బాలింతలు, గర్బిణీలకు ఇబ్బంది కలిగించకుండా వెంటనే  సమ్మె విరమించి విధుల్లో చేరాలని ఏపీ స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి ఉషశ్రీ చరణ్ అంగన్‌వాడీ కార్యకర్తలు, సహాయకులను కోరారు . అంగన్వాడీ కార్యకర్తలు, సహాయకులు 62 ఏళ్ల వరకు ఉద్యోగంలో కొనసాగేందుకు అవకాశం కల్పిస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది.

తమ డిమాండ్ల సాధన కోసం గత కొన్నిరోజులుగా ఆంధ్రప్రదేశ్‌లో అంగన్‌వాడీ కార్యకర్తలు, సహాయకులు ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. బాలింతలు, గర్బిణీలకు ఇబ్బంది కలిగించకుండా వెంటనే సమ్మె విరమించి విధుల్లో చేరాలని ఏపీ స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి ఉషశ్రీ చరణ్ కోరారు. అంగన్‌వాడీ కార్మికుల డిమాండ్లను పరిష్కరిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అంగన్వాడీ కార్యకర్తలు, సహాయకులు 62 ఏళ్ల వరకు ఉద్యోగంలో కొనసాగేందుకు అవకాశం కల్పిస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది. కార్యకర్తలకు రూ. లక్ష, సహాయకులకు రూ.40 వేల వరకు సేవా ప్రయోజనం పెంపు చేస్తున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది.

సహాయకులను కార్యకర్తలుగా నియమించేందుకు గరిష్ట వయస్సు 50 ఏళ్లకు పెంచింది. ప్రాజెక్టు / సెక్టార్ సమావేశాలకు హాజయ్యే కార్యకర్తలకు, సహాయకులకు టీఏ/డీఏలు చెల్లించేందుకు ప్రభుత్వం ఓకే చెప్పింది. అంగన్‌వాడీల అద్దె భవనాలకు నవంబరు వరకూ అద్దె చెల్లింపు చేశామని ఉషశ్రీ చరణ్ తెలిపారు. భవనాల నిర్వహణకు రూ.6.36 కోట్లు, పరిపాలనా ఖర్చులకు రూ.7.81 కోట్లు వెచ్చించినట్లు మంత్రి వెల్లడించారు. సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు అంగన్‌వాడీలకు గ్రాట్యుయిటీ చెల్లించే అంశంపై కేంద్రానికి లేఖ రాశామని, అక్కడి నుంచి వచ్చిన స్పందన అనంతరం ఈ విషయాన్ని కూడా పరిశీలిస్తామని ఉషశ్రీ చరణ్ చెప్పారు.

అంగన్‌వాడీల గౌర వేతనం పెంచుతామని వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి ఎన్నికల వాగ్దానంలో ఇచ్చిన హామీ మేరకు రూ.11,500/ లను చెల్లిస్తున్నామని మంత్రి స్పష్టం చేశారు. అంగన్‌వాడీ కార్యకర్తలకు గౌరవ వేతనం చెల్లించడంలో దేశంలో 6వ స్థానంలోనూ, సహాయకుల విషయంలో 4వ స్థానంలో ఆంధ్రప్రదేశ్ ఉన్నట్లు ఆమె తెలిపారు. ప్రస్తుతం అంగన్‌వాడీల గౌరవ వేతనం పెంచేందుకు ఇది సరైన సమయం కాదని మంత్రి వెల్లడించారు. 

అంగ‌న్‌వాడీల ద్వారా నాణ్యమైన సరుకులను పంపిణీ చేసే అంశాన్ని పర్యవేక్షించేందుకు దాదాపు 500 మంది సూపర్‌వైజర్లను కూడా తమ ప్రభుత్వం నియమించినట్లు ఉషశ్రీ చరణ్ పేర్కొన్నారు. అర్హతను బట్టి అంగన్‌వాడీలకు సంక్షేమ పథకాలను కూడా అందజేస్తున్నట్లు ఆమె తెలిపారు. అంగన్‌వాడీ కేంద్రాల తాళాలను ఎవరూ పగుల కొట్టలేదని, బాలింతలకు, గర్బిణీలకు ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా ఉండేందుకై కలెక్టర్లు వాటిని నడిపేలా చర్యలు తీసుకున్నారని మంత్రి స్పష్టం చేశారు. రాష్ట్రంలో అంగన్‌వాడీల పనితీరు అత్యుత్తమంగా ఉందని నీతి ఆయోగ్ కూడా ప్రశంసించిన విషయాన్ని ఉషశ్రీ చరణ్ గుర్తు చేశారు.