప్పులు చేసినట్టుగా ఆధారాలుంటే కేంద్రానికి ఫిర్యాదు చేసుకోవచ్చని ఆయన సవాల్ విసిరారు. 

డీజీపీని బెదిరించే  విధంగా ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు లేఖ రాశాడన్నారు.  దేవాలయాల్లో దాడులు, విగ్రహాల ధ్వంసం కేసుల్లో వాస్తవాలు బయటపెట్టిన డీజీపీని టీడీపీ, బీజేపీ నేతలు టార్గెట్ చేస్తున్నారని ఆయన ఆరోపించారు.

అధికారుల్ని, ప్రభుత్వాన్ని మీరు బెదిరించాలని భావిస్తున్నారా  అని మంత్రి సోము వీర్రాజును ప్రశ్నించారు.ఏపీలో విగ్రహాల ధ్వంసం, దేవాలయాలపై దాడుల ఘటనలపై పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్నారని మంత్రి గుర్తు చేశారు.

మత విద్వేషాలు రెచ్చగొట్టి తిరుపతి ఉప ఎన్నికల్లో రాజకీయంగా లబ్ది పొందే ప్రయత్నాలను మానుకోవాలని ఆయన బీజేపీ నేతలకు హితవు పలికారు.

మత విద్వేషాలు రెచ్చగొట్టేందుకు టీడీపీ, బీజేపీలు ప్రయత్నిస్తే చూస్తూ ఊరుకోబోమని ఆయన హెచ్చరించారు. అంతర్వేది రథం దగ్ధమైన ఘటనపై సీబీఐ విచారణ కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించి నాలుగు దాటినా ఎందుకు ఈ కేసు ముందుకు సాగలేదో చెప్పాలన్నారు. 

also read:సవాంగ్‌ను డీజీపీ పోస్టు నుండి తొలగించాలి: సోము వీర్రాజు ఫైర్

అంతర్వేది ఘటనపై సీబీఐకి రికార్డులు అప్పగించినా కూడ ఇంతవరకు దోషులను ఎందుకు పట్టుకోలేదో చెప్పాలని ఆయన ప్రశ్నించారు. 

అర్చకులు, ఇమామ్ లు, ఫాస్టర్లకు సమానంగా  వేతనాలను ఇస్తున్నామని మంత్రి చెప్పారు.  ఒక్క ఫాస్టర్లకే వేతనాలు ఇస్తున్నట్టుగా సోము వీర్రాజు తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు.