విజయవాడ: జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పై కీలక వ్యాఖ్యలు చేశారు రాష్ట్ర దేవాదాయ ధర్మదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్. పవన్ కళ్యాణ్ తెలుగుదేశం పార్టీతో లోపాయికార ఒప్పందం కుదుర్చుకున్నారని విమర్శించారు. 

2014 ఎన్నికల్లోనే కాకుండా 2019 ఎన్నికల్లోనూ జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తెలుగుదేశం పార్టీతో లోపాయికార ఒప్పందం కుదుర్చుకున్నారని ఆరోపించారు. ఇప్పుడు కూడా పవన్ కళ్యాణ్ లోపాయికార ఒప్పందం కుదుర్చుకున్నట్లుగా మాట్లాడుతున్నారంటూ విమర్శించారు. 

వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 100 రోజులు కాకముందే ప్రభుత్వంపై విమర్శలు చేస్తారా అంటూ మండిపడ్డారు. విజయవాడ పశ్చిమయ నియోజకవర్గానికి చెందిన జనసేన పార్టీ నాయకులు వైసీపీలో చేరారు. 

జనసేన పార్టీ నాయకులకు మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ వైసీపీ కండువా కప్పారు. వైసీపీలో చేరిన జనసేన పార్టీ నాయకులకు త్వరలోనే సముచిత స్థానం కల్పిస్తామని హామీ ఇచ్చారు. సీఎం జగన్ బీసీ, ఎస్సీ, ఎస్టీలకు పెద్ద పీట వేస్తున్నారని చెప్పుకొచ్చారు. 

వైయస్ జగన్ పాలనను చూసే అనేకమంది వైసీపీలో చేరుతున్నారని చెప్పుకొచ్చారు. స్థానిక యువతకు పరిశ్రమల్లో 75 శాతం ఉద్యోగ అవకాశాలు కల్పించేలా బిల్లు తెచ్చినట్లు చెప్పుకొచ్చారు. దేశచరిత్రల్లోనే కాంట్రాక్ట్ పనులు రిజర్వేషన్లు ప్రకారం అమలు జరగాలని చెప్పిన నాయకులు సీఎం జగన్ ఒక్కరేనని మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ స్పష్టం చేశారు.